నేనూ మట్టిమోస్తా
సాక్షి, సంగారెడ్డి: చెరువుల పూడికతీత పనులను పండుగలా చేపట్టి మెతుకుసీమలో జలకళ తీసుకువస్తామని నీటిపారుదలశాఖ మంత్రి హరీష్‌రావు తెలిపారు. ‘చెరువులు, కుంటల పూడికతీత పనుల్లో నేనూ పాల్గోవడంతో పాటు రైతులతో కలిసి 46 మండలాల్లో తట్టపట్టి మట్టిమోస్తానని’ ఆయన తెలిపారు. ప్రజలు, రైతులు ఊరు ఊరంతా కదిలి డప్పులు, బోనాలు, బతుకమ్మలతో చెరువుల వద్దకు వచ్చి పూడికతీత పనుల్లో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు.
సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో జరిగిన జెడ్పీ ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో ఆయన మా ట్లాడుతూ.. ఉమ్మడిరాష్ట్రంలో తెలంగాణ చెరువులు, కుంటలు విధ్వంసానికి గురయ్యాయన్నారు. ఆంధ్రపాలకులు తెలంగాణలోని చెరువులు, కుంటలకు నిధులు కేటాయించకుండా పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. దీంతో సాగు, తాగునీటి సమస్య తలెత్తడంతో పాటు భూగర్భజలాలు దారుణంగా పడిపోయాయన్నారు. ఇది గుర్తించే టీఆర్‌ఎస్ ప్రభుత్వం తెలంగాణలోని చెరువులు, కుంటలకు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు ‘మిషన్ కాకతీయ’కు శ్రీకారం చుట్టిందన్నారు. జిల్లాలో మొదటి విడతలో 1,939 చెరువుల మరమ్మతు పనులు చేపట్టనున్నట్లు తెలిపారు.
చెరువు మరమ్మతు పనుల్లో భాగంగా చెరువుకట్టలు, అలుగులు, తూముల మరమ్మతు పనులు చేయనున్నట్లు చెప్పారు. చెరువుల్లో పేరుకుపోయిన పూడికను తీయనున్నట్లు తెలిపారు. చెరువుల్లోంచి తీసిన పూడికతీతను రైతులు పొలాల్లో చల్లుకోవాలని సూచించారు. చెరువుమట్టి పొలాల్లో వేయటం వల్ల పంటదిగుబడి పెరుగుతుందన్నారు. ఈవిషయాన్ని స్వయంగా ఇక్రిశాట్ శాస్త్రవేత్తలు చెప్పారన్నారు.
రైతులు తరలించుకు వెళ్లాక కూడా ఇంకా పూడికమట్టి మిగిలిపోతే ఇటుకల తయారీకి ఉపయోగించుకోవాలని సూచించారు. పూడికతీత పనుల్లో రైతులు, ప్రజలు పాలుపంచుకునేలా జెడ్పీటీసీ, ఎంపీపీలు కృషి చేయాలని కోరారు. ‘మిషన్‌కాకతీయ’లో భాగంగా చెరువు కట్టలపై ఈతచె ట్లు, శిఖం భూమిలో ఈత, సిల్వర్ ఓక్ చెట్లు నాటనున్నట్లు వివరించారు. అటవీప్రాంతాల్లో ని చెరువుల మరమ్మతులకు చర్యలు తీసుకోవాలని సూచించారు. చెరువుల మరమ్మతు పును ల్లో అవినీతి జరగుకుండా చూస్తామన్నారు. దీ నిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
ప్రతిపాదనల జాప్యంపై అసంతృప్తి...
‘మిషన్ కాకతీయ’లో భాగంగా జిల్లాలో తొలి విడతగా ఎంపిక చేసిన చెరువుల సర్వే, ప్రతిపాదనల రూపకల్పనలో జాప్యంపై మంత్రి హరీష్‌రావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నియోజకవర్గాల వారీగా ప్రతిపాదనల రూపకల్పనను సమీక్షించిన మంత్రి హరీష్‌రావు అధికారుల పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు.
జనవరి మొదటివారం వరకు ప్రతిపాదనలు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఎస్‌ఈని ఆదేశిం చారు. జిల్లాలో చెరువుల కబ్జాకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను సూచిం చారు. సంగారెడ్డి, పటాన్‌చెరు, జహీరాబాద్, జిన్నారం, తూప్రాన్ తదితర ప్రాంతాల్లో చెరువులు కబ్జాకు గురయ్యాయన్నారు. తహశీల్దార్‌లు సర్వే చేసి ఎఫ్‌టీఎల్ (ఫుల్ ట్యాంకు లెవ ల్) నిర్ధారించాలని ఆదేశించారు. ఎవరు అడ్డువచ్చినా వినవద్దని సూచించారు.
పార్టీలకు అతీతంగా అభివృద్ధి పనులు...
గత ప్రభుత్వాలకు భిన్నంగా అధికారపక్షం, ప్రతిపక్షం అన్న భేదాభిప్రాయాలు లేకుండా అవసరమైన అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు మంత్రి హరీష్‌రావు వివరించారు. ‘మిషన్ కాకతీ య’లో అన్ని ప్రాంతాలకు ప్రాధాన్యం ఇచ్చామన్నారు. రోడ్ల అభివృద్ధికి రూ.1,090 కోట్లు విడుదలైతే నారాయణఖేడ్, జహీరాబాద్ నియోజకవర్గాలకు ఎక్కువ నిధులు కేటాయించామన్నారు.
జనవరి 1 నుంచి హాస్టళ్లలో విద్యార్థులకు సన్నబియ్యం అన్నం పెడుతున్నామని, అంగన్‌వాడీల్లో గర్భిణులు, పిల్లలకు ఏడాదం తా పౌష్టిక ఆహారం అందజేస్తున్నామని తెలి పారు. 1వ తేదీన ప్రజాప్రతినిధులంతా హాస్టళ్లలో భోజనం చేయాలని కోరారు. డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ. రాష్ట్ర ప్రభుత్వం ప్రజాసంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వాలు మైనర్ ఇరిగేషన్‌ను కుప్పకూల్చాయని విమర్శించారు.
టీఆర్‌ఎస్ ప్రభుత్వం మిషన్‌కాకతీయతో చెరువులకు పూర్వవైభవం తీసుకువస్తున్నట్లు చెప్పారు. ఎమ్మెల్యే గీతారెడ్డి మాట్లాడుతూ, మిషన్‌కాకతీయ ప్రతిపాదనల రూపకల్పనలో జాప్యాన్ని నివారించాలన్నారు. జహీరాబాద్ నియోజకవర్గంలో 32 చెక్‌డ్యాంలను మిషన్‌కాకతీయలో మరమ్మతు చేయాలని కోరారు. నిజాం దక్కన్ షుగర్ ఫ్యాక్టరీలను స్వాధీనం చేసుకోవాలని, చెరుకు రైతులకు మద్దతు ధర చెల్లించాలని డిమాండ్ చేశా రు. ఎమ్మెల్యే రామలింగారెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రజల అభ్యున్నతి కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్లు వివరించారు.
ఎమ్మెల్యే కిష్టారెడ్డి మాట్లాడుతూ, మిషన్‌కాకతీయను అభినందించారు. జిల్లాలో వర్షాభావం పరిస్థితుల నేపథ్యంలో కరువు ప్రాంతంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ రాములు నాయక్ మాట్లాడుతూ, వెనకబడిన నారాయణఖేడ్ నియోజకవర్గంలో అదనంగా చెరువులను మరమ్మతు చేయాలని, ఈ ప్రాంత అభివృద్ధి కోసం పరిశ్రమలు ఏర్పాటు చేయాలని కోరారు.
జెడ్పీటీసీలు ప్రభాకర్, శ్రీనివాస్‌రెడ్డి, కవిత, సంజీవరెడ్డి, నిరంజన్ తదితరులు తమ ప్రాంతాల్లోని సమస్యలను మంత్రులు హరీష్‌రావు, పోచారం దృష్టికి తీసుకువచ్చారు. ఆయా సమస్యల పరిష్కారానికి మంత్రులు ఇద్దరు మంత్రులు హామీ ఇచ్చారు. సమావేశంలో కలెక్టర్ రాహుల్ బొజ్జా, ఎమ్మెల్యేలు చింత ప్రభాకర్, మదన్‌రెడ్డి, కిష్టారెడ్డి, బాబూమోహన్, మహిపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీలు భూపాల్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, రాములు నాయక్ జెడ్పీటీసీ, ఎంపీపీలు, అధికారులు పాల్గొన్నారు.