![Big loss to the farmers with Premature rain - Sakshi](/styles/webp/s3/article_images/2019/01/27/26KKT303Q-210104_1_4.jpg.webp?itok=JoOC5ls4)
వనపర్తి జిల్లా దొడగుంటపల్లిలో...
సాక్షి నెట్‌వర్క్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో శుక్ర, శనివారాల్లో కురిసిన అకాల వర్షం అన్నదాతలను అతలాకుతలం చేసింది. చేన్లలో చివరి దశ ఏరేందుకు సిద్ధంగా ఉన్న పత్తి మొత్తం వానకు తడిసి నేలరాలింది. పీచు దశలో ఉన్న మొక్కజొన్న పంట నేలకొరిగింది. మామిడి తోటల్లో చెట్లకు ఇప్పుడే వస్తున్న పూత మొత్తం రాలిపోయింది. పలుచోట్ల ఈదురుగాలలు, భారీ వర్షానికి చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. ఇండ్ల పైకప్పులు గాలికి ఎగిరిపోయాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో పాటు రాకపోకలకు అంతరాయం కలిగింది. మల్యాల అడ్డరోడ్డు సమీపంలో జగిత్యాల–కరీంనగర్ రహదారిపై వెళ్తున్న కారుపై ఎండిన చెట్టు కొమ్మ విరిగిపడటంతో కారు ముందుభాగం దెబ్బతిన్నది.
రామడుగు మండలం తిర్మలాపూర్‌లో పొన్ను దేవయ్యకు చెందిన కోళ్లఫామ్ రేకుల షెడ్డు కూలిపోవడంతో 2,500 కోడిపిల్లలు చనిపోయి రూ.3 లక్షల వరకు నష్టం జరిగిందని రైతు తెలిపాడు. గంగాధర వ్యవసాయ మార్కెట్ యార్డులోని కొనుగోలు కేంద్రంలో రైతులు అమ్మకానికి తెచ్చిన కందులు అకాల వర్షానికి తడిసిపోయాయి. పెద్దపల్లి మండలం రాఘవపూర్‌లో చెట్లు విరిగిపడగా, విద్యుత్ స్తంభం కూలిపోయింది. హన్మంతునిపేట వద్ద ఓ చెట్టు విరిగి రోడ్డుపై పడటంతో రాకపోకలకు కొంత ఇబ్బంది ఏర్పడింది. మంథని నియోజకవర్గంలో మిర్చి కొన్ని చోట్ల కాయ దశలో ఉండటంతో వర్షానికి తడిసి నల్లబడే అవకాశముందని రైతులు పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా మేడిపెల్లి మండలం దమ్మన్నపేటలో నిమ్మ మోహన్‌రెడ్డికి చెందిన బొప్పాయితోటలో దాదాపు 200 చెట్లు విరిగిపోయాయి.
Comments
Please login to add a commentAdd a comment