సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ పరిధిలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు లబ్ధిదారులు మీ–సేవ కేంద్రాలకు క్యూ కడుతున్నారు. ఇదే అదనుగా నిర్వాహకులు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల నమోదుకు నిర్ణీత ఫీజు కంటే రెండింతలు అధికంగా వసూలుచేస్తున్నారు. దీంతో పేదల జేబుకు చిల్లు పడుతోంది. హైదరాబాద్ జిల్లా యంత్రాంగం చేసిన ఓ ‘పత్రికా ప్రకటన’తో ఈ పరిస్థితి నెలకొంది. వాస్తవానికి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పథకానికి సంబంధించి ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. అయితే ప్రభుత్వ పథకాలకు ఆన్‌లైన్‌లో మీ–సేవ, ఈ–సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు అధికారిక ప్రకటన ఇవ్వడంతో లబ్ధిదారులు ఆయా కేంద్రాలకు క్యూ కడుతున్నారు. ఆన్‌లైన్‌లో నమోదు అనంతరం దరఖాస్తులు సమర్పించేందుకు కలెక్టరేట్, రెవెన్యూ కార్యాలయాలకు వెళ్తున్నారు. ఇది కాస్త రెవెన్యూ యంత్రాంగానికి తలనొప్పిగా తయారైంది.
మూడు లక్షలకు పైగా...
ఒకరిని చూసి మరొకరు ఆన్‌లైన్‌లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల దరఖాస్తుకు లబ్ధిదారులు ఉత్సాహం చూపుతుండడంతో... మీ–సేవ కేంద్రాల నిర్వాహకులు దాన్ని ‘క్యాష్’ చేసుకుంటున్నారు. పేదలతో మీ–సేవా కేంద్రాలు కిక్కిరిసిపోతున్నాయి. గత రెండు నెలలుగా దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల రెవెన్యూ కార్యాలయాల్లో ఇప్పటికే 3లక్షలకు పైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా మరింత మంది దరఖాస్తు చేసుకుంటున్నారు. వాస్తవానికి తొలి విడత డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లే ఇప్పటికీ పూర్తి కాలేదు. మురికివాడల్లోని లబ్ధిదారులకు పొజిషియన్ సర్టిఫికెట్లు అందజేసినా, కనీసం ఒక్క శాతం కూడా పూర్తి చేసివ్వలేదు. తొలి విడత నిర్మాణాలు పూర్తయిన, తర్వాతే రెండో విడత ఇళ్ల నిర్మాణాలను చేపట్టే అవకాశాలు ఉన్నాయి. మొదటి విడతలో నిర్మిస్తున్న ఇళ్లు ఇప్పటికే పొజిషన్ సర్టిఫికెట్లు అందజేసిన వారికి మాత్రమే సరిపోయే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు పెండింగ్ దరఖాస్తులు, తాజా దరఖాస్తులను కలిపితే దాదాపు 5లక్షలు దాటిపోయే అవకాశాలు ఉన్నాయి. అందులో 3లక్షల దరఖాస్తులు అర్హత సాధిస్తే, వారిని ఎంపిక చేసి ఇళ్ల ప్రక్రియ పూర్తయ్యే వరకు మరో ఐదేళ్లు పట్టొచ్చని అధికార వర్గాలే స్పష్టం చేస్తున్నాయి.
కొన్ని ప్రాంతాల్లోనే పూర్తి...
గ్రేటర్‌లోని మూడు ప్రాంతాల్లో 496 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి. మరో 38 ప్రాంతాల్లో 39,669 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు పూర్తి కావాల్సి ఉంది. వాస్తవానికి 2019 మార్చి నాటికి 68 ప్రాంతాల్లో 59,835 పూర్తి చేయాల్సి ఉంది. అమీన్‌పూర్, గాజులరామారం, జమ్మిగడ, సయ్యద్‌సాబ్‌కాబాడా తదితర ప్రాంతాల్లో మాత్రమే డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణం దాదాపు పూర్తయింది. కానీ ఇంకా లబ్ధిదారులకు స్వాధీనం చేయలేదు. జియాగూడ, బండ మైసమ్మనగర్, అహ్మద్‌గూడ, డీపోచంపల్లి, ఎరుకల నాంచారమ్మ బస్తీ, బహదూర్‌పల్లి తదితర ప్రాంతాల్లో పనులు నెమ్మదిగా సాగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment