సిటీలో అమెరికా స్టేషన్‌! | america company names for hyderabad metro stations | Sakshi
Sakshi News home page

సిటీలో అమెరికా స్టేషన్‌!

Published Tue, Feb 20 2018 8:21 AM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

america company names for hyderabad metro stations - Sakshi

పేరు మార్చిన ప్రకాష్‌నగర్‌ స్టేషన్‌

అవును...మన నగరంలో అగ్రరాజ్యంలోని కంపెనీ పేరిట మెట్రో రైలు స్టేషన్‌ ఏర్పాటైంది. ఇది ప్రత్యేకంగా ఏర్పాటు కాలేదు...ప్రకాష్‌ నగర్‌ మెట్రో స్టేషన్‌కే అమెరికాకు చెందిన ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థ ‘ఇన్వెస్కో’ పేరు పెట్టారు. ఇలా నగరంలోని 65 మెట్రో స్టేషన్ల పేర్లు ఇక బహుళ జాతి కంపెనీలు, విదేశీ సంస్థల పేరిట మార్పు చెందనున్నాయి. ఆదాయం పెంపు కోసం ఎల్‌ అండ్‌ టీ సంస్థ మెట్రో స్టేషన్ల పేర్లను లీజుప్రాతిపదికన కట్టబెట్టేందుకు నిర్ణయించింది. ఈమేరకు ప్రభుత్వానికి, హెచ్‌ఎంఆర్‌కు ప్రతిపాదించింది. కానీ దీనిపై హెచ్‌ఎంఆర్‌ తీవ్ర అభ్యంతరం తెలిపింది. హైదరాబాద్‌ నగరంలో ఎన్నో చారిత్రక ప్రాంతాలు, ప్రత్యేకతలు ఉన్న నేపథ్యంలో విదేశీ కంపెనీల పేర్లు పెడితే వివాదాలు తలెత్తుతాయని పేర్కొంది. 

సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌లో అత్యాధునిక హంగులతో నిర్మించిన మెట్రో స్టేషన్లకు బహుళజాతి, ప్రైవేటు కంపెనీల పేర్లు పెట్టే అంశం తెరమీదకు రావడంతో వివాదం నెలకొంది. ప్రస్తుత తరుణంలో ప్రయాణికుల చార్జీలతో మెట్రో గట్టెక్కే పరిస్థితి లేనందున.. వివిధ ఆర్థిక సంస్థల నుంచి తాము తీసుకున్న రుణాలపై కనీసం వడ్డీ అయినా కలిసివస్తుందన్న అంచనాతో నిర్మాణ సంస్థ పలు మెట్రో స్టేషన్లకు ప్రైవేటు సంస్థల నుంచి నెలవారీగా లేదా వార్షిక ప్రాతిపదికన లీజు తీసుకొని ఆయా స్టేషన్లకు ప్రైవేటు కంపెనీల పేర్లు పెట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేసి ఇటు ప్రభుత్వానికి, అటు హైదరాబాద్‌ మెట్రో రైలు సంస్థ ముందు పెట్టింది. అంతటితో ఆగకుండా ప్రకాశ్‌నగర్‌ మెట్రో స్టేషన్‌కు ఏకంగా అమెరికాకు చెందిన ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థ ఇన్వెస్కో సంస్థ పేరు పెట్టడం గమనార్హం. నిర్మాణ సంస్థ ప్రతిపాదనలను ఇటు ప్రభుత్వం, అటు హెచ్‌ఎంఆర్‌ అధికారులు ససేమిరా అన్నట్లు తెలిసింది. చారిత్రక భాగ్యనగరిలో ప్రతి ప్రాంతానికి భౌగోళికంగా, చారిత్రకంగా ప్రత్యేకత ఉన్న నేపథ్యంలో ఆయా స్టేషన్లకు ప్రైవేటు కంపెనీల పేర్లు పెడితే అనేక వివాదాలు తలెత్తుతాయని హెచ్‌ఎంఆర్‌ అధికారులు ఎల్‌అండ్‌టీకి స్పష్టం చేయడం గమనార్హం. అంతేకాకుండా నిర్మాణ ఒప్పందంలో ఇలా ఇష్టారాజ్యంగా పేర్లు పెట్టే క్లాజ్‌ కూడా లేదని చెప్పినట్లు సమాచారం.  

పేరు పెట్టేయ్‌.. లీజు పట్టేయ్‌..
మెట్రో స్టేషన్లకు ప్రైవేటు పేర్లు పెట్టే ప్రతిపాదనలు దుబాయి మెట్రో ప్రాజెక్టు నుంచి మొదలైనట్లు మెట్రో అధికారులు చెబుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీలోనూ మెట్రో రైలు అధికా>రులు ఈ ప్రతిపాదనలను దశలవారీగా అమలుచేస్తున్నట్లు పేర్కొన్నారు. త్వరలో బెంగళూరు, చెన్నై నగరాలు కూడా ఇదేబాటలో ముందుకెళతాయని అంచనా వేస్తున్నామన్నారు. అయితే ఇప్పటికే మెట్రో స్టేషన్లు,పిల్లర్ల ఏర్పాటుతో నగరంలో ఎంతో చారిత్రక నేపథ్యంలో ఉన్న కట్టడాలు తమ వైభవాన్ని కోల్పోయాయన్న విమర్శలున్న నేపథ్యంలో ఈ పేర్ల రగడ కొత్త వివాదాలు సృష్టిస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. 

ఎవరి లెక్కలు వారివే..
నగరంలో మొత్తం ప్రాజెక్టును 2018 డిసెంబరు నాటికి పూర్తిచేసేందుకు నిర్మాణ సంస్థ సన్నాహాలు చేస్తోంది. మొత్తంగా 72 కి.మీ ప్రాజెక్టు పూర్తికి రూ.16,375 కోట్లు వ్యయం చేయనున్నారు. ఇందులో ఇప్పటికే రూ.13,200 కోట్లు ఖర్చుచేసినట్లు ఎల్‌అండ్‌టీ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో రూ.11 వేల కోట్లు వివిధ ఆర్థిక సంస్థల నుంచి రుణంగా సేకరించినట్లు పేర్కొంటున్నాయి.
 ఇక మెట్రో నిర్మాణ ఒప్పందం ప్రకారం మెట్రో ప్రాజెక్టుకు అయిన వ్యయాన్ని నిర్మాణ సంస్థ.. 50 శాతం ప్రయాణీకుల చార్జీలు..మరో 45 శాతం రవాణా ఆధారిత ప్రాజెక్టులు,రియల్‌ఎస్టేట్‌ అభివృద్ధి, మరో ఐదు శాతాన్ని వాణిజ్య ప్రకటనల ద్వారా 40 ఏళ్లపాటు సమకూర్చుకోవాలని  నిర్మాణ ఒప్పందంలో పేర్కొన్నారు. ప్రస్తుత తరుణంలో వినూత్న ఆర్థిక విధానాలను అమలుచేయని పక్షంలో తొలి ఏడేళ్లు తమకు నష్టాల బాట తప్పదని, బ్యాంకుల నుంచి తాము సేకరించిన రుణాలపై వడ్డీ భారం కూడా పెరుగుతోందని నిర్మాణ సంస్థ చెబుతోంది.

రోజుకు 70 వేలమంది ప్రయాణికులే...
తొలివిడత మెట్రో రైళ్లు పరుగులుపెడుతోన్న నాగోల్‌–అమీర్‌పేట్‌(17 కి.మీ) మార్గంలో రోజుకు సరాసరిన 40 వేల మంది..మియాపూర్‌–అమీర్‌పేట్‌(13 కి.మీ)మార్గంలో రోజుకు సరాసరిన 30 వేల మంది..మొత్తంగా 30 కి.మీ మార్గంలో నిత్యం 70 వేలమంది మాత్రమే మెట్రో జర్నీ చేస్తుండడం గమనార్హం. ఆదివారం, ఇతర సెలవురోజుల్లో రద్దీ మరో 10 వేలు అదనంగా ఉంటోందని మెట్రో అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు సుమారు 2 లక్షల స్మార్ట్‌కార్డులు విక్రయించినప్పటికీ ఇందులో నెలవారీగా రీచార్జి అవుతున్నవి 50 వేలకు మించి లేకపోవడం గమనార్హం. ఈ లెక్కన ఎల్‌అండ్‌టీ సంస్థ ఆశించిన ఆదాయం లేనట్టే అని చెప్పొచ్చు. ఎల్బీనగర్‌–అమీర్‌పేట్, హైటెక్‌సిటీ–అమీర్‌పేట్‌ రూట్లో ఈ ఏడాది జూన్‌లో మెట్రో ప్రారంభమైతే రద్దీ అనూహ్యంగా పెరుగుతుందని మెట్రో అధికారులు చెబుతున్నారు. 

గ్రేటర్‌లో 65 స్టేషన్లు.. భారీగా ఆదాయం..  
గ్రేటర్‌ పరిధిలో నాగోల్‌– రాయదుర్గం,ఎల్భీనగర్‌– మియాపూర్, జేబీఎస్‌– ఫలక్‌నుమా మూడు కారిడార్లలో మొత్తం 72 కి.మీ మార్గంలో 65 మెట్రో స్టేషన్లు ఏర్పాటు కానున్నాయి. ఇప్పటికే మెట్రో పరుగులు పెడుతున్నా నాగోల్‌– అమీర్‌పేట్‌– మియాపూర్‌ మార్గంలో మొత్తం 30 కి.మీ రూట్లో 24 మెట్రో స్టేషన్లున్నాయి. వీటిని ఒక్కోటి రూ.65 నుంచి రూ.100 కోట్లు ఖర్చుచేసి అత్యాధునిక హంగులతో నిర్మించారు. ఒక్కో స్టేషన్‌కు ప్రైవేటు, బహుళ జాతి కంపెనీ నుంచి అద్దె లేదా లీజు రూపంలో నెలకు కనీసం రూ.10 లక్షలు వసూలు చేసినా.. మొత్తంగా 65 స్టేషన్లకు నెలకు రూ.6.5 కోట్లు. ఏడాదికి రూ.78 కోట్లు ఆదాయం లభిస్తుందని నిర్మాణ సంస్థ ఈ పేర్లు పెట్టే ప్రణాళికను తెరమీదకు తీసుకొచ్చిందని నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తుండడం గమనార్హం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement