
సాక్షి, హైదరాబాద్: భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోందని, రానున్న ఐదు దశాబ్దాల కాలంలో గత ఐదు వేల సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి జరగబోతోందని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ అన్నారు. పట్టణీకరణ ప్రధానాంశంగా అభివృద్ధి కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. వినూత్న, స్థిర పట్టణాభివృద్ధి కోసం కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లో ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్) ముగింపు సెషన్‌కు ఆయన మోడరేటర్‌గా వ్యవహరించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘అమెరికా, యూరోప్ దేశాల్లో పట్టణీకరణ పూర్తయింది. చైనాలో పూర్తయ్యే దశకు చేరుకుంది. కానీ భారత్‌లో ఇప్పుడే ప్రారంభమైంది. ఇది శుభపరిణామం. రాబోయే 50 ఏళ్లలో భారత్ మరో స్థితిలో ఉంటుంది’’ అని పేర్కొన్నారు. సమతుల అభివృద్ధి సాధించేందుకు 7 రాష్ట్రాల్లోని 201 జిల్లాల్లో విద్య, వైద్య, పోషకాహార సౌకర్యాల కల్పన కోసం ప్రయత్నిస్తున్నట్టు వివరించారు.
‘ఉమెన్ ఫస్ట్.. ప్రాస్పరిటీ ఆల్’ నినాదంతో జరిగిన ఈ సదస్సు ప్రపంచంలోని మహిళా పారిశ్రామికవేత్తలు, ఔత్సాహికులకు స్ఫూర్తిగా నిలిచిందన్నారు. చివరి సెషన్‌లో వెల్‌స్పన్ ఇండియా లిమిటెడ్ సీఈవో దీపాలీ గోయెం కా, ఐయూరోప్ క్యాపిటల్ ఫౌండర్ క్రిస్టినా డేవిసన్, దక్షిణాఫ్రికాకు చెందిన పెట్రోలింక్ ఫౌండర్ లెరొటో సెలీనా ముత్సుమయి, టీంలీస్ సర్వీసెస్ చైర్మన్ మనీశ్ సభర్వాల్, యూఎస్‌ఏఐడీ అడ్మినిస్ట్రేటర్ మార్క్ గ్రీన్‌లతో కూడిన ప్యానెల్ ‘మహిళా సాధికారత’పై చర్చాగోష్ఠి నిర్వహించారు. ఇందులో ఎవరేమన్నారంటే..
ఫ్రాన్స్‌లో ప్రతి కంపెనీలో 40 శాతం మహిళా డైరెక్టర్లు: క్రిస్టినా
మహిళలు ఎదగాలంటే మరో మహిళ సహకారం చాలా అవసరం. పెట్టుబడిదారుగా నేను కూడా మంచి ఆలోచనలున్న మహిళలకు మద్దతిచ్చేందుకు సిద్ధంగా ఉన్నా. అయితే మహిళా సాధికారత కోసం మార్పు పైస్థాయి నుంచి రావాలి. కంపెనీల స్థాపనలోనే మహిళల భాగస్వామ్యం ఉండాలి. ఫ్రాన్స్‌లో ఏ కంపెనీ పెట్టినా ఆ కంపెనీ బోర్డులో 40 శాతం మంది మహిళలే సభ్యులుగా ఉంటారు. ఆ మేరకు అక్కడ చట్టం చేశారు. అమెరికాలో అది 20 శాతమే ఉంది. దాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తున్నాం. అమెరికాలోని అడ్వెంచర్ క్యాపిటల్ ఫండ్స్‌లో 72 శాతం పెట్టుబడిదారులు పురుషులే. యూరోప్‌లో పరిస్థితి మరీ దారుణం. మహిళలకు పెట్టుబడులు కావాలంటే ముందు వారు విజయాలు సాధించాలి. విజయవంతమైన పారిశ్రామికవేత్తలుగా నిరూపించుకున్నప్పుడే మిమ్మల్ని నమ్మి ఎవరైనా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తారు.
అగ్నిభద్రా అందరికీ ఆదర్శం: దీపాలి
గ్రామీణ భారతం అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. గుజరాత్‌కు చెందిన అగ్నిభద్రా అనే గ్రామీణ యువతిని వాల్‌మార్ట్ కంపెనీ ఎంచుకుంది. వాస్తీ అనే ఎన్జీవో నిర్వహించిన నైపుణ్య ప్రదర్శన పోటీలో విజేతగా నిలిచి ఆమె ఈ అవకాశాన్ని దక్కించుకుంది. గ్రామీణ యువతులు ఆమెను ఆదర్శంగా తీసుకోవాలి. దేశంలోని మహిళా శక్తిని సక్రమంగా వినియోగించుకుంటే 2.9 ట్రిలియన్ డాలర్ల ఆదాయాన్ని సముపార్జించవచ్చు. 2025 కల్లా దేశంలోని 6.8 కోట్ల మంది మహిళలు పనిలో కొత్తగా భాగస్వామ్యం కాబోతున్నారు. ఇది భారత ఆర్థిక వ్యవస్థనే మార్చేస్తుంది.
మహిళలు గణితంలో నైపుణ్యం సాధించాలి: లొరెటో
మహిళలకు విద్య అవకాశాలు మెరుగుపడినప్పుడే సామాజిక మార్పు వస్తుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత మహిళలు, యువతులు, చిన్నారులు గణితంలో నైపుణ్యం సాధించాలి. గణితం లేకుండా 21వ శతాబ్దపు విద్య ఉపయోగం లేదు. మహిళలకు తగిన అవకాశాలు కల్పిస్తే వ్యాపారాలు కాదు జాతిని నిర్మిస్తారు. ఈ సదస్సులో పాల్గొనడం మంచి అనుభూతిని కలిగించింది. కేవలం మ్యాపులు, టీవీల్లో మాత్రమే చూసే అవకాశం ఉన్న అనేక దేశాల మహిళలు, పారిశ్రామికవేత్తలతో అనుభవాలను పంచుకోవడం నిజంగా అద్భుతమే.
మహిళల్లోని వాస్తవికతకు ప్రతిబింబం: మార్క్ గ్రీన్
ఈ సదస్సులో నేను మహిళా పారిశ్రామికవేత్తల్లోని ప్రతిభను చూశాను. వారికి సహజంగానే ఉండే వాస్తవికత, శక్తికి ఈ సదస్సు ప్రతిబింబంగా నిలిచింది. మహిళా సాధికారతలో భాగంగా వారికున్న అడ్డంకులను తొలగించే ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా ఐటీని వారికి దగ్గర చేయాలి. ఆరోగ్య సమస్యలను పరిష్కరించాలి. భారత్‌లో మహిళలకు టీబీ పెద్ద అడ్డంకిగా మారింది. ఇలాంటివి గుర్తించి వాటిపై పనిచేయాలి. సరైన విద్య అందించాలి. అప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుంది.
వేర్వేరు వేతనాలు చట్ట విరుద్ధం: మనీశ్
పని ప్రాంతాల్లో పురుషులకు, మహిళలకు వేర్వేరుగా వేతనాలివ్వడం చట్ట విరుద్ధం. దీన్ని నియంత్రించాలి. దేశాభివృద్ధిలో మహిళల భాగస్వామ్యం 30 నుంచి 18 శాతానికి పడిపోయింది. దీన్ని అధిగమించడం అనివార్యం. ప్రస్తుతానికి దేశంలో ఉద్యోగాల సమస్యేమీ లేదు. వేతనాలు కోరినంత సాధించుకునే అవకాశాలున్నాయి. కానీ భవిష్యత్తులో ఉద్యోగాల కల్పన అనుకున్నంత సులువుగా ఉండకపోవచ్చు. అందుకే పట్టణీకరణ, పారిశ్రామికీకరణ ద్వారా మానవ పెట్టుబడులను తయారు చేసుకోవాల్సి ఉంది.
చివరి సెషన్‌లో అంతా మహిళలే
మహిళా సాధికారత ప్రధానాంశంగా జరిగిన మూడ్రోజుల ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు ముగింపు సెషన్‌ను తనదైన శైలిలో ముగించారు నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్. దీనికి మోడరేటర్‌గా ఉన్న ఆయన.. ప్యానెల్ సభ్యులను ప్రశ్నలు అడిగేందుకు పురుషులను అనుమతించలేదు.
తొలుత లేడీస్ ఫస్ట్ అంటూ కొందరు మహిళలకు అవకాశమిచ్చినా ఓ పురుష పారిశ్రామికవేత్త ప్రశ్న అడిగేందుకు ప్రయత్నించగా.. ‘మీ వెనుక ఆమెను ముందు అడగనీయండి.’ అని వారించారు. ఆ తర్వాత ఆయన ఈ సెషన్‌లో కేవలం మహిళలే ప్రశ్నించాలని, పురుషులకు అవకాశం లేదన్నారు. దీంతో సభికుల్లో హర్షధ్వా నాలు వ్యక్తమయ్యాయి. చివరి సెషన్‌ను ఆయన ఓ మహిళా పారిశ్రామికవేత్త ప్రశ్నతో ముగించడం, ఈ సెషన్‌లోని ఐదుగురు ప్యానెల్ స్పీకర్లలో ముగ్గురు మహిళలే కావడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment