బీజేపీకే పుట్టగతుల్లేవ్: కేసీఆర్ | BJP puttagatullev: KCR | Sakshi
Sakshi News home page

బీజేపీకే పుట్టగతుల్లేవ్: కేసీఆర్

Published Mon, Jan 12 2015 3:18 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

బీజేపీకే పుట్టగతుల్లేవ్: కేసీఆర్ - Sakshi

బీజేపీకే పుట్టగతుల్లేవ్: కేసీఆర్

  • ఐటీ, టెక్స్‌టైల్ హబ్‌గా వరంగల్.. ‘డీఎస్సీ’ బాధితులకు ఉద్యోగాలు.. త్వరలోనే ఫాస్ట్ పథకం మార్గదర్శకాలు
  • సాక్షి, హన్మకొండ: తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి పుట్టగతులు లేవని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వ్యాఖ్యానించారు. వరంగల్ జిల్లాలో నాలుగు రోజుల పర్యటన ముగింపు సందర్భంగా ఆదివారం సాయంత్రం మాజీ మంత్రి కెప్టెన్ లక్ష్మీకాంతారావు నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. టీఆర్‌ఎస్ పార్టీకి సంస్థాగత నిర్మాణం లేదని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై సీఎం స్పందిస్తూ.. ‘తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు పునాదులు లేవన్నరు కదా? వాళ్లకసలు ఇక్కడ పుట్టగతులు లేవు.

    తెలంగాణలో ఎన్నికలు జరిగితే టీఆర్‌ఎస్ గెలుస్తుందో, బీజేపీ గెలుస్తుందో తెలియదా? ఎందుకనాలె.. ఎందుకు పడాలె’ అని మండిపడ్డారు. వివిధ కారణాల వల్ల 1998 నుంచి ఇప్పటివరకు వివిధ డీఎస్సీలలో ఎంపికై ఉద్యోగాలు రాని వారు దాదాపు 1200 మంది ఉన్నారని.. మానవతా దృక్పథంతో ప్రత్యేక సందర్భంగా పరిగణించి వారందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు కూడా ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. అలాగే వరంగల్ అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు, పలు ప్రభుత్వ కార్యక్రమాల అమలు తీరునూ సీఎం వివరించారు.
     
    వరంగల్ అభివృద్ధికి ప్రణాళికలు

    రాష్ర్టంలో రెండో పెద్ద నగరంగా ఉన్న వరంగల్‌ను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, టెక్స్‌టైల్ రంగాలకు మరో హబ్‌గా మార్చుతామని సీఎం తెలిపారు. ‘సూరత్, సోలాపూర్, తిర్పూర్‌లను కలగలిపే స్థాయిలో వరంగల్‌లో టెక్స్‌టైల్ పార్కును ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. కొన్ని ఐటీ కంపెనీలను వరంగల్‌లో నెలకొల్పేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. భవిష్యత్తులో వరంగల్ నగర జనాభా 20 లక్షలుకానుంది. అందుకు తగ్గట్టుగా నగరాన్ని అభివృద్ధి చేయాల్సి ఉంది. హైదరాబాద్ నగరం ఇష్టారీతిగా అభివృద్ధి చెందడంతో ట్రాఫిక్ కష్టాలు పెరిగాయి. అలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా వరంగల్‌ను అభివృద్ధి చేస్తాం’ అని ఆయన చెప్పారు.

    ఇక ఫాస్ట్ పథకానికి సంబంధించిన విధివిధానాలను త్వరలోనే రూపొందిస్తామని, బకాయిలు కూడా చెల్లిస్తామని, విద్యార్థులు, కాలేజీల యాజమాన్యాలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. మోసాలతో ఫీజు రీయింబర్స్‌మెంట్ సొమ్మును స్వాహా చేస్తున్న కాలేజీలపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. అలాగే జిల్లాలో మరిన్ని రిజర్వాయర్లు అవసరమన్నారు. ‘కంతనపల్లి, దేవాదుల నీటిని నిల్వ చేసేందుకు జిల్లాలో మూడు నాలుగు చోట్ల రిజర్వాయర్లు నిర్మించాల్సిన అవసరముంది.

    ఇందుకు ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులను ఆదేశించా. జిల్లాలో 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడం మా ప్రభుత్వ లక్ష్యం. కృష్ణా ట్రిబ్యునల్‌లో వివాదం ముగియగానే జూరాల-పాకాల ప్రాజెక్టు పనులపై దృష్టి పెడతాం’ అని సీఎం వివరించారు. ముస్లింల కోసం రూ. 3 కోట్ల చొప్పున వ్యయంతో వరంగల్, హన్మకొండల్లో రెండు షాదీఖానాలు నిర్మిస్తామని కూడా వెల్లడించారు. కాగా, గుడుంబా వల్ల నగరంలో అనేక కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సీఎం స్పందిస్తూ.. ‘రాష్ట్రంలో చాలా చోట్ల గుడుంబా సమస్య ఉంది.

    నేను గరీబ్‌నగర్‌కు పోతే అక్కడి మహిళలు మళ్లీ ప్రభుత్వ సారా తేవాలని అడిగారు. తెలంగాణ సమాజం ఈ సమస్యను అధిగమించాలి. దీనిపై చర్చ జరగాలే. తొందర్లోనే దీనిపై ఓ విధానం రూపొందిస్తాం’ అని ఆయన పేర్కొన్నారు. వారం రోజుల్లోగా నిజామాబాద్, కరీంనగర్‌లోనూ పర్యటించనున్నట్లు చెప్పారు. పది రోజుల్లో మళ్లీ వరంగల్‌కు వస్తానని, ఆలోగా నగర సమగ్రాభివృద్ధికి స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రణాళికలు రూపొందిస్తారని కేసీఆర్ తెలిపారు.
     
    ఫిలింసిటీని దున్నిస్తానని నేనెప్పుడన్న?: కేసీఆర్
     
    రామోజీ ఫిలింసిటీని లక్ష నాగళ్లతో దున్నిస్తానని గతంలో చెప్పిన మీరు తర్వాత మాట తప్పారంటూ ఓ విలేకరి(‘సాక్షి’ కాదు) అడిగిన ప్రశ్నతో ఈ విషయం సదరు విలేకరికి, కేసీఆర్‌కు మధ్య చర్చకు దారి తీసింది. విలేకరి ప్రశ్న అడగ్గానే సీఎం ఘాటుగా స్పందించారు. ‘ఎవడు చెప్పిండయ్యా నీకివన్ని, నీకెవలు చెప్పిళ్లయ్యా. నాకర్థం కాదు.. చెప్పేది ఇనవయ్యా, నీకేదో కిరాకు ఉన్నట్టుంది, నేను అన్నానయా.. నేను చెప్పినట్లు స్టేట్‌మెంట్ చూపిస్తవా? ఇంత అబద్ధాలు ఎందుకు చెబుతన్నవ్? నేను ఏ బహిరంగ సభల చెప్పలేదు. మీరు కల్పించుకున్న స్టోరీలవి, ఏ పత్రిక నీది? నీ మాటనుబట్టి నీది ఏ పత్రికో నాకు అర్థమైతంది. (విలేకరి ఎదో మాట్లాడబోతుండగా కేసీఆర్ అడ్డుపడుతూ) చెప్పేది ఇనవయ్యా, నువ్వొక్కనివే ఉన్నావయ్యా ప్రపంచంల? మేం అననిదాన్ని అన్నట్లు రాసి.. మీ ఇష్టం వచ్చినట్లు డ్రామాలు కొట్టి. ఇదేం దందానండి? జర్నలిజంల స్టాండర్డ్స్ ఉండాలె. దేర్ ఈజ్ ఎ లిమిట్. కేసీఆర్ అన్నాడా ఎప్పుడైనా.. రామోజీ ఫిలింసిటీని దున్నుతానని? రామోజీ ఫిలింసిటీని కబ్జా పెట్టిన్రని నేనన్నానా? రాజశేఖరరెడ్డి దుర్మార్గంగా రామోజీ ఫిలింసిటీ మీద ముఖ్యమంత్రి హోదాలో దాడి చేస్తే.. ఇది తప్పు, అన్యాయమని వ్యతిరేకించిన. ఐయామ్ ఆన్ రికార్డ్. నువ్వు ఏం తెల్వకుండ అడ్డం పొడుగు ప్రశ్నలు అడిగితే ఎట్లనయ్య? వాట్ ఈజ్ దిస్. నేను అంటున్ననయ్య నిజంగనే అద్భుతం అది. డెఫినెట్‌గా..
     
    విలేకరి: కబ్జా లేదా సార్?


    కేసీఆర్: ఒక గుంట కూడా లేదు. గుంట కూడా లేదు. (రెట్టింపు స్వరంతో)ఎందుకు నువ్వు అనవసరంగా ఆవేశపడుతున్నవ్? తెలుసుకోవాల... నీకేం తెలుసయ్యా? నువ్వెప్పుడైన రామోజీ ఫిలింసిటీ చూసినవా? వట్టిగనే స్టోరీలె చెప్తవా? ఎట్ల నాకర్థం కాదు. ఆయన(రామోజీ)కు గ వర్నమెంటు అక్వైర్ చేసి ఇయ్యలేదు తెల్సా. ఎవ్రీ ఇంచ్ హిహ్యాజ్ పర్చేజ్డ్. ఓ సమయంలో రాజశేఖరరెడ్డి అన్నడని పోతే ఆయన చూపించిండు నాకు.

    అసైన్డ్ ల్యాండ్ ఏమైనా ఉందా అని అడిగిన. అతను నాకు కాంపౌండ్ వాల్ చూపించి.. ‘అక్వైర్ చేసేటప్పుడు తెల్వకుండ పదమూడున్నర ఎకరాలు దళితుల అసైన్డ్ భూమిని కొన్నరు. అది తెలిసి వాళ్లది వాళ్లకు ఇచ్చిన. డబ్బులు కూడా వెనక్కి తీసుకోలేదని చెప్పిండు. ఇప్పుడక్కడ కాంపౌండ్ వాల్ వంకరగా ఉంటది. హి డిడ్ నాట్ ఎంక్రోచ్ ఎనీబడీ. ఫాక్ట్ తెల్వకుండా.. రామోజీరావు ఇయ్యాల దాదాపు నాలుగు వేల కోట్లతో ‘ఓం’ ఆధ్యాత్మిక సిటీని కడుతున్నరు.

    హైదరాబాద్‌కు ఓ గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రం కట్టబోతున్నరు. అది పూర్తయితే రోజుకు లక్ష మంది వస్తరని అంచనా. గొప్ప సంస్థను రాష్ట్రానికి యాడ్ చేస్తున్నప్పుడు వాళ్లు ఎవలైతే ఏంటండి? పెట్టుబడి పెట్టడానికి ఎవరు వచ్చినా స్వాగతిస్తం. మలేసియాకు, సింగపూర్‌కు బోయి గడ్డాలు పట్టుకుంటున్నం. తెలంగాణ గవర్నమెంట్ ఈ పిచ్చికతలు పెట్టదల్చుకోలేదు. ఎవలు పెట్టుబడులు పెట్టడానికి వచ్చినా రెడ్ కార్పెట్‌తో స్వాగతం పలుకుతమని చెప్పినం. వారిది మహరాష్ట్రనా, తమిళనాడా, ఆంధ్రప్రదేశా అనేదేమీ లేదు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement