పేక మేడ
సోమవారం సాయంత్రం... షేక్‌పేట సత్య కాలనీ సమీపంలోని బస్తీ...ఉన్నట్టుండి పెద్ద శబ్దం. అందరిలోనూ కలవరం. ఎక్కడ ఏం జరిగిందోనని ఆరాటం... తరచి చూస్తే...పేకమేడలా కూలిన నాలుగంతస్తుల భవనం. నిర్మాణంలోని భవనం కావడంతో పెను ముప్పు తప్పింది. సెల్లార్‌లోని కారు మాత్రం నుజ్జునుజ్జయింది. సమీపంలోని కార్మికులకు గాయాలయ్యాయి.
గోల్కొండ: నిర్మాణం పూర్తికావచ్చిన ఓ నాలుగు అంతస్తుల భవనం పేక మేడలా ఓ పక్కకు ఒరిగి పోయింది. ఎడా పెడా లోతైన సెల్లార్లు తవ్వడడమే ఇందుకు కారణమని అధికారులు పేర్కొంటున్నారు. సోమవారం సాయంత్రం షేక్‌పేట్‌లోని సత్యకాలనీ సమీపంలోని బస్తీలో నిర్మాణం పూర్తికావచ్చిన ఓ భవనం సెల్లార్‌లోని పిల్లర్లు కుప్పకూలడంతో సమీపంలోని మరో భవనం వైపు ఒరిగింది. వివరాల్లోకి వెళితే షేక్‌పేట్ హరిజన్‌బస్తీకి చెందిన సీహెచ్ పద్మావతికి బీజేఆర్ కమ్యూనిటీ హాల్ సమీపంలో 400 చదరపు గజాల స్థలం ఉంది. ఇందులో 200 గజాల్లో నాలుగు అంతస్తుల భవన నిర్మాణం చేపట్టింది.
ప్రస్తుతం నిర్మాణం పనులు చివరి దశలో ఉన్నాయి. ఇదిలా ఉండగా అదే భవనానికి ఆనుకొనే ఫారూఖ్ అనే వ్యక్తి మరో జీ+4 భవన నిర్మాణం చేపట్టాడు. ఇందులో భాగంగా అతను తన భవనానికి లోతైన సెల్లార్ తవ్వాడు. కాగా ఈ రెండు భవనాల వెనుక మరో వ్యక్తి ఇంటి నిర్మాణం కోసం సెల్లార్ తవ్వాడు. ఇదిలా ఉండగా సోమవారం పద్మావతి భవనంలోని పిల్లర్లు కుప్ప కూలడంతో భవనం పెద్ద శబ్దంతో పారూఖ్ భవనం మీదకు ఒరిగి పోయింది. అయితే ప్రమద సమయంలో అక్కడ ఎవరూ లేక పోవడంతో ప్రాణాపాయం తప్పింది.
ఈ సందర్భంగా కాంక్రిట్ ముక్కలు పడి సమీపంలోని గుడిసెల్లో నివాసం ఉంటున్న సునీత, బరువుల సూర్యలకు గాయాలయ్యాయి. పద్మావతి భవనం సెల్లార్‌లో పార్కుచేసిన కారు నుజ్జు నుజ్జు అయ్యింది. ప్రమాదంపై సమాచారం అందడంతో ఎమ్మెల్యేలు కౌసర్ మొహియుద్దీన్, మాగంటి గోపీనాథ్, ఎంఎల్‌సీ రాములు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పశ్చిమ మండలం డీసీపీ వెంకటేశ్వరరావు సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. భవనం అనుమతులపై విచారణ చేపడతామని షేక్‌పేట్ తహశీల్దార్ చంద్రకళ పేర్కొన్నారు. కాగా టౌన్‌ప్లానింగ్ అధికారులెవరూ సంఘటన స్థలానికి రాకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కుప్ప కూలినప్పుడే..
సాక్షి, సిటీబ్యూరో: ప్రమాదాలు జరిగినప్పుడో.. ప్రాణాలు పోయినప్పుడో మాత్రమే నగరంలో భవన నిర్మాణ అనుమతులు చర్చనీయాంశంగా మారుతున్నాయి. కాసులకు అలవాటుపడ్డ జీహెచ్‌ఎంసీ టౌన్‌ప్లానింగ్ అధికారులు నగరంలో అడ్డదిడ్డంగా వెలుస్తున్న భవనాలను పట్టించుకోవడం లేరు. తాజాగా షేక్‌పేట హరిజనబస్తీలోని జీప్లస్ మూడంతస్తుల భవనం ఒరిగిపోవడం అధికారుల వైఖరికి అద్దంపడుతోంది. ఎనిమిదేళ్లుగా ఎలాంటి అనుమతుల్లేకుండా ఈ భవన నిర్మాణం కొనసాగుతున్నా అధికారుల దృష్టికి రాకపోవడం గమనార్హం. భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో సెల్లార్‌లోని కారు నుజ్జునుజ్జయింది.
ఎలాంటి ప్రాణాపాయం జరగనప్పటికీ అధికారుల బాధ్యతారాహిత్యాన్ని బట్టబయలు చేసింది. ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే చర్చకు వస్తున్న నిర్మాణ అనుమతులు, భూసార పరీక్షలు, స్ట్రక్చరల్ స్టెబిలిటీ తదితర అంశాలను ఆ తరువాత ఎవరూ పట్టించుకోవడం లేదు. ఈ భవనానినికి సంబందించి ఎలాంటి అనుమతులు లేకున్నా, కొద్ది స్థలంలోనే పలు అంతస్తులు నిర్మిస్తున్నా.. తగినంత సెట్‌బ్యాక్‌లు వదలకుండా భారీ డీవియేషన్లకు పాల్పడుతున్నా.. సంబంధిత అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. తమ చేతులు తడిపితే చాలుననుకున్నవారు ఇరుకు జాగాలోనే భహుళ అంతస్థులు వెలుస్తున్నా పట్టించుకోవడం లేదు.
సెల్లార్లపై నిర్లక్ష్యం..
భూసార పరీక్షల కనుగుణంగా సెల్లార్ తవ్వకాల్లో ప్రమాణాలు పాటించాల్సి ఉన్నా..ఎవరూ పట్టించుకోవడం లేదు. ఎనిమిదేళ్ల క్రితం ప్రారంభమైనా మధ్యలో కొంతకాలం నిర్మాణ పనులు ఆపివేసినట్లు తెలిసింది. దీంతో ఐరన్ తుప్పుపట్టడం .. ఇతర కారణాల వల్ల కూడా ఒరిగిపోయి ఉండవచ్చునని అధికారులు పేర్కొంటున్నారు. సెల్లార్ చుట్టూ 10 అడుగుల మేర ఖాళీ స్థలాన్ని వదలాలన్న నిబంధనను కూడా పట్టించుకోలేదు.
గతంలో సోమాజిగూడలో ఓ కార్పొరేట్ ఆస్పత్రి సెల్లార్ తవ్వకంలో, మినిస్టర్ రోడ్‌లోని మరో ఆస్పత్రి నిర్మాణ సమయంలోనూ ఇలాంటి ఘటన లు జరిగయి. ఆర్‌కే పురంలో రెండేళ్ల క్రితం సెల్లార్ తవ్వకాల్లో జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. సెల్లార్ల తవ్వకాల్లో అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని టౌన్‌ప్లానింగ్ అధికారులు సూచిస్తున్నా నిర్వాహకులు పట్టించుకోవడం లేదు. దీనిపై చర్యలు తీసుకోవాల్సిన సిబ్బంది చూసీ చూడనట్లు వ్యవహరిస్తుండడంతో ప్రమాదాలకు కారణమవుతోంది.