కాలేజీల్లో తప్పనిసరిగా బయోమెట్రిక్
- లేకపోతే అనుబంధ గుర్తింపు రద్దు
- ఫీజు రీయింబర్స్‌మెంట్ కూడా కట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ, పీజీ, బీటెక్, ఎంబీఏ కాలేజీల్లో లెక్చరర్లు, విద్యార్థులకు బయోమెట్రిక్ హాజరును తప్పనిసరి చేయాలని.. లేకపోతే ఆయా కాలేజీల గుర్తింపును రద్దు చేయాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. ఆ కాలేజీలను వచ్చే ఏడాది నుంచి ప్రవేశాలకు అనుమతించకూడదని.. వాటిలో చేరిన విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వవద్దని తీర్మానించింది. బుధవారం హైదరాబాద్‌లో ఉన్నత విద్యా మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి అధ్యక్షతన స్టేట్ కౌన్సిల్ ఐదో సమావేశం జరిగింది. విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య, కళాశాల విద్య, సాంకేతిక విద్య, ఇంటర్ విద్య కమిషనర్లు విజయ్‌కుమార్, ఎంవీరెడ్డి, అశోక్, ఉస్మానియా, కాకతీయ, జేఎన్టీయూహెచ్, శాతవాహన, తెలంగాణ వర్సిటీల వీసీలు, పలువురు ప్రొఫెసర్లు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై చర్చించి పలు తీర్మానాలు ఆమోదించినట్లు పాపిరెడ్డి వెల్లడించారు. ఆ నిర్ణయాలు..
► ఉన్నత విద్యా కాలేజీల్లో డిసెంబర్‌లో ప్రారంభమయ్యే రెండో సెమిస్టర్ నుంచి బయోమెట్రిక్ విధానం అమల్లోకి తేవాలి.
► పీహెచ్‌డీ ప్రవేశాలకు సంబంధించి కొత్త మార్గదర్శకాలను రూపొందించేందుకు త్వరలోనే వైస్ చాన్సలర్లతో సమావేశం ఏర్పాటు చేస్తారు.
► వచ్చే విద్యా సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా వివిధ యూనివర్సిటీల పరిధిలో పీజీ కోర్సులకు ఒకే పరీక్ష ద్వారా ప్రవేశాలు చేపడతారు. కొన్ని కోర్సుల పరీక్షల బాధ్యతలను ఉస్మానియాకు, మరికొన్ని కోర్సుల బాధ్యతలను కాకతీయ యూనివర్సిటీకి అప్పగిస్తారు.
► ఉన్నత విద్య అభివృద్ధికి, మెరుగైన విద్యా విధానం, సంస్కరణలపై అధ్యయనం చేసేందుకు రెండు కమిటీలను ఏర్పాటు చేస్తారు. మండలి వైస్ చైర్మన్లు వెంకటాచలం, ఎస్.మల్లేశ్ వాటికి నేతృత్వం వహిస్తారు. ఒక్కో కమిటీ మూడు నాలుగు రాష్ట్రాల్లో పర్యటి ంచి.. డిసెంబర్ 15న జరిగే కౌన్సిల్ సమావేశం నాటికి నివేదికలు అందజేస్తాయి.
► ఇక ఆన్‌లైన్‌లో ఉమ్మడి ప్రవేశ పరీక్షల నిర్వహణ, అమలుకు చేపట్టాల్సిన చర్యలపై అధ్యయనానికి ఓయూ, జేఎన్టీయూహెచ్ వీసీలు రామచంద్రం, వేణుగోపాల్‌రెడ్డిల నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేస్తారు.ఆ కమిటీ ఆన్‌లైన్ పరీక్షల విధానాన్ని రూపొందిస్తుంది.హా కామన్ యూనివ ర్సిటీ యాక్ట్‌పై మరోసారి సమీక్షిస్తారు. ప్రస్తుతమున్న కమిటీలో మరికొంత మంది వీసీలకు స్థానం కల్పిస్తారు. ప్రస్తుతం చేసిన నాలుగు ప్రతిపాదనలపై మరోసారి చర్చించి, తుది నిర్ణయం తీసుకుంటారు.
► ప్రైవేటు యూనివర్సిటీల చట్టంపై తుది నిర్ణయం బాధ్యతను ప్రభుత్వానికే అప్పగించారు. యూనివర్సిటీల్లో ఖాళీల భర్తీకి చర్యలు వేగవంతం చేయాలని నిర్ణయించారు.