రూ.2వేల కోసం కక్కుర్తి!
► ఏసీబీకి పట్టుబడిన అంగన్‌వాడీ సూపర్‌వైజర్
► ఐసీడీఎస్ కార్యాలయంలో అవినీతి బాగోతం
జడ్చర్ల : వంటసరుకుల కోసం బిల్లుల మంజూరుకు ఓ అంగన్‌వాడీ కార్యకర్త నుంచి లంచం తీసుకుంటున్న సూపర్‌వైజర్‌ను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ సంఘటన గురువారం జడ్చర్లలో కలకలం రేపింది. వివరాలను ఏసీబీ డీఎస్పీ రాందాస్‌తేజ విలేకరులకు వెల్లడించారు. బాలానగర్ మండలం రాజాపూర్ సెక్టార్‌లోని దొండ్లపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని కొర్రతండా అంగన్‌వాడీకేంద్రం కార్యకర్త నాగమణి తమ కేంద్రానికి కూరగాయలు, ఇతర సరుకులు, టీఏ బిల్లులు మంజూరుచేయాలని సంబంధిత సూపర్‌వైజర్‌ను కోరింది.
దీంతో ఆమె బిల్లులు చేయడానికి సూపర్‌వైజర్ శశికళ రూ.రెండువేల లంచం ఇవ్వాలని డిమాండ్‌చేసింది. కమీషన్ ఇస్తేనే బిల్లులు మంజూరుచేస్తామని తేల్చిచెప్పడంతో చేసేదిలేక బాధితురాలు ఏసీబీ అధికారులను ఆశ్రయించింది. ఈ క్రమంలో జడ్చర్ల ఐసీడీఎస్ కార్యాలయంలో సూపర్‌వైజర్ శశికళ నాగమణి నుంచి రూ.రెండువేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.నిందితురాలిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు డీఎస్పీ రాందాస్‌తేజ తెలిపారు. శుక్రవారం హైదారాబాద్‌లోని కోర్టులో హాజరుపరుస్తామని చెప్పారు. దాడుల్లో ఇన్‌స్పెక్టర్లు గోవింద్‌రెడ్డి, రమేశ్‌రెడ్డి, ఏఓ హేమలత, స్వప్న పాల్గొన్నారు.
లంచం అడిగితే చెప్పండి
ప్రభుత్వ శాఖల్లో పనులు చేసేందుకు లంచం కోసం వేధింపులకు గురిచేస్తే వెంటనే తమకు ఫిర్యాదుచేయాలని ఏసీబీ డీఎస్పీ రాందాస్‌తేజ కోరారు. ఎక్కడైనా ప్రభుత్వ ఉద్యోగులు లంచం అడిగితే తమకు ఫోన్‌లో సమాచారం ఇచ్చి ఫిర్యాదు చేయవచ్చన్నారు. 94913 05609, 94404 46204 నంబర్లకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. ప్రజలు చైతన్యవంతంగా ముందుకు వచ్చినప్పుడు అవినీతి నిర్మూలన సాధ్యమవుతుందని పేర్కొన్నారు.