
ఆకుల్లా రాలిన వెయ్యి గబ్బిలాలు
కేసముద్రం(వరంగల్ జిల్లా): ఎండదెబ్బకు ఒకటికాదు రెండు కాదు.. ఏకంగా వందల సంఖ్యల్లో గబ్బిలాలు నేలరాలుతున్నాయి. వరంగల్ జిల్లా కేసముద్రం మండలంలోని కోమటిపల్లి గ్రామంలోని శ్రీలక్ష్మీనారాయణస్వామి ఆలయ పరిసరాల్లో గల చెట్లపై వేల సంఖ్యలో గబ్బిలాలు ఏళ్లుగా ఉంటున్నాయి. వేకువ జామున నాలుగు గంటలకు అవి ఊరంతా తిరుగుతూ అరుస్తూంటే.. ఆ అరుపులకు గ్రామస్తులకు నిద్ర లేవడం ఆలవాటుగా మారింది.
అయితే, మూడు రోజులుగా ఎండ ప్రతాపం చూపిస్తుండడంతో తట్టుకోలేని గబ్బిలాలు ఆలయ పరిసరాల్లోని చెట్లను వీడి చెరువు కట్టపై ఉన్న రావి, మర్రి చెట్లపైకి చేరాయి. ఎండ తీవ్రత పెరుగుతుండడంతో ఒకదానిపై మరొకటి తేనెతుట్టెలా చేరుతున్నాయి. వేడిని తట్టుకోలేక చనిపోతు కుప్పలు.. కప్పులుగా కిందపడుతున్నాయి. ఈ రెండు రోజుల్లో సుమారు వెయ్యి వరకు గబ్బిలాలు చనిపోయినట్లు గ్రామస్తులు చెబుతున్నారు.