1 నుంచి క్యాష్‌లెస్ కార్పొరేట్ వైద్యం
ప్రభుత్వోద్యోగులకు పక్కాగా అమలుకు సర్కారు నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: వచ్చే నెల ఒకటో తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు నగదురహిత కార్పొరేట్ వైద్యాన్ని పక్కాగా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఇప్పటివరకు ప్రభుత్వం వద్దకు వచ్చిన ప్రతి పాదనలపై మరోసారి చర్చించి నిర్ణయం తీసుకోనుంది. ఈ విషయాన్ని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి ‘సాక్షి’కి చెప్పారు. ప్యాకేజీ సొమ్మును పెంచాలన్న కార్పొరేట్, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల విజ్ఞప్తి మేరకు శస్త్రచికిత్సల ప్యాకేజీని దాదాపు 40 శాతం పెంచడానికి సర్కారు సుముఖంగా ఉంది. తెలంగాణ ఏర్పడ్డాక కేసీఆర్ సర్కారు ప్రభుతోద్యోగులకు నగదురహిత ఆరోగ్య కార్డులను ఇచ్చింది.
అయితే ఆరోగ్య కార్డుల కింద కేవలం ఆరోగ్యశ్రీ పరిధిలోని నెట్‌వర్క్, ఇతర ప్రైవేటు ఆస్పత్రులే ఉద్యోగులకు వైద్యం చేస్తున్నాయి. కార్పొరేట్, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు ఈ కార్డుల ద్వారా వైద్యం చేయడంలేదు. ఆరోగ్యశ్రీలో వివిధ వ్యాధులకు ప్రభుత్వం చెల్లించే ప్యాకేజీ సొమ్ము ప్రకారం ప్రభుత్వోద్యోగులకు వైద్యం చేయడం తమకు గిట్టుబాటు కాదని... కాబట్టి నగదు రహిత ఆరోగ్య కార్డుల కింద వైద్యం చేయబోమని కార్పొరేట్ యాజమాన్యాలు తెగేసి చెప్పాయి. దీంతో ఈ అంశం ఏడాదిన్నరగా అపరిష్కృతంగా మిగిలింది.
మరోవైపు ఆరోగ్యశ్రీ కింద పేదలకు అందుతున్న సేవలతోపాటు ప్రైవేటు నెట్‌వర్క్ ఆస్పత్రులు తరచూ ఆరోగ్యశ్రీ రోగులకు వైద్య సేవలను నిలిపివేయడంపై సీఎం తీవ్ర అసహనం వ్యక్తంచేసినట్లు తెలిసిం ది. దీంతో ఈ రెండు అంశాలపై మంత్రి లక్ష్మారెడ్డి శనివారం ఉన్నతాధికారులతో సమావేశమై చర్చించారు. ప్రభుత్వోద్యోగులకు నగదు రహిత కార్పొరేట్ వైద్యం అమలు, ఆరోగ్యశ్రీ సేవల్లో అవాంతరాల తొలగింపుపై కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలని అధికారులను ఆదేశించారని తెలిసింది.
ఉద్యోగుల నుంచి నెలవారీ ప్రీమియం!
రాష్ట్రంలో 3.5లక్షల మంది ప్రభుత్వోద్యోగులు, 2.4 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు. వారి కుటుంబ సభ్యులతో కలిపి మొత్తంగా 20 లక్షల మందికిపైగా ఆరోగ్య కార్డుల ద్వారా ప్రయోజనం పొందుతున్నారు. శస్త్రచికిత్సల ప్యాకజీని 40శాతం పెంచేట్లయితే ప్రభుత్వంపై భారం పడకుండా ఉండేందుకు తమ వంతుగా నెలకు రూ.75కోట్లను ప్రీమియంగా చెల్లిస్తామని ఉద్యోగులు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. అయితే ఉద్యోగుల నుంచి ప్రీమియాన్ని వసూలు చేయాలా వద్దా అనే అంశంపై సర్కారు వారంలో నిర్ణయం తీసుకోనుంది. కాగా, ప్రభుత్వోద్యోగులకు వైద్య సేవల అంశంపై శనివారం వివిధ కార్పొరేట్, ప్రైవేటు ఆస్పత్రుల ప్రతినిధులతో చర్చించిన మంత్రి లకా్ష్మరెడ్డి దీనిపై ఈ నెల 25న మరోసారి వారితో చర్చించనున్నారు.