బంద్ ఉద్రిక్తం
ధర్నాలు, రాస్తారోకోలు
బంద్‌కు అఖిల పక్షాల మద్దతు
హన్మకొండ : మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వామపక్షాలు శుక్రవారం చేపట్టిన బంద్ జిల్లాలో విజయవంతమైంది. బంద్ సందర్భంగా అఖిల పక్షాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నాలు, రాస్తారోకోలు, దిష్టిబొమ్మల ద హనం కార్యక్రమాలు చేపట్టారు. హన్మకొండలో మున్సిపల్ కార్మికులచే హన్మకొండ జిల్లా బస్టేషన్ దిగ్భంధించారు. ఉదయం 5 గంటలకే జిల్లా బస్‌స్టేషన్‌కు చేరుకొని బస్‌స్టేషన్ మూడు గేట్లలో బైఠాయించి నాలుగు గంటల పాటు బస్సులు బయటకు రాకుం డా అడ్డుకున్నారు. ఈ బంద్‌కు వైఎస్సార్‌సీపీ, కాంగ్రెస్, వామపక్షాలు, టీడీపీ, బీజేపీ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు మద్దతు పలికారు.
విషయం తెలుసుకున్న పోలీసులు వారిని అరెస్టు చేసి ప్రత్యేక వాహనాల్లో పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్తుండగా కార్మికులు వాహనాలను అడ్టుకున్నారు. పోలీసులు చెరగొట్టే క్రమంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులను అదుపులోకి తీసుకుని హన్మకొండ పోలీసు స్టేషన్‌కు తరలించారు. బంద్‌ను పర్యవేక్షిస్తున్న టీఎన్‌ఎస్‌ఎఫ్ నాయకులు హన్మకొండలోని అంబేద్కర్ విగ్రహం కూడలిలోని ఓ దుస్తుల దుకాణం అద్దాలు పగులకొట్టారు. కాజీపేటలో మునిసిపల్ కార్మికుల ధర్నా చేశారు. వైఎస్‌ఆర్‌సీపీ, బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్ నాయకుల మద్దతు పలికారు. బాపూజీనగర్ నుంచి కాజీపేట సెంటర్ వరకు ర్యాలీ తీశారు.
హన్మకొండ, వరంగల్‌లో దుకాణాలను బీజేపీ, కాంగ్రెస్, వామపక్ష పార్టీల నాయకులు మూసి వేయించారు. జనగామ, నర్సంపేట, భూపాలపల్లి, పరకాల, మహబూబాబాద్, కురవి, ములుగు, స్టేషన్ ఘన్‌పూర్‌లో వామ పక్షాల బంద్ సంపూర్ణంగా జరిగింది. బంద్‌లో సీపీఐ, సీపీఎం, న్యూడెమోక్రసీ, వైఎస్సార్‌సీపీ, కాంగ్రెస్, టీడీపీ పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీల నాయకులు, కార్మికులు రాస్తారోకో చేసీ సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు.