ఈ యాచకులు.. కోటీశ్వరులు! | This beggers are not a beggers they are highly rich | Sakshi
Sakshi News home page

ఈ యాచకులు.. కోటీశ్వరులు!

Published Wed, Nov 22 2017 3:49 AM | Last Updated on Wed, Nov 22 2017 3:52 AM

This beggers are not a beggers they are highly rich - Sakshi - Sakshi

రబియా బసిరి, ఫర్జానా

సాక్షి, హైదరాబాద్‌: ఇద్దరూ మహిళలు.. ఉన్నత చదువులు చదివారు.. విదేశాల్లో జీవించారు.. కోట్లలో ఆస్తులు.. ఇంగ్లిష్‌లో అనర్గళంగా మాట్లాడగలరు. కానీ ఇప్పుడా కళ్లలో దైన్యం.. మాటల్లో నిస్సహాయత.. ఆవేదన.. ఒక్క రూపాయి కోసం చేతులెత్తి యాచిస్తున్న తీరు.. హైదరాబాద్‌లోని లంగర్‌హౌజ్‌ దర్గా వద్ద భిక్షమెత్తుకుంటున్న ఫర్జానా, రబియా బసిరి అనే ఇద్దరు మహిళల వ్యథ ఇది. హైదరాబాద్‌ నగరంలో ఉన్న యాచకులందరినీ పునరావాస కేంద్రాలకు తరలిస్తున్న పోలీసులు.. వీరిని చర్లపల్లిలోని ఆనందాశ్రమానికి తరలించారు. అక్కడ వీరి మాటతీరు, ఇంగ్లిష్‌లో అనర్గళంగా మాట్లాడుతుండటాన్ని గుర్తించిన అధికారులు వారి గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా ఒక్కొక్కరి కథ విన్నకొద్దీ విస్తుపోయే అంశాలు వెలుగుచూశాయి.

భర్త పోయిన వేదనతో..
హైదరాబాద్‌లోని ఆనంద్‌బాగ్‌కు చెందిన ఫర్జానా హైదరాబాద్‌లోనే డిగ్రీ పూర్తి చేసింది. అనంతరం లండన్‌లో ఎంబీఏ పూర్తి చేసింది. తర్వాత అక్కడే కొన్నేళ్లపాటు అకౌంట్స్‌ ఆఫీసర్‌గా ఉద్యోగం చేసింది. తిరిగి హైదరాబాద్‌కు వచ్చాక ఇస్మాయిల్‌ అనే వ్యక్తితో వివాహమైంది. వారికి అలీ అనే కుమారుడు ఉన్నాడు. తర్వాత కూడా ఆమె పై చదువులపై దృష్టి సారించింది. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను, బాధల సుడిగుండాలను ఎదుర్కొంది. ఇటీవల భర్త మరణించడంతో మానసికంగా బాగా కుంగిపోయింది. ప్రశాంతంగా ఉంటుందంటూ లంగర్‌హౌజ్‌ దర్గాకు వచ్చి ఉండిపోయింది. దర్గాకు వచ్చే భక్తుల వద్ద యాచిస్తూ బతుకుతోంది. ప్రస్తుతం ఆమె వయసు సుమారు 60 ఏళ్లు. బాబా ఆశీర్వాదంతో ఆమె బాగుపడుతుందని కుటుంబ సభ్యులు భావించారు. అయితే ఇటీవలి స్పెషల్‌ డ్రైవ్‌లో ఫర్జానాను గుర్తించిన పోలీసులు చర్లపల్లిలోని ఆనందాశ్రమానికి తరలించారు. ఇది తెలిసిన అలీ.. పోలీసులను సంప్రదించి తన తల్లిని తిరిగి ఇంటికి తీసుకెళ్లాడు.

దగ్గరి వాళ్లే మోసం చేస్తే..
రబియా బసిరిది కన్నీటి గాథ. హైదరాబాద్‌లోని డిఫెన్స్‌ కాలనీకి చెందిన బసిరికి 15 ఏళ్ల కింద అమెరికాలో హోటల్‌ వ్యాపారం చేస్తున్న మహ్మద్‌ అబ్దుల్‌ నయీంతో వివాహమైంది. ఆయనకు ఆమె మూడో భార్య. అక్కడ వారి దాంపత్య జీవితం సాఫీగానే సాగింది. ఇద్దరు పిల్లలు కలిగారు. కొన్నేళ్ల కింద ఆమె తండ్రి చనిపోవడంతో హైదరాబాద్‌కు వచ్చింది. కానీ తండ్రి మరణాన్ని తట్టుకోలేక మానసికంగా బాగా కుంగిపోయింది. ఆమెకు అమెరికా గ్రీన్‌కార్డు ఉన్నా.. తిరిగి వెళ్లకుండా ఇక్కడే ఉండిపోయింది. వారికి హైదరాబాద్‌లో ఉన్న ఆస్తులను చూసుకుందామనుకుంది. కానీ బంధువులు, దగ్గరివారు ఆమెను మోసం చేసి ఆ ఆస్తులను కొల్లగొట్టారు. దీంతో రోడ్డున పడ్డ బసిరి.. చివరికి లంగర్‌హౌజ్‌ దర్గాకు చేరుకుంది. ఇంగ్లిష్‌లో అనర్గళంగా మాట్లాడే బసిరి కథ విని జైలు అధికారులు కూడా చలించిపోయారు. అయితే ఆమె సోదరుడు వచ్చి హామీ ఇవ్వడంతో బసిరిని ఇంటికి పంపించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement