
నచ్చే సినిమా.. మెచ్చే వైఫై
* ఆర్టీసీ బస్సుల్లో కొత్త విధానానికి శ్రీకారం
* మొదటగా ఏసీ సర్వీసుల్లో ప్రారంభం
* అందుబాటులో ఉన్న సినిమాల్లో నచ్చింది చూసే వెసులుబాటు
హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేసే సురేశ్ సొంతూరు విశాఖపట్నం వెళ్లేందుకు ఆర్టీసీ బస్సు ఎక్కాడు. బస్సు బయలుదేరగానే సిబ్బంది ఏదో సినిమా ఆన్ చేశారు. నిన్నే టీవీలో చూసిన సినిమా కావడంతో మరొకటి పెట్టాలని సురేశ్ సిబ్బందిని కోరాడు. బస్సులో ఉన్న ఇంకొందరు ఆ సినిమానే ఉంచాలని పట్టుబట్టడంతో చేసేది లేక అదే సినిమా చూశాడు సురేశ్. ఆర్టీసీ బస్సుల్లో తరచూ ప్రయాణించే వారికి ఎదురయ్యే పరిస్థితి ఇది. ఇకపై ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేవారు ఎవరికి నచ్చిన సినిమా వారు ఎంచక్కా చూడొచ్చు. అయితే.. సొంత ల్యాప్‌టాప్ ఉన్న వారికే అది కూడా ఏసీ బస్సుల్లోనే ఇది సాధ్యమవుతుంది.
- సాక్షి, హైదరాబాద్
ఎలా సాధ్యం.. ఏమా విధానం..
ప్రస్తుతం ఆర్టీసీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 309 ఏసీ బస్సులు నడుపుతోంది. వీటిల్లో ప్రైవేట్ సర్వీస్ ప్రొవైడర్ల ఆధ్వర్యంలో ఇంట్రానెట్ వసతి కల్పిస్తున్నారు. ఆర్టీసీలో అందుబాటులో ఉన్న సినిమాలను అందులో పొందుపరుస్తారు. బస్సు ఎక్కిన ప్రయాణికులు తమ ల్యాప్‌టాప్‌లను సర్వర్‌తో అనుసంధానించుకోవాలి. అప్పుడు ఆర్టీసీ వద్ద అందుబాటులో ఉన్న సినిమాల జాబితా ల్యాప్‌టాప్‌లో ప్రత్యక్షమవుతుంది. అందులో నచ్చిన సినిమాను ఎంచుకుని చూడొచ్చు. ఇందుకు కొంత మొత్తాన్ని ఆర్టీసీకి చెల్లించాలి. తొలి గంటపాటు ఉచితంగా.. ఆ తర్వాత ప్రతి గంటకు రూ.10 చొప్పున చార్జ్ చేస్తారు.
ఈ చార్జీ విషయంలో ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. వారం పది రోజుల్లో ఈ విధానం అందుబాటులోకి రానుంది. మొదటగా గరుడ, గరుడ ప్లస్, వెన్నెల వంటి ఏసీ బస్సుల్లో దీనిని అందుబాటులోకి తెచ్చి.. ఆ తర్వాత సూపర్ లగ్జరీ బస్సులకూ వర్తింప చేయాలని ఆర్టీసీ భావిస్తోంది. మరోవైపు ప్రస్తుతం ఏసీ బస్సుల్లో సీట్లపై కవర్లు ఉండకపోవడంతో దుమ్ము చేరి ప్రయాణికులు ఇబ్బందిపడుతున్నారు. దీంతో సీట్లకు కవర్లు ఏర్పాటు చేసి వాటిని రోజూ మార్చాలని అధికారులు నిర్ణయించారు. వాటిపై వ్యాపార ప్రకటనలు ముద్రించే వెసులుబాటు కల్పించారు.
ఆర్టీసీలో 5జీ వైఫై సేవలు..
దేశంలోనే తొలిసారిగా 5జీ వైఫై సేవలను వినియోగించే రవాణా సంస్థగా ఏపీఎస్‌ఆర్టీసీ నిలవనుంది. తొలుతగా విజయవాడ బస్టాండ్‌లో బీఎస్‌ఎన్‌ఎల్ ద్వారా 5జీ వైఫై సేవలను మరికొద్ది రోజుల్లో ప్రారంభిస్తోంది. అమెరికాకు చెందిన క్వాడ్జెన్ అనే సంస్థతో ఇటీవల బీఎస్‌ఎన్‌ఎల్ టైఅప్ అయ్యింది. ఆ సంస్థ ద్వారా ఆర్టీసీ 5జీ వైఫై సేవలను పొందబోతోంది. సెల్ టవర్ల ద్వారా సిగ్నళ్లు పొందే సౌకర్యం అందుబాటులోకి రానందున ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ద్వారా విజయవాడ బస్టాండ్‌కు దీనితో అనుసంధానిస్తున్నారు. బస్టాండ్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన లాంజ్‌లో ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. తొలి అరగంట ఉచితంగా.. ఆ తర్వాత ప్రతి గంటకు రూ.10 చొప్పున చార్జీ వసూలు చేస్తారు. ఈ లాంజ్‌ను దాటి సిగ్నళ్లు వెళ్లకుండా జియో ఫెన్సింగ్‌తో నియంత్రిస్తారు. రెండో ప్రయత్నంగా హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్‌లో ఈ సేవలు ప్రారంభించాలని నిర్ణయించింది. 5జీతో ఇంటర్నెట్ స్పీడ్, క్వాలిటీ ఉన్నతంగా ఉంటాయని అధికారులు చెబుతున్నారు.