ప్రభుత్వానికి బాసటగా ఉంటాం
పీఆర్టీయూ రాష్ట్ర కౌన్సిల్ అభయం
వేములవాడ :
ఉపాధ్యాయులకు మేలుచేసి తమ అభ్యున్నతికి పాటుపడితే ప్రభుత్వానికి బాసటగా నిలుస్తామని పీఆర్టీయూ రాష్ట్ర ప్రభుత్వానికి భరోసా ఇచ్చింది. వేములవాడలో జరిగిన ‘ప్రోగ్రేసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్’ కౌన్సిల్ సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పేరి వెంకట్‌రెడ్డితోపాటు సంఘపెద్దలు తమ డిమాండ్లను వెల్లడించారు. వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయుల 10వ పీఆర్సీని పక్షం రోజుల్లోగా అందించాలని ముఖ్యమంత్రిని కోరామన్నారు. అలాగే 60 శాతం ఫిగ్మెంట్ కోరుతున్నామని త్వరలోనే 45 నుంచి 50 శాతం సాధించటం ఖాయమని తెలిపారు.
కేజీ టూ పీజీ ఆంగ్లమాధ్యం అమలుచేయాలన్న కేసీఆర్ ఆకాంక్షలను స్వాగతిస్తున్నామన్నారు. 398 వేతనం కింద పనిచేసిన ఉపాధ్యాయులకు 2 ఇంక్రిమెంట్లు అందించాలన్నారు. సకల జనుల సమ్మెలో పాల్గొన్నామని, ఆ తర్వాత ఆదివారాలు కూడా పనిచేశామని గుర్తుచేశారు. అందుకగానూ 16 రోజుల ఈఎల్‌సీలు ఇవ్వాలన్నారు. ఆలిండియా టీచర్స్ ఆర్గనైజేషన్ చైర్మన్, మాజీ ఎమ్మెల్సీ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ఖాళీలను పూరించాలన్నారు. ఏ ప్రభుత్వమైనా ఉపాధ్యాయులకు మేలుచేస్తే సహకరిస్తామని లేదంటే నిదీస్తామని అదే పీఆర్టీయూ నైజమని తేల్చిచెప్పారు.
ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ పదో తరగతి విద్యార్థుల సిలబస్ తగ్గించాలన్నారు. రేషనలైజేషన్‌కు వ్యతిరేకం కాదనీ, అయితే స్కూల్ మ్యాపింగ్ విధానం విషయంలో మాత్రం పునరాలోచన అవసరమన్నారు. మరో ఎమ్మెల్సీ పూల రవీందర్ మాట్లాడుతూ హెల్త్‌కార్డులు జారీచేసిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో నంబూరి కనకదుర్గ, కె.అనురాధ, ఝాన్సీలక్ష్మి, సీహెచ్.యాదగిరి, ఎం.మహేశ్, ఎల్.కిరణ్, నందాదేవి, పి.వనిత, శ్రీనివాసాచారి, ఉమామహేశ్వర్ పాల్గొన్నారు.