
‘సమాధానాలు వచ్చేలా సహకరిస్తున్నాం’
హైదరాబాద్: సభ సజావుగా జరిగేలా, ప్రభుత్వం నుంచి సమాధానాలు వచ్చేలా తాము సహకరిస్తున్నామని ప్రతిపక్షనేత కె.జానారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం అసెంబ్లీలో వైద్య, విద్య, తదితర పద్దులపై చర్చ జరుగుతుండగా రాత్రి7.45 గంటల ప్రాంతం లో సభను బుధవారానికి వాయిదా వేయాలని ఆయన కోరారు. దీనిపై శాసనసభ వ్యవహారాల మంత్రి హరీశ్‌రావు స్పందిస్తూ.. పద్దులపై చర్చను బుధవారం మధ్యాహ్నంలోగా పూర్తిచేసుకోవాల్సి ఉందని, ఆ తర్వాత బిల్లులపై చర్చ ఉంటుందని పేర్కొన్నారు.
మధ్యాహ్నం 1.30 లోగా పద్దులపై చర్చ ముగిసేందుకు సహకరిస్తామంటే సభ వాయిదాకు అభ్యంతరం లేదని చెప్పారు. దీనిపై జానారెడ్డి మాట్లాడుతూ.. సమాధానాలు వచ్చేలా ప్రభుత్వమే కాదు విపక్షాలు కూడా సహకరిస్తున్నాయని చెప్పారు. దీనిపై హరీశ్ స్పందిస్తూ.. అందరి సహకారంతోనే సభ జరగాలని తమకు భేషజాలు లేవన్నారు.