బావిలో కాళ్లు కడుక్కోవడానికి వెళ్లి ఇద్దరు చిన్నారుల మృతి
ఈత రావడంతో బయటపడిన మరో బాలుడు
నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లిలో ఘటన
మహబూబ్‌నగర్, జడ్చర్ల: కందూరు చేసి మొక్కు తీర్చుకోవాలని కుటుంబంతో కలిసి వచ్చారు. ఈ క్రమంలో ముగ్గురు బాలురు సమీపంలో ఉన్న బావిలో కాళ్లు కడుక్కోడానికి వెళ్లి ప్రమాదవశాత్తు అందులో పడి ఇద్దరు బాలురు మృతిచెందగా.. కొద్దిమేర ఈత వచ్చిన మరో బాలుడు త్రుటిలో తప్పించుకున్నాడు. ఈ విషాదకర సంఘటన నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లిలో మంగళవారం చోటుచేసుకుంది.
స్థానికుల కథనం ప్రకారం.. బిజినేపల్లికి చెందిన మతీన్ అనే వ్యక్తి కొన్నేళ్ల క్రితం జడ్చర్లకు వెళ్లి స్థిరపడ్డాడు. ఈ క్రమంలో స్వగ్రామంలో కందూరు చేయాలని భావించిన మతీన్ కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి మంగళవారం బిజినేపల్లిలోని దర్గా వద్దకు వచ్చారు. అయితే దర్గాకు పక్కనే ఉన్న వ్యవసాయ బావిలో కాళ్లు కడుక్కోవడానికి మతీన్ కుమారుడు పూర్కన్(10), బంధువు అజ్మత్ కుమారుడు మహమ్మద్(12), మరో బాలుడు అక్మల్ కలిసి వెళ్లారు. ఈ క్రమంలో వారు ప్రమాదశావత్తు బావిలో జారిపడ్డారు.
దర్గాకు పాతాళ్లు ఇస్తున్న కుటుంబ సభ్యులు విషయం గమనించి వారిని రక్షించే ప్రయత్నం చేయగా.. అప్పటికే పూర్కన్, మహమ్మద్ నీటిలో మునిగిపోయారు. అక్మల్‌కు ఈత రావడంతో ఒడ్డుకు చేరుకున్నాడు. అనంతరం స్థానికులు అక్కడికి చేరుకుని బావిలో నుంచి ఇద్దరు బాలుర మృతదేహాలను బయటికి తీశారు. విగతజీవులుగా మారిన చిన్నారులను చూసిన కుటుంబ సభ్యులు, బంధువులు బోరున విలపించారు.
జడ్చర్లలో విషాదఛాయలు..
జడ్చర్లలోని విద్యానగర్‌కాలనీలో నివాసం ఉంటున్న బీఆర్‌ఎస్ నాయకులు మతీన్, అజ్మత్‌ల కుమారులు మహమ్మద్, పూర్కాన్ బావిలో ప్రమాదవశాత్తు మునిగి మృతిచెందడంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. మతీన్‌కు పూర్కాన్‌తోపాటు మరో ఇద్దరు పిల్లలు ఉండగా.. అజ్మత్‌కు మహమ్మద్‌తోపాటు ఒక కూతురు ఉంది.
Comments
Please login to add a commentAdd a comment