
విద్యాసంస్థ, పార్కుకు అంజయ్య పేరు
మాజీ ముఖ్యమంత్రి టి. అంజయ్యకు సరైనా గుర్తింపునిచ్చేందుకు త్వరలోనే ఒక విద్యా సంస్థకు, హైదరాబాద్‌లోని ఓ ఉద్యానవనానికి అంజయ్య పేరు పెడతామని సీఎం కె.చంద్రశేఖరరావు పేర్కొన్నారు.
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలో ప్రముఖ నాయకుడిగా పేరొందిన మాజీ ముఖ్యమంత్రి టి. అంజయ్యకు సరైనా గుర్తింపునిచ్చేందుకు త్వరలోనే ఒక విద్యా సంస్థకు, హైదరాబాద్‌లోని ఓ ఉద్యానవనానికి అంజయ్య పేరు పెడతామని సీఎం కె.చంద్రశేఖరరావు పేర్కొన్నారు. అంజయ్య 28వ వర్థంతి సందర్భంగా సీఎం కేసీఆర్ శనివారం ఉదయం లుంబినీ పార్కులోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ఆయన స్మారకార్థం రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. అంజయ్య ప్రాతినిధ్యం వహించిన ముషీరాబాద్ నియోజకవర్గంలో పెద్ద విగ్రహాన్ని నెలకొల్పి జయంతి, వర్థంతి నిర్వహిస్తామన్నారు.
తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాల్సిన, గౌరవించుకోవాల్సిన వ్యక్తి అంజయ్య అని సీఎం పేర్కొన్నారు. 1969 ఉద్యమంలో అంజయ్య చాలా కీలకపాత్ర పోషించారని, అగ్రభాగాన నిలిచి ఉద్యమం నడిపారని, నెలల తరబడి జైలు శిక్ష అనుభవించారని గుర్తు చేశారు. చిన్న కార్మిక నాయకుడి స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన నాయకుడు అంజయ్య అని కొనియాడారు. ప్రజల కోసం ప్రజల మధ్య బతికిన ప్రజల మనిషి అంజయ్య అన్నారు. సీఎం అయిన తర్వాత తానుంటున్న అధికారిక నివాసానికి ‘జై ప్రజా భవన్’ అనే పేరు పెట్టుకున్నారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు కె.కేశవరావు, అంజయ్య సతీమణి మణెమ్మ తదితరులు పాల్గొన్నారు.