గ్రూపు-2లో ఇప్పటికే 302 పోస్టులు
⇒ విభజన లెక్కలు తేలితే రెట్టింపునకు మించి రానున్న పోస్టులు
⇒ అందులో విభాగాధిపతుల కార్యాలయాల్లోనివే ఎక్కువ ఖాళీలు
⇒ డిగ్రీ స్థాయి గ్రూపు-4లో ఇప్పటికే 192 పోస్టుల భర్తీకి నిర్ణయం
⇒ డిగ్రీతో 147 అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టులకు గ్రీన్‌సిగ్నల్
⇒ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు 1,543 పోస్టులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎక్కువ మంది నిరుద్యోగులు గ్రూపు-1, గ్రూపు-2, టీచర్లు, లెక్చరర్, గ్రూపు-4లోని జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ తదితర నియామక నోటిఫికేషన్ల కోసమే ఎదురుచూస్తున్నారు.
రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ 25 వేల పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించడంతో ఏ కేటగిరీలో ఎన్ని పోస్టులు వస్తాయన్న ఆంచనాల్లో మునిగిపోయారు. టీఎస్‌పీఎస్‌సీ ద్వారా ఏయే నోటిఫికేషన్లు జారీ అవుతాయన్న ఆశల్లో పడ్డారు. ఉపాధ్యాయులు, లెక్చరర్ల వ్యవహారం రేషనలైజేషన్, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణతో ముడిపడి ఉన్నందున.. మిగతా పోస్టులైన గ్రూపు-1, గ్రూపు-2, గ్రూపు-4 నోటిఫికేషన్లపైనే ఆశలు పెట్టుకున్నారు. మరోవైపు ఈసారి సబ్ ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులు ఎక్కువ వస్తుండటంతో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు వీటికోసం సిద్ధమవుతున్నారు.
గ్రూప్స్‌పై దృష్టి...
ఎక్కువ మంది నిరుద్యోగులు శిక్షణ కేంద్రాల్లో చేరి మరీ శిక్షణ పొందుతున్న గ్రూపు-2 పోస్టులు 302 ఉన్నట్లు అధికారులు లెక్కతేల్చారు. ఇటీవల కేసీఆర్ భర్తీకి ఆమోదం తెలిపిన 17 వేల పోస్టుల్లో ఇవి కూడా ఉన్నాయి. రానున్న రోజుల్లో గ్రూపు-2లో భారీ సంఖ్యలో పోస్టులు రానున్నాయి. శాఖాధిపతి కార్యాలయాలు, సచివాలయంలోని ప్రధాన కేటగిరీలు అయిన అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అకౌంటెంట్, జూనియర్ అకౌంటెంట్ వంటి పోస్టులు గ్రూపు-2లోనే భర్తీ చేయాల్సి ఉంది.
అయితే వాటిల్లో ఒక్కదానికి కూడా ఇంతవరకు క్లియరెన్స్ లభించలేదు. ఉద్యోగుల విభజన ప్రక్రియ పూర్తయితే అధిక సంఖ్యలో ఖాళీలు ఏర్పడనున్నాయి. ఇవన్నీ టీఎస్‌పీఎస్‌సీ ద్వారా భర్తీ చేయాల్సినవే. ఇక డిగ్రీ స్థాయి గ్రూపు-4లో గ్రేడ్-2 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ 192 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ కానున్నాయి. ఇంటర్మీడియెట్, పదో తరగతి అర్హతతో భర్తీ చేసే గ్రూపు-4 పోస్టుల వివరాలు రావాల్సి ఉంది.
ఇవీ వేలల్లో ఉండనున్నాయి. గ్రూపు-1లో మాత్రం ఇప్పటివరకు ఒక డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్, 12 అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పోస్టుల్లో మాత్రమే క్లియర్ వేకెన్సీలు ఉన్నాయి. ఉద్యోగుల విభజన పూర్తయితే ఇందులో మరిన్ని పోస్టులు రానున్నాయి. డిప్యూటీ కలెక్టర్లు, కమర్షియల్ టాక్స్ ఆఫీసర్లు, పోలీసు డీఎస్పీ, డీఎస్పీ జైల్స్, డివిజనల్ ఫైర్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ తదితర కేటగిరీల్లో విభజన తరువాతే పూర్తిగా ఖాళీల లెక్క తేలనుంది. మరోవైపు డిగ్రీ అర్హతతో 147 అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ కానుంది.
ఎక్కువగా ఇంజనీర్ పోస్టులు
త్వరలో భర్తీ చేయనున్న వాటిల్లో అత్యధికంగా 10,810 పోస్టులను పోలీసు విభాగంలోనే భర్తీ చేయనుండగా ఆ తరువాత స్థానంలో ఇంజనీర్ పోస్టులు ఉన్నాయి. టీఎస్‌పీఎస్‌సీ ద్వారా 1,275 అసిస్టెంట్ ఇంజనీర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులను భర్తీ చేయనుండగా డిపార్ట్‌మెంటల్ సెలెక్షన్ కమిటీల ద్వారా 200 అసిస్టెంట్ ఇంజనీర్, 68 సబ్ ఇంజనీర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.