ఈ ఎన్నికల్లో బరిలో నిలుస్తున్న అభ్యర్థుల ఖర్చులకు రోజూ లెక్క చెప్పాల్సిందే. ఈ మేరకు ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను విడుదల చేసింది. ప్రచారంలో వాడే ద్విచక్రవాహనాలనుంచి ప్రతి వాహనం, వేదికలు, ఫ్లెక్సీల ఏర్పాటు అన్నీ అభ్యర్థి ఖాతాలోకి వెళ్లనున్నాయి. ప్రతి అభ్యర్థి నామినేషన్ వేసే దగ్గరి నుంచి ఎన్నికల వరకు ప్రచారం, ఇతరత్రాఖర్చులు కలుపుకుని మొత్తం రూ.28 లక్షలు మించకూడదని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఏయే పద్దు కింద ఎంత మొత్తంలో వ్యయం చేయాలనే విషయాలను కూడా స్పష్టం చేసింది.
సాక్షి,దురాజ్‌పల్లి (సూర్యాపేట)/ఆలేరు : ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల ఎన్నికల వ్యయాన్ని నియంత్రించేందుకు ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను విడుదల చేసింది. నిబంధనలను అమలు చేసేందుకు కలెక్టర్ నేతృత్వంలోని జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతోంది. ఇప్పటికే ఎన్నికల నియమావళి అమలులోకి రావడంతో ప్రభుత్వ పథకాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు ఆగిపోయిన విషయం తెలిసిందే. ఎన్నికల ఖర్చుకు సంబంధించిన నియమ నిబంధనలు ఈనెల 12న నామినేషన్ల ప్రారంభం నుంచే అమలులోకి రానుంది. ఇప్పటికే జిల్లాలో డబ్బు, మద్యం అక్రమ రవాణాకు యంత్రించేందుకు చెక్‌పోస్టులను ఏర్పాటు చేసిన పోలీసు యంత్రాంగం వాహనాల తనిఖీని ముమ్మరంగా చేపడుతోంది. నామినేషన్ ముందు పెడుతున్న ఖర్చు పార్టీ ఖాతాలోకి రానుంది. పరిమితి దాటితే.. ఆదాయ పన్ను చట్టానికి లోబడి రూ. 49,999 వరకు జరిపే లావాదేవీలకు పాన్‌కార్డు అవసరం ఉండదు.
రూ. 50వేలకు మించి జరిపే ప్రతి లావాదేవీపైన ఖాతాదారుడు పాన్‌కార్డు సమర్పించడం తప్పనిసరి. అంతే కాకుండా ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో సరైన ధ్రువపత్రాలను చూపించాల్సి ఉంటుంది. అంతేకాకుండా జీరో ఖాతాల్లో ఉన్నఫలంగా నగదు జమ అయితే వీటి మీద దృష్టి పెడతారు. కనీసం రూ. 2లక్షల నుంచి ఆపై డబ్బు జమ అయిన వెంటనే పరిశీలన చేస్తారు. అలాగే నామినేషన్ సమర్పించే సమయంలో అభ్యర్థులకు అధికారులు ఒక పుస్తకాన్ని అందజేస్తారు. అందులోని ఒక పేజీలో నగదుకు సంబంధించిన వివరాలు, 2వ పేజీలో ఖాతాలో నిలువ, 3వ పేజీలో ఖర్చు వివరాలను రాయాలి. ప్రతిఒక్కరూ మూడు సార్లు ఖర్చుల వివరాలను బిల్లులతో సహా ఎన్నికల అధికారి కార్యాలయంలోని అకౌంటెంట్ విభాగంలో చూపించాలి. నిర్ణీత సమయాల్లో చూపించకపోతే అభ్యర్థులకు ఇచ్చిన వాహనాల అనుమతి, ప్రదర్శన సభలను రద్దు చేస్తారు. దీంతో పాటుగా ప్రసార సాధనాలకు ఇచ్చే ప్రకటనలు, చెల్లింపు వార్తల ఖర్చులను కూడా అభ్యర్థుల ఖర్చుల ఖాతాల్లోనే జమ చేస్తారు.
ప్రతి పైసా లెక్క..
శాసనసభకు పోటీ చేసే ప్రతి అభ్యర్థి నామినేషన్ వేసే దగ్గరి నుంచి ఎన్నికల వరకు ప్రచారం, ఇతరత్రాఖర్చులు కలుపుకుని మొత్తం రూ.28 లక్షలు మించకూడదని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఏయే పద్దు కింద ఎంత మొత్తంలో వ్యయం చేయాలనే విషయాలను కూడా స్పష్టం చేసింది. గతంలో ఎన్నికల ఖర్చును మూడురోజులు, లేదా వారానికోసారి లేదా పోలింగ్ పూర్తయిన తర్వాత కౌంటింగ్ వరకు కూడా లెక్క చూపే అవకాశం ఉండేది. ప్రస్తుత ఎన్నికల్లో మాత్రం అభ్యర్థి తాము చేస్తున్న ఖర్చును రోజువారీగా తప్పని?సరిగా చూపించాలనే నిబంధన అమలులోకి వచ్చింది.
ఖర్చుల వివరాల ప్రతులను జిల్లా ఎన్నికల అధికారికి విధిగా ఎప్పటికప్పుడు సమర్పి?ంచాల్సిందే. అంతేకాకుండా ఈ వివరాలను ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రధానాధికారి వెబ్‌సైట్లో కూడా ఆన్‌లైన్ ద్వారా నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అదే విధంగా నేరచరిత్ర కలిగిన అభ్యర్థులు ఎన్నికల్లో పోటీచేస్తే వాటికి సంబంధించిన ఆధారాలను కూడా అఫడివిట్‌లో నామినేషన్ సమయంలో విధిగా నమోదు చేయాలని పేర్కొంది. రోజూవారీ కిరాయిల బిల్లు, ఇతర ఖర్చులను కూడా విచ్చలవిడిగా చూపించే అవకాశం లేదు. దేనికి ఎంత బిల్లు చెల్లించాలో ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. అంతకంటే ఎక్కువ బిల్లులు చూపితే అనుమతించబడదు.
Comments
Please login to add a commentAdd a comment