
అసదుద్దీన్ ఓవైసీ (ఫైల్ ఫోటో)
నాకు గోవును ఇస్తే దానిని పవిత్రంగా చూసుకుంటాను. వాళ్లు నాకు ఇవ్వగలరా?
సాక్షి, హైదరాబాద్ : బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా తనకు కూడా ఓ గోవును ఇవ్వాలని ఎమ్‌ఐఎమ్ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా లక్ష గోవులను పంచుతామని ఆపార్టీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఎన్‌బీఎస్‌ఎస్ ప్రసాద్ ఇటీవల ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. సోమవారం ఓ సమావేశంలో ఓవైసీ దీనిపై స్పందిస్తూ.. బీజేపీ ప్రకటించిన విధంగా తనకు కూడా ఓ గోవును ఇవ్వగలరా అని ఆయన ప్రశ్నించారు. ‘‘వారు నాకు గోవును ఇస్తే దానిని పవిత్రంగా చూసుకుంటాను. వాళ్లు నాకు ఇవ్వగలరా?’’ అని ఓవైసీ ప్రశ్నించారు.
కాగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో గో మంత్రిత్వ శాఖలను ఏర్పాటు చేస్తామని ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. రాజస్తాన్‌లో వసుంధర రాజే గోవుల రక్షణకు ఏటా వందలకోట్లు కేటాయించి ప్రత్యేక రక్షణలు కూడా తీసుకుంటున్నారు.