జిమ్ జిమ్మని..
భద్రాద్రి ఏజెన్సీలో వ్యాయామంపై వ్యామోహం
‘బమ్ చిక్..బమ్ చిక్..చెయ్యిబాగా.., ఒంటికి యోగా మంచిదేగా..’ అన్నట్టు జిల్లాలోని మారుమూల ప్రాంత వాసులు వ్యాయామంపై అమితాసక్తి చూపుతున్నారు. ఆరోగ్యం, ఫిట్‌నెస్‌ను కాపాడుకునేందుకు నిరంతరం కసరత్తు చేస్తున్నారు. యువకులు మొదలు పెద్దల వరకు..ఆడా మగ తేడాలేకుండా పలువురు ‘జిమ్’ జిమ్మని.. వ్యాయామశాలలవైపు పరుగులు తీస్తున్నారు. బీపీ, షుగర్, కీళ్లనొప్పులు, ఊబకాయం, గుండె జబ్బుల నియంత్రణకు ‘కార్డియాక్ గది’ని ఉపయోగించుకుంటున్నారు. శరీరాన్ని నాజుగ్గా ఉంచుకునేందుకు మహిళలు శ్రమిస్తున్నారు. సిక్స్‌ప్యాక్, ఎయిట్‌ప్యాకంటూ యువకులు దేహదారుఢ్యం కోసం ఆరాట పడుతున్నారు. ‘కండ కలవాడే మనిషి’ అని చాటిచెప్పే ప్రయత్నాల్లో ఉన్నారు. ‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అని భద్రాద్రి ఏజెన్సీలో పలువురు కావాల్సినంత ‘బరువు’ కోసం కుస్తీ పడుతున్న తీరుపై ‘సాక్షి’ సండేస్పెషల్.
ఏజెన్సీకీ జిమ్‌లు రావడం సంతోషం
గతంలో నేను కాకినాడలో యోగా శిక్షణ ఇచ్చాను. పెళ్లాయ్యాక భద్రాచలం వచ్చేటప్పుడు ఇక్కడ యోగ, వ్యాయామం చేయడానికి సరైన సౌకర్యాలు ఉంటాయో లేదోనని కొంత ఆందోళన చెందాను. కానీ ఇక్కడికి వచ్చాక కూడా..జిమ్ అందుబాటులో ఉండటంతో ఇక నేను నిశ్చంతగా ఉండిపోయాను. ఏజెన్సీ ప్రాంతంలోనూ కార్డియో, సైక్లింగ్ వంటి ఆధునాతన జిమ్ పరికరాలు అందుబాటులో ఉండటం సంతోషం. మహిళలు, ప్రజల్లో ఆరోగ్యం, ఫిట్‌నెస్ పట్ల అవగాహన మరింతగా పెరగాలి.
- సుధా, గృహిణి
కోట్ల ఆస్తుల కన్నా.. ఆరోగ్యం మిన్న
నాకు 53 సంవత్సరాలు. దాదాపు 30 ఏళ్లుగా నేను వ్యాయామం చేస్తున్నాను. కోట్ల ఆస్తులకన్నా..ఆరోగ్యం మిన్న అని నేను నమ్ముతాను. అందుకే నిరంతరం వ్యాయామం చేస్తూ ఉంటాను. అప్పట్లో స్వయంగా తయారు చేసుకున్న పరికరాలతో వ్యాయం చేస్తుండేవాణ్ని. ఇప్పుడు జిమ్‌లు అందుబాటులోకి వచ్చాయి. కాబట్టి ఇక్కడికి వచ్చి కసరత్తు చేస్తున్నాను. గతంలో పోలీసులూ నా దగ్గర శిక్షణ తీసుకునేవారు. గుండెనొప్పి వచ్చింది. వ్యాయామంతో దాన్ని అధిగమించాను.
- రామకృష్ణ, కార్పెంటర్
భద్రాచలం టౌన్: చలికాలం వచ్చేసింది. ఆరోగ్య రక్షణతో పాటు చురుకుదనం కోసం ప్రజలు ‘పరుగు’లు పెడుతున్నారు. పట్టణాలల్లో వాకింగ్‌లు, జాగింగ్‌లు చేయడం సర్వసాధారణమైంది. అధునాతన జిమ్‌ల వైపూ పరుగులు తీసేవారున్నారు. భద్రాద్రి ఏజెన్సీలోనూ ఇటీవలికాలంలో జిమ్‌లు, వ్యాయామాల పట్ల ఆసక్తి పెరుగుతోంది. అధునాతన పరికరాలున్న జిమ్‌లూ అందుబాటులోకి వచ్చాయి. కండలు పెంచుకోవడానికి యువకులు, ఫిట్‌నెస్ కాపాడుకోవడానికి మధ్యవయస్కులు, నాజుకైన శరీర ఆకృతి, ఆరోగ్యం కోసం స్త్రీలు ఆరాటపడుతున్నారు. వివిధ జబ్బులున్న వారు సైతం వ్యాయామం చేసి వాటిని నియంత్రించుకుంటున్నారు.
జిమ్ పరికరాలు- ఉపయోగం
భద్రాచలంలో జిమ్‌లో ఉన్న కార్డియాక్ గది ఎక్కువ మందికి ఉపయోగపడుతోంది. గుండెజబ్బులు, మధుమేహం, బీపీ, కీళ్లనొప్పులు, ఊబకాయం తదితర సమస్యలతో బాధపడుతున్న వారు దీన్ని బాగా ఉపయోగించుకుంటున్నారు. ఆరోగ్యరక్షణతో పాటు శరీరసౌష్టవాన్ని పెంచుకునేందుకు ఇది దోహదపడుతోందని వ్యాయామకులు చెబుతున్నారు. ఈ కార్డియాక్‌లో ప్రధానంగా ట్రెడ్‌మిల్ అందరికీ ఉపయోగపడుతోంది. దీనిపైన వాకింగ్, జాగింగ్ వంటివి చేస్తున్నారు. క్రమేణ స్పీడ్ పెంచుకుంటూ ఒంట్లో ఉన్న అదనపు కేలరీలను కరిగించుకుంటున్నారు. దీని డిస్‌ప్లేలో ఎన్ని కేలరీలు ఖర్చువుతున్నాయో..ఎన్ని కిలోమీటర్లు పరుగులు పెట్టారో కనిపిస్తుండటం ఎంతో సౌకర్యంగా ఉందని పలువురు చెబుతున్నారు. దీనిపై కనీసం రోజుకు 15 నిమిషాలు పరుగులు పెడితే ఎటువంటి రోగాలైనా దరి చేరవని చెబుతున్నారు.
రక్తప్రసరణ వేగవంతం చేయడానికి మసాజర్, కీళ్లనొప్పుల నియంత్రణ కోసం అప్‌రైడ్ బైక్, స్పిన్‌బైక్‌లు అందుబాటులో ఉన్నాయి.గ్యాస్‌ట్రబుల్, వెన్నునొప్పులు, ఊబకాయం నివారణ కోసం అబ్‌డామిన్ క్రంచెస్ (ఫ్లోర్ ఎక్సర్‌సైజు) వంటి అధునాతన పరికరాలు కూడా ఉన్నాయి. వీటన్నింటినీ ఎక్కువగా మధ్య వయసు వారు, మహిళలు ఉపయోగిస్తుండగా యువకులు కండలు పెంచుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. సిక్స్‌ప్యాక్, ఎయిట్‌ప్యాక్ కోసం ఆరాటపడే యువకులు స్ట్రెంత్ ఎక్సర్‌సైజ్‌లు, లెగ్ ప్రెస్, బట్టర్ ఫ్లై, బెంచ్ ప్రెస్, సీట్ అండ్ చస్ట్, షోల్డర్ ప్రెస్, పుల్లింగ్ ఎక్సర్‌సైజులు చేస్తున్నారు. ప్రొటిన్లతో కూడిన సమతుల ఆహారాన్ని తీసుకుంటున్నారు. అందమైన ఆకృతితో కండలు గట్టిపడేలా తగు ఎక్సర్‌సైజ్‌లు చేస్తున్నారు. జిమ్ నిర్వాహకులు ప్రతియేటా జిల్లా, రాష్ట్రస్థాయిలో పోటీలూ నిర్వహిస్తున్నారు. బెంచ్ ప్రె స్, పవర్‌లిఫ్టింగ్, వెయిట్‌లిఫ్టింగ్, బాడీ బిల్డిం గ్ తదితర అంశాల్లో ఈ పోటీలుంటున్నాయి.