సింగరేణిలో మరో 400 ఉద్యోగాలు
ఫిబ్రవరిలో నోటిఫికేషన్
గోదావరిఖని: సింగరేణి సంస్థలో ఇప్పటికే రెండు నోటిఫికేషన్ల ద్వారా రెండు వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేసిన యాజమాన్యం, మరో 400 పోస్టులతో ఫిబ్రవరిలో నోటిఫికేషన్‌ను విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. 2015లో మొదటి నోటిఫికేషన్ ద్వారా 8 కేటగిరీలకు చెందిన 1,178 ఉద్యోగాలకు పరీక్షలు నిర్వహించి ఫలితాలు విడుదల చేసింది. వీటిలో మేనేజ్‌మెంట్ పర్సనల్, ఈ అండ్ ఎం విభాగాలకు చెందిన 107 పోస్టులకు సంబంధించి కోర్టులో ఉన్నందున వాటి ఫలితాలు వెల్లడికాలేదు. రెండో నోటిఫికేషన్ ద్వారా 9 కేటగిరీలకు చెందిన 1,033 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు శ్రీకారం చుట్టింది.
ఇందులో 48 సర్వే ట్రైనీ, 40 మోటర్ మెకానిక్ పోస్టులకు పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. మిగిలిన వారందరికీ ఆఫీస్ ఆర్డర్లు ఇచ్చారు. ఇక ఫిబ్రవరిలో మూడోసారి ఉద్యోగాల నోటిఫికేషన్‌ను విడుదలచేసేందుకు యాజమాన్యం సన్నాహాలు చేస్తోం ది. ఇందులో 101 జూని యర్ నర్స్ ఉద్యోగాలు, 50 వెల్లర్ ట్రైనీతోపాటు ఈపీ ిఫిట్టర్, ఈపీ ఎలక్ట్రీషియన్‌కు సంబంధించి 400 పోస్టులు భర్తీ చేయనున్నారు.
150 క్లర్క్ పోస్టుల భర్తీకీ సన్నాహాలు
సింగరేణిలో ఇప్పటికే ఎక్స్‌టర్నల్‌గా నోటిఫికేషన్ విడుదల చేసి 471 గ్రేడ్-2 క్లర్క్ పోస్టులకు రాతపరీక్ష నిర్వహించిన యాజమాన్యం ఫిబ్రవరి మొదటివారంలో ఎంపికైన వారికి ఆఫీస్ ఆర్డర్లను అందజేయనుంది. 144 అంతర్గత క్లర్క్ పోస్టులకు సంస్థలో పనిచేస్తున్న అర్హులను ఎంపిక చేసింది. అయితే మరో 150 వరకు క్లర్క్ పోస్టులు ఖాళీ అయ్యే అవకాశాలు ఉండడంతో మార్చి తర్వాత వీటి భర్తీకి అవసరమైన ప్రక్రియను ప్రారంభించేందుకు యా జమాన్యం చర్యలు తీసుకుంటోంది. జూనియర్ మైనింగ్ ఇంజనీర్(ట్రైనీ)కి సంబంధించి 811 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయగా... 676 మందే అర్హత సాధించారు. మిగిలిన 125 జేఎంఈటీ పోస్టులను మార్చి తర్వాత మరో నోటిఫికేషన్ విడుదల చేసి భర్తీ చేయనున్నారు.
ఫిబ్రవరి నెలాఖరులోగా 665 గిరిజన ఉద్యోగాలు భర్తీ
తెలంగాణలోని గిరిజనులకు సంబంధించి కేటాయించిన 665 బదిలీ వర్కర్ పోస్టుల భర్తీని కూడా ఫిబ్రవరి నెలాఖరులోగా భర్తీ చేసేందుకు యాజమాన్యం కసరత్తు చేస్తోంది. ఈ పోస్టులకు సుమారు 8వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఉద్యోగాల్లో సింగరేణి నాలుగు జిల్లాల గిరిజనులకు 80 శాతం, మిగిలిన ఇతర జిల్లాల వారికి 20 శాతం రిజర్వేషన్ కల్పించారు.