వనపర్తి టౌన్ : తెలంగాణ వచ్చిందని సంతోషించడం సరిపోదని, రాష్ట్ర పునర్నిర్మాణం కోసం త్వరలో నల్లమల ప్రాంతం చెంచు పెంటలనుంచి అభివృద్ధి ఉద్యమం నిర్వహిద్దామని...
వనపర్తి టౌన్ :
తెలంగాణ వచ్చిందని సంతోషించడం సరిపోదని, రాష్ట్ర పునర్నిర్మాణం కోసం త్వరలో నల్లమల ప్రాంతం చెంచు పెంటలనుంచి అభివృద్ధి ఉద్యమం నిర్వహిద్దామని, ఇందుకు స్వచ్ఛంద సంఘాలు, ఉద్యోగ సంఘా లు, ప్రజలు ముందుకు రావాలని తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం పిలుపునిచ్చారు. తెలంగాణ విద్యావంతుల వేదిక తూర్పు జిల్లా ప్రథమ మహాసభను శనివారం వనపర్తి పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు.
ఈ మహాసభకు రాష్ట్ర అధ్యక్షుడు మల్లేపల్లి లక్ష్మయ్యతో కలిసి ముఖ్య అతిథిగా విచ్చేశారు. మొదటగా తెలంగాణ విద్యావంతుల వేదిక జెండాను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్. విజయ్‌కుమార్ ఆవిష్కరించారు. అనంతరం ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి కోదండరాం, మల్లేపల్లి లక్ష్మయ్యలు పూమాలలు వేసి నివాళులర్పించారు. అమరవీరుల ఆత్మకు శాం తి కలగాలని కాసేపు మౌనం పాటించా రు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ఆర్థిక వ్యవస్థలో సమానత్వం అవసరమని, ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణానికి తమవంతుగా కృషి చేస్తామన్నారు. ప్రజల పక్షాన ఉంటూ తెలంగాణ అభివృద్ధికి రాజీ పడకుండా పోరాటం చేస్తామని చెప్పారు. రాజకీయ పెట్టుబడులతో ప్రజల జీవితాల్లో వెలుగులు నిండటం లేదని, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఉద్యోగుల విభజన ఇంకా జరగకపోవడం దురదృష్ణకరమన్నారు. ప్రభుత్వానికి ప్రజలు కడుతున్న పరోక్ష పన్నులే 80 కోట్లు ఉంటుందని, తెలంగాణలో విద్యుత్ ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉన్నా ప్రభుత్వాలు సహకరించడంలేదని, వారు గాడిలో పడాలంటే ప్రజల్లో ప్రశ్నించే నైజం రావాలని తెలిపారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం సకలజనుల సమ్మె, మిలియన్ మార్చ్, జైల్‌భరో తదితర రూపాల్లో ఉద్యమాలు చేశామని, అదే ఉద్యమ స్ఫూర్తితో సంపూర్ణ తెలంగాణ నిర్మాణానికి పార్టీలకు అతీతంగా కలిసి రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రం సంపూర్ణ రాజ ధానికిగా ఏర్పాటయ్యేంత వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
అనంతరం పలు తీర్మాణాలు చేశారు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అధిక నిధులు కేటాయించి సత్వరమే పూర్తి చేయాలని, కొల్లాపూర్‌లో కాగితపు పరిశ్రమ, సిమెంట్ తయారీ పరిశ్రను నెలకోల్పాలని, ఐటీడీఏను బలోపేతం చేసి విద్యను, వైద్యాన్ని ఇతర మౌళిక సదుపాయాలను చెంచులకు అందించేందుకు కృషి చేయాలని, రైతులకు లాభసాటి ధర కల్పించేందుకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలని, గద్వాల- మాచర్ల రైల్వే పనులు మొదలుపపెట్టాలని తీర్మానం చేశారు.
ఈ సందర్భంగా ప్రజాకవి వాగ్గేయకారుడు గోరేటి వెంకన్న తన ఆట పాటలతో అలరించారు. కార్యక్రమంలో టీవీవీ తూర్పు, పడమ జిల్లాల అధ్యక్షులు రాజు, రవీందర్‌గౌడ్, ప్రతినిధులు సతీష్‌రెడ్డి, వేణుగోపాల్, పాలిటెక్నిక్ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ మురళీధర్‌గుప్తా, బి. కుమార్, జి. రంగస్వామి, రవిశాస్త్రి, జి. ప్రసాద్, వేణుగోపాల్, నిరంజన్‌వ లి పాల్గొన్నారు.