
సాక్షి, సిటీబ్యూరో: వివిధ కారణాలతో శారీకంగా, మానసికంగా వేధింపులకు గురవుతున్న బాధిత మహిళలకు సైబరాబాద్ ‘భరోసా’ కేంద్రం అండగా ఉంటోంది. గతేడాది అక్టోబర్‌లో ప్రారంభించిన సైబరాబాద్ భరోసా కేంద్రానికి ఫిర్యాదు చేసేందుకు బాధితులు పెద్దసంఖ్యలో ముందుకొస్తున్నారు. ఈ ఐదు నెలల్లో 184 గృహ హింస కేసులు, 11 శారీరక వేధింపుల కేసులు, 56 పోక్సో కేసులు...ఇలా మొత్తం 251 కేసులు నమోదయ్యాయి. పలు కేసుల్లో బాధితుల భర్తలు, తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ ఇస్తున్నామని భరోసా నిర్వాహకులు పేర్కొంటున్నారు. లైంగిక వేధింపులు, శారీరక దాడి, ఇతర ఏ వేధింపులైనా భరోసా సెంటర్ వాట్సాప్ నంబర్ 9490617261కు వాట్సాప్ చేయాలని, 040–29882977 లేదా 100కు డయల్ చేయాలని సూచించారు.
ఫిర్యాదుల్లో కొన్ని...
♦ ఐటీ ఉద్యోగులుగా పనిచేస్తున్న తాము గత ఎనిమిదేళ్లుగా సహజీవనం చేస్తున్నామని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు అబార్షన్ చేయించాడని మాదాపూర్‌లో ఉం టున్న ఓ బాధితురాలు భరోసా కేం ద్రాన్ని ఆశ్రయించింది. అంతేగాక మరో మహిళతో సన్నిహితంగా ఉండటాన్ని ప్రశ్నించడంతో తనతో తెగదెంపులు చేసుకున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో భరోసా కేంద్రం సిబ్బంది ప్రతివాదికి సమన్లు పంపించి కౌన్సెలింగ్ ఇవ్వగా పెళ్లి చేసుకునేందుకు నిరాకరించడంతో మాదాపూర్ ఠాణాలో కేసు నమోదు చేయించారు.
♦ కారు డ్రైవర్‌గా పనిచేసే భర్త మద్యం సేవించి ఇంటికి వచ్చాక తనతో పాటు ముగ్గురు పిల్లలను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడని గచ్చిబౌలిలోని ఓ గృహిణి భరోసా కేంద్రాన్ని ఆశ్రయించింది. ఈ మేరకు అతడిని పిలిపించి సోషల్ కౌన్సెలర్‌తో కౌన్సెలింగ్ ఇప్పించారు. డీ–అడిక్షన్ వర్క్‌షాప్‌నకు హాజరుకావడంతో పాటు మద్యానికి దూరంగా ఉంటున్నాడు. పదిరోజుల తర్వాత భరోసా సిబ్బందికి ఎంక్వైరీ చేస్తే ఎటువంటి గొడవలు లేకుండా కుటుంబం సంతోషంగా ఉంటుందనే సమాచారం అందింది.
♦ ప్రేమించి పెళ్లి చేసుకున్న తమ వైవాహిక జీవితంలోకి ఇరువైపులా తల్లిదండ్రులు జోక్యం చేసుకుంటూ ఇబ్బందులు పెడుతు న్నారంటూ మాదాపూర్‌లో ఉంటున్న ఓ ఐటీ ఉద్యోగిని ఫిర్యాదుచేసింది.
♦ దీంతో భర్తతో గొడవలు జరిగి విడాకుల వరకు వచ్చిందని ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు భరోసా సిబ్బంది బాధితురాలు, ఆమె భర్తను పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఇరువైపులా తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ చేయడంతో ఆ కుటుంబం ఆనందంగా ఉంటోంది.
Comments
Please login to add a commentAdd a comment