మహాకూటమి భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి
సాక్షి, యాదాద్రి : భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మహాకూటమి అభ్యర్థిగా 20వేల మెజార్టీతో విజయం సాధించబోతున్నాను. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం కావడంతో ఈసారి ఎన్నికల్లో మహాకూటమిని గెలిపించాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు మహాకూటమి
వాగ్దానాలు నెరవేర్చడంలో టీఆర్‌ఎస్ సర్కార్ విఫలమైంది :
అభ్యర్థిగా నాకు ఓటు వేసి గెలిపిస్తామని చెబుతున్నారు. భువనగిరి నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా తన పనితీరు ఉంటుంది. గ్రామాల్లో పెద్ద ఎత్తున కాంగ్రెస్‌లో చేరుతున్నారని మహాకూటమి భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు. భువనగిరి మండలం బండసోమారంలో ప్రచారం సందర్భంగా ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలు వెల్లడించారు.
సాక్షి: ఎన్నికల ప్రచారం ఎలా సాగుతోంది?
కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి : మహాకూటమి తరఫున పోటీలో ఉన్న తన ఎన్నికల ప్రచారానికి అనూహ్య స్పందన లభిస్తోంది. పెద్ద ఎత్తున యువకులు, మహిళలు వివిధ పార్టీలను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. గ్రామగ్రామాన ప్రజలు తనకు మద్దతు ప్రకటిస్తున్నారు. నియోజకవర్గ ఇన్‌చార్జిగా పార్టీ కోసం తాను చేసిన కార్యక్రమాలకు మంచి స్పందన లభిస్తోంది. రెండు నెలల క్రితం నుంచే కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. ప్రచారంలో ఈమార్పు క్రమంగా కనిపిస్తోంది.
సాక్షి: మీ విజయానికి కలిసొచ్చే అంశాలు ఏమిటి?
కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి: ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఏ ఒక్కటీ పూర్తిగా అమలు చేయలేదు. గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలనే ప్రజలు ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నారు. రైతులకు రుణమాఫీ మూడేళ్లు చేశారు. అది వడ్డీలకే సరిపోయింది. సకాలంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించలేదు. దీంతో చాలా మంది విద్యార్థులు చదువుకు దూరమయ్యారు. లక్ష ఉద్యోగాలు ఇస్తామన్నారు. 10వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. తెలంగాణ తెచ్చుకుంది బాగుపడటానికా, ఆంధ్రా కాంట్రాక్టర్లను బతికించడానికా అన్న అభిప్రాయం ప్రజల్లో ఉంది.
సాక్షి: మీరు అధికారంలోకి వస్తే ప్రజలకు ఏమి చేస్తారు?
కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తోంది. ప్రతి పేద కుటుంబానికి ఆరు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా సరఫరా చేస్తుంది. ఖాళీ స్థలం ఉంటే ఇంటి నిర్మాణం కోసం రూ.5లక్షల మంజూరు చేస్తుంది. హైదరాబాద్ మురికి, కంపెనీల కాలుష్యంతో నిండిన మూసీని శుద్ధి చేసి స్వచ్ఛమైన జలాలను అందించడానికి పెద్ద ఎత్తున నిధులను ఖర్చు చేస్తాం. బునాదిగాని, పిలాయిపల్లి కాల్వలను పూర్తి చేస్తాం.
సాక్షి: నియోజకవర్గంలో మీరు గుర్తించిన ప్రధాన సమస్యలేమి?
కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి: వైద్యం, సాగు, తాగునీరు, ఉపాధి నియోజకవర్గంలో ప్రధాన సమస్యలు. వీటి పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కృషి చేయలేదు. అసెంబ్లీలో నియోజకవర్గ సమస్యలపై చర్చించి పరిష్కారం కోసం కృషి చేస్తా. ఇప్పటి వరకు ఉన్న సీఎం నిమ్స్‌కు వంద కోట్లు ఇవ్వడానికి కనికరం లేదు. 5 వేల మందితో నిమ్స్‌కు నిధులు కేటాయించాలని పాదయాత్ర చేశాను. అయినా స్పందన లేదు. బునాదిగాని, పిలాయిపల్లి కాల్వల ఆధునీకరణ కోసం నిధులు కేటాయించాలని పాదయాత్ర చేశాం. అయినా ప్రభుత్వం స్పందించలేదు. విభజన చట్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన బిల్లులో భాగంగానే ఎయిమ్స్ మంజూరైంది.
సాక్షి: మహాకూటమి మీతో కలిసి వస్తుందా?
కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి: మహాకూటమితో కాంగ్రెస్ పార్టీకి భారీ చేకూరుతుంది. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గంలో కలిసికట్టుగా పని చేస్తుంది. ఎలిమినేటి మాధవరెడ్డి లాంటి నేతను కలిగిన టీడీపీ మాతో కలిసి రావడం లాభిస్తుంది. రావి నారాయణరెడ్డి మహానేతను కలిగిన సీపీఐతోపాటు ప్రొఫెసర్ కోదండరాం నాయకత్వాన గల టీజేఎస్ మాకు అండగా ఉంది. మహాకూటమి సహకారంతో 20వేల మెజార్టీతో ఈ నియోజకవర్గంలో విజయం సాధించబోతున్నాను. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment