శంషాబాద్: ఎయిర్‌పోర్టు చూడాలన్న ఆసక్తి వారికి చేదు అనుభవం మిగిల్చింది. పార్క్ చేసిన కారులో ఉన్న బ్యాగును చోరీ చేసిన ఘటన శంషాబాద్ విమానాశ్రయంలో చోటు చేసుకుంది. వివరాలు.. ఆదిలాబాద్ కు చెందిన మార్కండేయ కుటుంబసభ్యులతో టవేరా కారులో శ్రీశైలం యాత్రకు వెళ్లి సోమవారం రాత్రి తిరిగి వస్తున్నారు. మార్గమధ్యలో ఎయిర్‌పోర్టు చూడడానికి వీరు బయలుదేరారు. రాత్రి 11 గంటల సమయంలో పార్కింగ్ ఏరియాలో కారును నిలిపివేసి ఎయిర్‌పోర్టు చూసి వచ్చారు. అప్పటికే గుర్తు తెలియని దుండగులు కారు అద్దాన్ని పగలగొట్టి అందులో ఉన్న బ్యాగును ఎత్తుకుపోయారు. బ్యాగులో పదివేల నగదు, రెండున్నర తులాల బంగారం, డెబిట్ కార్డుతో పాటు కొన్ని పత్రాలు కూడా ఉన్నాయని బాధితుడు తెలిపాడు. ఈ మేరకు విమానాశ్రయంలోని ఆర్‌జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు