ఎక్కడా వెనక్కు తగ్గొద్దు
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ‘మావోయిస్టు ప్రభావిత సరిహద్దు జిల్లా అయిన ఖమ్మంలో శాంతిభద్రతల అమలు తెలంగాణ రాష్ట్రంపైనే ప్రభావం చూపుతుంది. అప్రమత్తంగా ఉండండి. ఇప్పటివరకు మావోలపై ఎలాంటి వ్యూహంతో ముందుకెళుతున్నారో... అదే వ్యూహంతో ముందుకెళ్లండి..ఎక్కడా వెనక్కు తగ్గొద్దు’అని తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీ అనురాగ్‌శర్మ జిల్లా ఎస్పీకి కర్తవ్యబోధ చేశారు. జిల్లా ఎస్పీ రంగనాథ్ బుధవారం హైదరాబాద్‌లో డీజీపీని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య ఖమ్మం జిల్లాలో శాంతిభద్రతలు, మావోయిస్టుల ప్రభావం, పోలవరం అంశంపై చర్చ జరిగింది. ఎస్పీ రంగనాథ్ క్షేత్రస్థాయి పరిస్థితులను డీజీపీకి తెలియజేశారు.
ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ మావోయిస్టులను ఎదుర్కోవడంలో వ్యూహాత్మకంగా వ్యవహరించాలని, ఇప్పటివరకు అనుసరిస్తున్న వైఖరిని కొనసాగించాలని ఎస్పీని ఆదేశించినట్టు సమాచారం. గతంలో గ్రేహౌండ్స్ విభాగంలో పనిచేసినప్పు డు కూడా డీజీపీ, ఎస్పీల మధ్య సమన్వ యం ఉంది. ఈ నేపథ్యంలో ఇరువురూ గ్రేహౌండ్స్ సహకారంపై కూడా చర్చించినట్టు తెలిసింది. దీంతోపాటు జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు ముంపునకు గురవుతున్న మండలాల గురించి కూడా ఎస్పీని డీజీపీ అడిగి తెలుసుకున్నారు.
ముంపు కిందకు వెళుతున్న మండలాల పరిస్థితిపై డీజీపీకి ఎస్పీ సవివరంగా నివేదిక అందించారు. ఇదే సమయంలో ముంపు మండలాల్లో ఇప్పటికే పనిచేస్తున్న జిల్లా పోలీసు సిబ్బంది అంశం కూడా చర్చకు వచ్చింది. దీనిపై డీజీపీ మాట్లాడుతూ ఖమ్మం జిల్లా పోలీసు సిబ్బంది ఎక్కడికీ మారేది లేదని, అయితే ఇందుకు సంబంధించి స్పష్టత వచ్చేందుకు కొంత సమయం పడుతుందని చెప్పినట్టు తెలిసింది.