
ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా 12న జిల్లా బంద్
ఖమ్మం కలెక్టరేట్: పోలవరం ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ఈనెల 12న జిల్లా బంద్‌కు జేఏసీ, పోలవరం వ్యతిరేక కమిటీలు పిలుపునిచ్చాయి. ఆర్డినెన్స్ రద్దయ్యేంత వరకూ పోరాటాలు కొనసాగించాలని నిర్ణయించాయి. పోలవరం వ్యతిరేక పోరాట కమిటీ కన్వీనర్ వట్టం నారాయణ అధ్యక్షతన ఖమ్మంలోని టీఎన్జీవోస్ ఫంక్షన్‌హాల్‌లో బుధవారం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో పలువురు నేతలు మాట్లాడారు. జిల్లా నుంచి ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలపడం సీమాంధ్రుల కుట్రలో భాగమేనని మండిపడ్డారు. గిరిజన సంస్కృతిని కాపాడేందుకు ప్రజా ప్రతినిధులందరూ ఉద్యమంలో కలసి రావాలని పిలుపునిచ్చారు. ఈనెల 10న హైదరాబాద్‌లో జరిగే ధర్నాను, ఈనెల 12న జరిగే జిల్లా బంద్‌ను, 14న ఢిల్లీలో జరిగే భారీ ధర్నాను విజయవంతం చేయాలన్నారు.
12న జరిగే జిల్లా బంద్‌కు వ్యాపార, వాణిజ్య, విద్య, వైద్య రంగాల వారు సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో ఉద్యోగ జేఏసీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కూరపాటి రంగరాజు, నడింపల్లి వెంకటపతిరాజు, సీపీఐ (ఎంఎల్)- న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకుడు కెచ్చెల రంగారెడ్డి, సీపీఎం జిల్లా నాయకుడు మచ్చా వెంకటేశ్వర్లు, సీపీఐ జిల్లా నాయకుడు తాటి వెంకటేశ్వరరావు, టీఆర్‌ఎస్ జిల్లా నాయకుడు డోకుపర్తి సుబ్బారావు, కాంగ్రెస్ జిల్లా నాయకుడు శీలంశెట్టి వీరభద్రం, తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు వాసం రామకృష్ణదొర, మాలమహానాడు జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి శేఖర్, టీఎన్‌జీవోస్ భద్రాచలం డివిజన్ కన్వీనర్ చల్లగుళ్ల నాగేశ్వరరావు, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి నందిపాటి మనోహర్, గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు దుగ్గి కృష్ణ, పీడీఎస్‌యూ రాష్ట్ర నాయకుడు కె.ఎస్.ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.