కేంద్రంలో బీసీల గొంతుకనవుతా !
- కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ స్పష్టీకరణ
- చట్టసభల్లో,ప్రమోషన్లలో బీసీలకు రిజర్వేషన్లపై ప్రధానితో చర్చిస్తా
- తెలంగాణలో బీసీలకు అన్యాయం ఆర్ కృష్ణయ్య
సాక్షి, హైదరాబాద్: దేశంలో వెనుకబడిన తరగతుల వారు ఎదుర్కొంటున్న సమస్యలను, ఇబ్బందులను కేంద్రప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి, వాటి షరిష్కారానికి కృషిచేస్తానని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. రాష్ట్ర బీసీ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో శనివారం నిర్వహిం చిన ‘బీసీ ఉద్యోగుల శంఖారావం’లో ఆయన పాల్గొన్నారు.
బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు, ఉద్యోగుల పదోన్నతుల్లో బీసీలకు రిజర్వేషన్‌లను వర్తింపజేసే బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టాలనే డిమాండ్లను ప్రధాని నరేంద్రమోదీ దృష్టికి తీసుకువెళతానని ఆయన హామీ ఇచ్చారు. తెలంగాణలో బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌ను కోరారు. చట్టసభల్లో 50 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ఢిల్లీకోటపై దండయాత్రకు సిద్ధంగా ఉండాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎల్‌బీనగర్ టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య బీసీ ఉద్యోగులకు పిలుపునిచ్చారు.
రద్దుచేసిన పింఛన్లు, రేషన్‌కార్డులు, ఇళ్లను లబ్ధిదారులందరికీ మళ్లీ మంజూరు చేసే వరకు సీఎం కేసీఆర్‌ను వదిలిపెట్టేది లేదని కృష్ణయ్య హెచ్చరించారు. మాజీమంత్రి జె. చిత్తరంజన్ దాస్ మాట్లాడుతూ, చట్ట సభల్లో రిజర్వేషన్లు కల్పిస్తేనే బీసీలకు న్యాయం జరుగుతుందన్నారు. కేంద్ర కార్మికమంత్రి బండారు దత్తాత్రేయను ఈ సందర్భంగా బీసీ సంఘాల నేతలు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో బీసీ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు జి.శ్రీనివాసులు, బీసీ సంక్షేమ సంఘం కన్వీనర్ ఎర్ర సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.