నాందేడ్ ప్యాసింజర్ లోకోపెలైట్లు
సాక్షి,హైదరాబాద్: ‘‘ట్రాక్ పైన బస్సు కనిపించేటప్పటికి బస్సుకు మాకు మధ్య దూరం వంద మీటర్లే ఉంది. అప్పటికి కొద్దిసేపటి నుంచి హారన్ మోగిస్తూనే ఉన్నాం. ఆ సమయంలో ట్రైన్ 90 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. సడెన్‌గా ట్రాక్‌పై బస్సు కనిపించింది. ఆ హఠాత్పరిణామాన్ని ఊహించలేకపోయాం. అయినా ఎమర్జెన్సీ బ్రేక్ అప్లయ్ చేశాం. కానీ అప్పటికే జరగరాని ఘోరం జరిగిపోయింది. బస్సును ఢీకొట్టిన మా ట్రైన్ 400 మీటర్ల దూరంలో ఆగిపోయింది. కేవలం 22 సెకన్లలోనే అంతా అయిపోయింది. ’’ గురువారం నాందేడ్ ప్యాసింజర్ ట్రైన్ నడిపిన లోకోపెలైట్ కె.ఎం. వెంకటసత్యనారాయణ, సహాయ లోకోపెలైట్ కోటేశ్వర్‌రావులు వ్యక్తం చేసిన ఆవేదన ఇది. కానీ, ఏం లాభం... ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పకుండా అత్యంత క్లిష్టపరిస్థితుల్లో పనిచేసిన వారిద్దరిని మాత్రం గ్రామస్తులు వదిలిపెట్టలేదు. చిన్నారులను కోల్పోయామన్న బాధలో రాళ్లతో కొట్టి తీవ్రంగా గాయపరిచారు. ప్రస్తుతం గాయపడ్డ ఆ ఇద్దరు లోకోపైలట్లు లాలాగూడలోని కేంద్రీయ రైల్వే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.