సాక్షి, సిటీబ్యూరో :ఒకప్పుడు పసిపిల్లలను చూసుకోవడానికి ఇంటెడు చుట్టాలో.. పెద్దవాళ్లో ఉండేవాళ్లు. కానీ సిటీలోని న్యూక్లియర్ ఫ్యామిలీస్‌లో వర్కింగ్ ఉమెన్‌కి అలాంటి అవకాశాలు అరుదే.. పిల్లలకు సంబంధించిన ఏ పనైనా స్వయంగా చేసుకోక తప్పని పరిస్థితి ఉద్యోగినులది. దీంతో చిన్నారి ధారణ/బేబీ వేరింగ్ పేరుతో ఓ ఆర్ట్‌గా ప్రాచుర్యంలోకి వచ్చింది. చీర కట్టుకోవడం నేర్పించినట్లే.. బిడ్డను చుట్టుకోవడం ఆధునిక ప్రపంచం సరికొత్తగా నేర్చుకుంటోంది. ఈ నేపథ్యంలో బేబీ వేరింగ్ చుట్టూ ఆసక్తికరమైన విషయాలెన్నో అల్లుకుంటున్నాయి.
సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో బిడ్డను తమ వీపునకు వెనుక చీరతో కట్టుకుని పొలం పనులు తదితర పని పాటల్లో మునిగిపోయే తల్లులను ఇప్పటికీ మనం చూస్తుంటాం. అదే ఇప్పుడు మరో రూపంలో నగరాల్లో ట్రెండీగా మారింది. ప్రస్తుతం నగర మహిళలు బేబీ వేరింగ్ లాభాలపై అవగాహన పెంచుకుంటున్నారు. ఎర్గోనామిక్ బేబీ కేరియర్స్‌పై తగినంత ఖర్చు పెడుతున్నారు. కొత్తగా తల్లులైనవారికి పిల్లలను తమ శరీరాలపై ధరించడం అనే ఆర్ట్‌పై అవగాహన పెంచేందుకు, ఎడ్యుకేటర్స్, సపోర్ట్ గ్రూప్స్ కూడా వచ్చేశాయి.
జాగ్రత్తగాఎంచుకో..ప్రేమనుపంచుకో..
నాణ్యమైన కేరియర్స్‌ను ఎంచుకోవాలని బేబీ వేరింగ్ ఎడ్యుకేటర్స్ తల్లిదండ్రులకు సూచిస్తున్నారు. ఎర్గోనామిక్ (అటు అందుబాటులో ధరలు, ఇటు పర్యావరణ హితమైనవి)గా ఉండే వాటి వల్ల వచ్చే ప్రయోజనాలను అర్థం చేసుకోవాలని, కొన్ని ప్రమాణాలకు అనుగుణంగా ఇవి ఉండేలా చూడాలని అంటున్నారు. మన దేశంలో వాటిని పరీక్షించే ప్రమాణాలు లేవు కాబట్టి యూకే లేదా యూఎస్ స్టాండర్డ్స్‌ను సరిచూసుకోవాలన్నారు. బిడ్డకు సురక్షితమైన ఫ్యాబ్రిక్స్/డైస్ ఉపయోగిస్తున్నారా లేదా? అనేది చాలా ముఖ్యం. భిన్న రకాల కేరియర్స్‌ను పరిశీలించడానికి సమయం కేటాయించాలి. బేబీ వేరింగ్ నెట్ వర్క్స్ ఏర్పాటు చేసే మీటప్స్‌కు హాజరవ్వాలి. దేశవ్యాప్తంగా కొన్ని చోట్ల బేబీ వేరింగ్‌లను ట్రయల్ ఇచ్చేందుకు, అద్దెకు ఇచ్చేందుకు లైబ్రరీలూ ఉన్నాయి. కన్సెల్టెంట్స్‌ను సంప్రదించడం వల్ల బిడ్డకు, తల్లికి ఇద్దరికీ నప్పే సరైన కెరియర్‌ను ఎంచుకునే దిశగా సరైన సలహా లభించవచ్చు.
ధారణ.. ప్రేరణ..
ప్రస్తుతం పేరెంటింగ్‌లో ప్రధాన పాత్ర పోషిస్తోంది బేబీ వేరింగ్.. ఇది బిడ్డతో బంధాన్ని ధృడతరం చేస్తుంది. తల్లులకు తరచూ సులభ ప్రయాణాలు చేసేందుకు సహకరిస్తుంది. సింగిల్‌గా జీవించే తల్లులకు మరింత ఆత్మవిశ్వాసాన్ని అందిస్తుంది. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు కూడా ఈ కెరియర్స్ బాగున్నాయి.
ఫ్యాషన్.. ఎమోషన్..
ప్రస్తుతం సిటీలో బేబీ వేరింగ్ స్టైల్ సరికొత్త ఫ్యాషన్ స్టేట్‌మెంట్‌గా అవతరించింది. దీని కోసం రకరకాల ఆకర్షణీయమైన కెరియర్స్‌ను తల్లులు కొనుగోలు చేస్తున్నారు. వీటికి విభిన్న రకాల రంగులు, ప్రింట్స్‌లో బ్యాగ్స్, షూస్, యాక్సెసరీస్‌తో మ్యాచింగ్ మ్యాచింగ్ అంటున్నారు. రింగ్ స్లింగ్స్‌తో పాటుగా కెరియర్స్ వచ్చాయి. స్ట్రెచ్చీ ర్యాప్, ది ఉమెన్ ర్యాప్, ది రింగ్ స్లింగ్, ది మెహ్ దాయ్, ది టోన్ బ్యుహిమో... ఇంకా ఎన్నో కెరియర్స్ అందుబాటులో ఉన్నాయి. నగరంలో నిర్వహిస్తున్న బేబీ వేరింగ్ వాక్స్ వంటివి కొత్తగా తల్లులైన వారికి ఆరోగ్య ఆనందాలతో పాటు పిల్లలను జాగ్రత్తగా ధరించడంపై అవాహన కూడా పెంచుతున్నాయి.
బేబీ వేర్.. టేక్ కేర్..
పేరెంట్స్ పిల్లల్ని ధరించేటప్పుడు సరైన కెరియర్ ఎంచుకోవాలి. లేకపోతే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఇక టూవీలర్ వంటి వాహనాలు డ్రైవింగ్ చేసేటప్పుడు మాత్రం బేబీ వేరింగ్ వద్దు. ఎప్పుడు అవసరం అయినా వెంటనే చేతులు వెనక్కి పెట్టగిలిగేలా ఉండాలి. పిల్లల సైజ్‌ను బట్టి మార్చడం లేదా అడ్జస్టబుల్ కెరియర్స్ వస్తున్నాయి. వీలున్నంత వరకూ ఫ్రంట్ వైపు అంటే పేరెంట్స్‌కు అభిముఖంగా పిల్లలు చూస్తుండేలా అయితే బెటర్. బేబీ వేరింగ్ సుదీర్ఘంగా ఉండటం మంచిది కాదు.. 2 లేదా 3 గంటల వరకూ అయితే ఓకే.. పేరెంట్స్ జ్వరం లాంటి అనారోగ్య సమస్యలు ఉంటే బేబీ వేరింగ్‌కు దూరంగా ఉండాలి.
– డా.ఎమ్.విష్ణువర్ధన్‌రెడ్డి, నియోనెటాలజిస్ట్, అపోలో క్రెడిల్
ఆస్వాదించా...
బేబీ వేరింగ్ చేసిన కొత్తలో బిడ్డ భద్రత గురించి నాకు కొంత భయంగా అనిపించింది. అయితే కొంత సాధన, సలహాలు, సూచనల అమలు తర్వాత దాన్ని చాలా ఆస్వాదించాను. పిల్లలకు కూడా చక్కగా కూర్చోవడం, చూడటం అలవాటైపోయింది. మనకు కలిగే మరో మంచి ప్రయోజనం ఏమిటంటే కెరియర్ బరువు రెండు భుజాల మీద సమంగా పడటం వల్ల మోచేయి, మణికట్టు దగ్గర కీళ్ల నొప్పుల నుంచి విముక్తి కూడా కలిగిస్తుంది. మనం బాగా ఎక్కువ సమయం వాకింగ్ చేయాల్సిన సందర్భాల్లో ఇది చాలా ఉపకరిస్తుంది. ఫ్లైట్ జర్నీ దగ్గర నుంచి మాల్స్, సూపర్ మార్కెట్స్‌లో షాపింగ్ దాకా బేబీ వేరింగ్ ఉపయుక్తమే.
– డా.హాసిని యాదవ్
తల్లికి బిడ్డకూ క్షేమం..
కొత్తగా తల్లులైన వారికి మద్దతు చాలా అవసరం. వారికి పలు విషయాల్లో అవగాహన, శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. నాలుగేళ్ల మా నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ద్వారా బేబీ వేరింగ్‌పై నెలకు, రెండు నెలలకు మీట్స్ చేస్తున్నాం. తన పనులు తాను చేసుకుంటూ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకునేందుకు దీని ద్వారా వీలు కలుగుతుంది. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న బేబీ కేరియర్స్‌కు సరైన ఫ్యాబ్రిక్ వాడటం లేదు. బేబీ వేరింగ్ ద్వారా బిడ్డ ఎంతగా తల్లి శరీరానికి దగ్గరగా ఉంటే అంతగా తల్లిపాలు పెరుగుతాయని.. వీటన్నింటిపై మేం అవగాహన కల్పిస్తున్నాం. ఇప్పటికి 100కిపైగా ఈవెంట్స్ చేశాం. సిటీలో మిళింద్ సోమన్ నిర్వహించిన బేబీ వేరింగ్ మారథాన్ రన్‌లో మేం పాల్గొన్నాం. – కామ్నా గౌతమ్, హైదరాబాద్ పేరెంట్స్ లైబ్రరీ
Comments
Please login to add a commentAdd a comment