నల్లబెల్లం విక్రయిస్తే రౌడీషీట్
వరంగల్ క్రైం : జిల్లాలో ఇకపై నల్లబెల్లం విక్రయించినా, రవాణా చేసినా అటువంటి వారిపై రౌడీషీట్ నమోదు చేస్తామని వరంగల్ రూరల్ ఎస్పీ అంబర్ కిషోర్ ఝా హెచ్చరించారు. వరంగల్ రూరల్, అర్బన్ పరిధిలో నిరుపేద కుటుంబాలను వీధిపాలు చేస్తూ వారి జీవితాలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్న గుడుంబాను నియంత్రించే ఉద్దేశంతో ఆదివారం వరంగల్ రూరల్ ఎస్పీ ఓ ప్రకటన విడుదల చేశారు.
ఇకపై గుడుంబా తయారీకి ఉపయోగించే ముడి సరుకులైన నల్లబెల్లం, పటికను అమ్మిన, రవాణా చేసిన వారిపట్ల కఠినంగా వ్యవహరించడంతోపాటు స్థానిక పోలీస్‌స్టేషన్లలో వారిపై రౌడీ షీట్ తెరుస్తామన్నారు. రూరల్ పరిధిలోని పరకాల, రేగొండ, ఏటూరునాగారం మండలాలకు చెందిన బెల్లం శివుడు, పోరుళ్ల సంతోష్, వలీబాబాతో పాటు అర్బన్ జిల్లా మిల్స్‌కాలనీ పోలీసు స్టేషన్ పరిధిలోని మహేందర్‌పై ఆయా పోలీస్‌స్టేషన్ పరిధిలో కేసులు నమోదు చేయడంతోపాటు వారిపై రౌడీషీట్ తెరిచినట్టు పేర్కొన్నారు.
నల్లబెల్లం నియంత్రణ కోసం పోలీసు శాఖ తరపున ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. గతంలో ఇటువంటి చర్యలకు పాల్పడిన వారిపై నిఘా పెట్టడంతోపాటు గ్రామాల్లో గుడుంబా త యారీ కేంద్రాలపై దాడులు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. ప్రజలు కూడా తమవంతు సహకారం అందించాలని కోరారు. ఎవరైనా నల్లబెల్లం విక్రయిస్తున్నా, రవాణా చేస్తున్నా ఆ విషయాన్ని సమీప పోలీస్ స్టేషన్‌లో తెలియజేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. 100 నంబరుకు ఫోన్ చేసి సమాచారం అందించాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఎస్పీ పేర్కొన్నారు.