అన్నీ బడ్జెట్ తర్వాతే!
కేబినెట్ విస్తరణ, పదవుల భర్తీ, ప్లీనరీ సమావేశాలు
అన్ని కార్యక్రమాలు తర్వాతే చేపట్టాలని కేసీఆర్ యోచన
హైదరాబాద్: బడ్జెట్ సమావేశాల తర్వాతే తన మార్కు పాలన మొదలుపెట్టాలని, అన్ని పనులు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు భావిస్తున్నారు. కేబినెట్ విస్తరణ మొదలు టీఆర్‌ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశాల వరకు అన్ని కార్యక్రమాలనూ బడ్జెట్ తర్వాతే చేపట్టాలని యోచిస్తున్నారు. ఈ మేరకు సన్నిహితులతో సీఎం తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. సెప్టెంబర్ తొలి వారంలోనే అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని అప్పట్లో సర్కారు ప్రకటించినా ఇప్పటివరకు కుదరలేదు. అయితే వచ్చే నెల తొలివారంలో బడ్జెట్ సమావేశాలను నిర్వహించే అవకాశమున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. కేబినెట్ విస్తరణ, కార్పొరేషన్లకు పాలకవర్గాల ఎంపిక, మార్కెట్ కమిటీలకు పాలకవర్గాలు, కేంద్ర సర్వీసు అధికారుల బదిలీలు(ఐఏఎస్‌లు, ఐపీఎస్‌ల కేటాయింపులు పూర్తయితే) తదితర అంశాలపై దృష్టి పెట్టనున్నట్లు పేర్కొంటున్నారు. నిజానికి బుధవారమే(22న) కేబినెట్ విస్తరణ ఉంటుందని అంతా భావించారు. అయితే రెండు రోజులుగా సీఎంతో పలు అంశాలపై అభిప్రాయాలను పంచుకున్న పలువురు నాయకులు మాత్రం దీనిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అమావాస్యకు ముందు కేసీఆర్ ఆ పని చేపట్టబోరని వారు చెబుతున్నారు. ముహూర్తాలు, శకునాలపై విశ్వాసమున్న సీఎం.. 22న కేబినెట్ విస్తరణ చేపట్టే అవకాశం లేదంటున్నారు.
బడ్జెట్ సమావేశాలకు రంగం సిద్ధం: బడ్జెట్ సమావేశాలను వచ్చే నెల తొలివారంలో నిర్వహించే అవకాశమున్నట్టు అధికారవర్గాలు వెల్లడించాయి. ఈ నెల 27న సమావేశాలు ప్రారంభించాలని తొలుత అనుకున్నా పలు కారణాలతో దాన్ని నవంబర్ మొదటి వారానికి మార్చుకున్నట్టు తెలుస్తోంది. పనులన్నింటిలో జాప్యానికి కేంద్ర సర్వీసు అధికారుల కేటాయింపులో జరుగుతున్న ఆలస్యమే కారణమని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అధికారుల సంఖ్య పరిమితంగా ఉండటంతో వారికి ఎక్కువ బాధ్యతలను అప్పగించాల్సి వస్తున్నదని అంటున్నాయి.