జడ్చర్ల: సంచలనం సృష్టించిన కాల్‌మనీ కేసు వ్యవహారం గురువారం తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో కలకలం రేపింది. కాల్‌మనీతో సంబంధం ఉన్న నిందితులు కొన్ని రోజులుగా జడ్చర్ల మండల పరిధిలోని గోప్లాపూర్, తదితర గ్రామాలలో తలదాచుకున్నట్లు సమాచారం ఉండడంతో గురువారం వేకువజామునే గుంటూరు జిల్లా పోలీసులు జడ్చర్లకు చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా రహస్య విచారణ చేపట్టిన పోలీసులు.. నిందితులు తలదాచుకున్న గ్రామాన్ని పసిగట్టినట్లు తెలుస్తోంది.
నిందితులు గోప్లాపూర్‌కు వచ్చి గుంటూరు ప్రాంతంతో సంబంధం కలిగి ఉన్న ఓ నాయకుడి దగ్గర ఆశ్రయం పొందినట్లు తెలిసింది. పక్కా సమాచారంతో పోలీసులు జడ్చర్లకు చేరుకుని నిందితుల అరెస్ట్‌కు ప్రయత్నించారు. అయితే పోలీసుల రాకను ముందే పసిగట్టిన నిందితులు తమ సెల్‌ఫోన్‌లను స్విచ్ ఆఫ్ చేసి ఇతర ప్రాంతాలకు పారిపోయినట్లుగా సమాచారం. అయితే అప్పటికే ఓ నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. జడ్చర్ల, మిడ్జిల్ మండలాల వాసులకు గుంటూరు జిల్లాతో సత్సంబంధాలు ఉండడంతో అక్కడి కాల్‌మనీ నిందితులు ఇక్కడ తలదాచుకునేందుకు దోహదపడిందని పోలీసులు భావిస్తున్నారు.