
2019లో బీజేపీదే అధికారం
మొయినాబాద్: తెలంగాణ రాష్ట్రంలో 2019లో జరిగే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు మునిగిపోయే పార్టీలని, అప్పటి వరకు అధికార టీఆర్‌ఎస్‌పై ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని, అప్పడు ప్రత్యామ్నాయంగా నిలిచేది బీజేపీనే అన్నారు. టీఆర్‌ఎస్ నాయకత్వం కంటే బీజేపీ నాయకత్వం పటిష్టంగా ఉందన్నారు.
బీజేపీ జిల్లా కార్యవర్గ సమావేశం ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు అంజన్‌కుమార్‌గౌడ్ అధ్యక్షతన ఆదివారం మొయినాబాద్ మండలం చిలుకూరులోని బ్లూమ్స్ గార్డెన్‌లో జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన దత్తాత్రేయ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో పెద్ద పాత్ర పోషించింది బీజేపీనేనని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన ఏకైక జాతీయ పార్టీ కూడా తమదేనన్నారు.
అందరం కలిసి బంగారు తెలంగాణ నిర్మాణంకోసం కృషి చేయాలన్నారు. 2019 ఎన్నికలే లక్ష్యంగా పార్టీని బలోపేతం చేయాలని, అందుకోసం పార్టీ కార్యకర్తలంతా కష్టపడి పనిచేయాల్సిన అవసరముందన్నారు. పార్టీ సభ్యత్వ నమోదు వేగవంతం చేయాలనిసూచించారు.
భారత్‌ను నంబర్‌వన్‌గా నిలిపేందుకు మోదీ కృషి
ప్రపంచంలో భారత్‌ను నంబర్‌వన్‌గా నిలిపేందుకు ప్రధాని నరేంద్రమోదీ కృషి చేస్తున్నారని దత్తాత్రేయ అన్నారు. గ్రామాలు, పట్టణాలను ఆధునికీకరించి అభివృద్ధి చేసేవిధంగా బృహత్తర కార్యక్రమాలు చేపట్టబోతున్నామన్నారు. దేశంలో 5 కోట్ల మందికి ఉద్యోగాలు వచ్చే విధంగా నిరుద్యోగులకు ప్రత్యేక శిక్షణలు ఇచ్చి పరిశ్రమల్లో ఉద్యోగాలు ఇప్పించే కార్యక్రమం చేపట్టబోతున్నామని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకెళ్లే బాధ్యతను పార్టీ కార్యకర్తలే తీసుకోవాలన్నారు. అందుకోసం ప్రతి కార్యకర్త తమ వంతు సహకారాన్ని అందించాలన్నారు. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి కృష్ణదాస్ మాట్లాడుతూ.. తెలంగాణ చరిత్రను తిరగరాయాల్సిన సమయం ఆసన్నమైందని, ఆ మార్పునకు ఇదే మంచి అవకాశమన్నారు. బీజేపీ సభ్యత్వ నమోదే లక్ష్యంగా కార్యకర్తలు ముందుకు సాగాలన్నారు.
సమావేశంలో బీజేపీ జిల్లా ఇన్‌చార్జి యెండల లక్ష్మీనారాయణ, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్.మల్లారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి మోహన్‌రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రేంరాజ్, నర్సింహారెడ్డి, బాల్‌రెడ్డి, కంజర్ల ప్రకాష్, జంగయ్య యాదవ్, ప్రహ్లాదరావు, శంకర్‌రెడ్డి, పాపయ్యగౌడ్, బోసుపల్లి ప్రతాష్, ప్రభాకర్‌రెడ్డి, యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు విక్రంరెడ్డి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు బొక్క నర్సింహారెడ్డి, రాములు, శివరాజ్, పార్టీ మండల అధ్యక్షుడు గున్నాల గోపాల్‌రెడ్డి, సర్పంచ్‌లు ప్రభాకర్‌రెడ్డి, సంగీత, ఎంపీటీసీ సభ్యులు సహదేవ్, శోభ, నాయకులు శేఖర్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, శ్రీరాములు, ప్రశాకర్‌రెడ్డి, నర్సింహారెడ్డి, సుదీంధ్ర తదితరులు పాల్గొన్నారు.