మహబూబ్‌నగర్: పచ్చని కుటుంబంపై విధి కన్నెర్ర జేసింది. అన్నదమ్ములు ఇద్దరు భార్య, పిల్లలతో ఆనందంగా గడుపుతుండగా.. రోడ్డు ప్రమాదం రూపంలో తమ్ముడిని మృత్యువు కబళించగా, అనారోగ్యం కారణంగా అన్న మృతి చెందాడు. అన్నదమ్ములు ఇద్దరు మృతిచెందడంతో ఆ కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి.
జడ్చర్ల మున్సిపాలిటీలోని వెంకటేశ్వరకాలనీలో ఈ ఘటన చోటుచేసుకోగా.. పూర్తి వివరాలిలా.. గంగారం శేఖర్ (38), గంగారం రవి (32) ఇద్దరు అన్నదమ్ములు. మున్సిపాలిటీలో కార్మికులుగా పనిచేస్తున్నారు. అయితే, అన్న శేఖర్ కొంతకాలంగా అనారోగ్యానికి గురికావటంతో ఇంట్లోనే ఉంటున్నాడు. ఇతనికి భార్య ఉంది. అలాగే, తమ్ముడు రవికి భార్య సరిత, కూతురు ఉంది.
కూతురిని తీసుకెళ్లేందుకు వెళ్లి మృత్యుఒడికి..
ఈ క్రమంలో రవి సోమవారం ఉదయం చిట్టెబోయిన్‌పల్లి వద్ద ఉన్న సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో చదువుతున్న కూతురును బోనాల పండగకు తీసుకువచ్చేందుకు ఇంటి నుంచి బైక్‌పై బయలుదేరి వెళ్లాడు. ఉదయమే కావడంతో వాచ్‌మెన్ హాస్టల్ లోపలికి అనుమతించలేదు. మళ్లీ రావాలని చెప్పటంతో అక్కడి నుంచి భూత్పూర్ వైపు వెళ్లాడు.
ఈ క్రమంలోనే ప్రమాదవశాత్తు దివిటిపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో రవి మృతి చెందాడు. అతని వివరాలు ఏవీ తెలియకపోవడంతో పోలీసులు గుర్తు తెలియని మృతదేహంగా జిల్లా ఆస్పత్రి మార్చురీలో భద్రపర్చారు. ఈ క్రమంలో అతడు ఇంటికి రాకపోయే సరికి కుటుంబసభ్యులు వెతకటం ఆరంభించారు. ప్రమాద విషయం తెలుసుకుని మార్చురీలో ఉన్న మృతదేహన్ని కుటుంబసభ్యులు గుర్తించారు. దీంతో బుధవారం ఉదయం పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు.
అనారోగ్యంతో అన్న..
ఇదిలా ఉండగా, శేఖర్ అనారోగ్యంతో ఇంట్లోనే ఉంటుండగా బుధవారం తెల్లవారుజామున ఒక్కసారిగా ఆరోగ్య పరిస్థితి విషమించి మృతి చెందాడు. ఇరువురి అంత్యక్రియలు బుధవారం సాయంత్రం జడ్చర్లలో నిర్వహించారు. ఒకే కుటుంబంలో ఇద్దరు మృతి చెందటం, అంత్యక్రియలు నిర్వహించాల్సి రావటంతో ఆ కుటుంబ సభ్యుల్లో తీరని విషాదం అలుముకొంది.
Comments
Please login to add a commentAdd a comment