తెలంగాణ బ్రాండ్కు పాకిస్థాన్ కోడలా?
తెలంగాణ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్గా సానియా మీర్జాను నియమించడాన్ని బీజేపీ తీవ్రంగా విమర్శించింది. పాకిస్థాన్ కోడలు తప్ప మరెవ్వరూ దొరకలేదా అని పార్టీ జాతీయ కార్యదర్శి, అసెంబ్లీలో బీజేపీ నాయకుడు డాక్టర్ కె.లక్ష్మణ్ మండిపడ్డారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మైనారిటీలను ఆకట్టుకోవాలన్న ఏకైక లక్ష్యంతోనే టీఆర్ఎస్ ప్రభుత్వం ఇలా చేస్తోందని ఆయన విమర్శించారు. సానియా మీర్జా మహారాష్ట్రలో పుట్టిందని, 1986లో హైదరాబాద్కు వచ్చిందని, పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ను 2010లో పెళ్లి చేసుకుని పాకిస్థాన్ కోడలు అయ్యిందని గుర్తుచేశారు. అలాంటి ఆమెను ప్రభుత్వం ఎలా గౌరవిస్తుందని మండిపడ్డారు.
ఎవరెస్ట్ అధిరోహించిన మలావత్ పూర్ణ అనే తెలంగాణ బాలికకు కేవలం 25 లక్షలు మాత్రమే ఇచ్చి, సానియా మీర్జాకు మాత్రం కోటి రూపాయలు ఇవ్వడం ఏంటని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు.1956 తర్వాత తెలంగాణకు వచ్చిన వారి పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడానికి కూడా డబ్బులు లేని ప్రభుత్వానికి.. సానియాకు ఇవ్వడానికి కోటి రూపాయలు ఎక్కడినుంచి వచ్చాయని లక్ష్మణ్ నిలదీశారు. ఆమె ఏనాడూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదని, బతుకమ్మ ఆడలేదని గుర్తుచేశారు.