సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ప్రత్యర్థి పార్టీలను సమర్థవంతంగా ఎదుర్కొనే నాయకుడినే అభ్యర్థిగా బరిలోకి దింపాలని భావిస్తున్న బీజేపీ ఈ మేరకు మంగళవారం నుంచి కసరత్తు ప్రారంభించింది. రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఉమ్మడి జిల్లాలోని నియోజకవర్గ నాయకులను పిలిచి వారి అభిప్రాయం మేరకు అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తోంది. ఇందులో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 10 నియోజకవర్గాల నాయకులతో గురువారం సమావేశం కాను న్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్, ఎంపీ బండారు దత్తాత్రేయ, ముఖ్య నాయకులు జి.కిషన్‌రెడ్డి, మురళీధర్‌రావు, మంత్రి శ్రీనివాస్ తదితరులు ఆయా నియోజకవర్గాల నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మండల పార్టీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, అసెంబ్లీ కన్వీనర్లు, జిల్లా పదాధికారులు, జాతీయ, రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులు, జిల్లా మోర్చాల అధ్యక్షులతో సమావేశమవుతారు.
ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు టికెట్టు ఆశిస్తున్న నాయకుల వివరాలు చెప్పి... ఎవరిని అభ్యర్థిగా ప్రకటిస్తే టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌కు గట్టి పోటీ ఇవ్వగలుగుతామని అభిప్రాయాలు సేకరిస్తారు. సమావేశంలో నేరుగా పేర్లు చెప్పలేని వారు తమ అభిప్రాయాన్ని రాతపూర్వకంగా ఇచ్చినా తీసుకుంటారు. ఈనెల 6వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల వారితో సమావేశమయ్యే నాయకులు 7న ఆశావహులలో బలమైన అభ్యర్థులను షార్ట్ లిస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. ఆ జాబితాను జాతీయ పార్టీ అధ్యక్షుడికి పంపించి ఆమోదముద్ర వేయిస్తే అధికారికంగా అభ్యర్థులను ప్రకటించడమేనని ఓ ముఖ్య నాయకుడు ‘సాక్షి ప్రతినిధి’కి తెలిపారు.
బీజేపీ టికెట్లకు పెరిగిన పోటీ
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో టికెట్ల కోసం పోటీ పెరిగింది. ఒకటి రెండు నియోజకవర్గాల్లో కొత్త నాయకులు వచ్చి చేరారు. పోటీ ఉన్న స్థానాల్లో రాష్ట్ర నేతలు స్థానిక నాయకుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోనున్నారు. ఆదిలాబాద్, ముథోల్‌లలో గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన పాయల్ శంకర్, పడకంటి రమాదేవిలకే తిరిగి సీట్లు ఖరారయ్యే అవకాశం ఉంది. ఓడిపోయిన నాటి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు కష్టపడ్డ వీరికే సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ పోటీ కూడా లేదు. బెల్లంపల్లిలో కొయ్యల ఏమాజీకి సైతం సీటు గ్యారంటీ. టీఆర్‌ఎస్ నుంచి ఆసిఫాబాద్ జెడ్పీటీసీగా ఎన్నికై, గత సంవత్సరం బీజేపీలో చేరిన ఏమాజీ బెల్లంపల్లి నియోజకవర్గంలో పోటీకి తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు. సిర్పూర్‌లో డాక్టర్ శ్రీనివాస్ కూడా గత కొంతకాలంగా నిబద్ధతతో పనిచేసుకుంటూ వస్తున్నారు. ఆయనకే సీటు ఖరారయ్యే అవకాశం ఉంది.
మంచిర్యాలలో ఎన్నారై ప్రయత్నం
మంచిర్యాలలో కూడా పార్టీ జిల్లా అధ్యక్షుడు ముల్కల్ల మల్లారెడ్డికే సీటు ఖరారని భావించినప్పటికీ, ఇటీవల ఓ ఎన్నారై పార్టీ రాష్ట్ర, జాతీయ స్థాయి నాయకుల ద్వారా ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఓ సామాజిక వర్గం నుంచి పార్టీలో ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకులు ఈ ఎన్నారైని తెరపైకి తెచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు. అయితే గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినా, పార్టీ జిల్లా అధ్యక్షుడిగా కష్టపడుతున్న మల్లారెడ్డికే అవకాశం ఇవ్వాలని నియోజకవర్గ నేతలు కోరుతున్నారు. కొత్త వాళ్లను తీసుకొచ్చి పార్టీ టికెట్లు ఇస్తే పార్టీ చులకనవు తుందని చెపుతున్నారు. ఈ విషయంలో మల్లారెడ్డి కూడా సీరియస్‌గానే ఉన్నారు.
పెరిగిన పోటీలో ఎవరో..?
చెన్నూర్‌లో పార్టీ అభ్యర్థిత్వం కోసం అందుగుల శ్రీనివాస్, రామ్‌వేణు మధ్య పోటీ ఉంది. ఎవరికి వారే తమకు టికెటు గ్యారంటీ అనే ధీమాతో ఉన్నారు. ఆసిఫాబాద్‌లో సిర్పూర్(టి) జెడ్పీటీసీ రామ్‌నాయక్ పార్టీ టికెట్టు తనకే అనే నమ్మకంతో పనిచేసుకుంటూ వస్తున్నారు. కొత్తగా ఎవరైనా వస్తే తప్ప ఆయనకు పోటీ లేదు. ఆసిఫాబాద్ మాజీ సర్పంచి మర్సుకోల సరస్వతి బీజేపీలో చేరుతున్నట్లు ప్రచారం జరిగినా, ఇప్పటివరకు ఆ ఊసు లేదు. నిర్మల్‌లో పార్టీ సీనియర్ నేత డాక్టర్ మల్లికార్జునరెడ్డి టికెట్టు రేసులో ముందున్నారు. ఇక్కడ ఇటీవలే డాక్టర్ స్వర్ణారెడ్డి పార్టీలో చేరి, సీటు కోరుతున్నా స్థానిక నాయకత్వం నుంచి మద్ధతు లేదు. రిజర్వుడు నియోజకవర్గాలైన బోథ్, ఖానాపూర్‌లలో కూడా తాజాగా టికెట్ల కోసం పోటీ పెరిగినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment