
దరఖాస్తుల స్వీకరణలో జాగ్రత్త..
ఖమ్మం క్రైం: జిల్లాలో మద్యం షాపుల కేటాయింపునకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ మహేష్‌బాబు సూచించా రు. జిల్లాలోని 14 ఎక్సైజ్ స్టేషన్‌ల సీఐలతో ఖమ్మంలోని ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో ఆదివారం డిప్యూటీ కమిషనర్ మహేష్‌బాబు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోమవారం నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఎక్సైజ్ సూపరింటెం డెంట్ కార్యాలయంలో స్టేషన్‌కు ఒక టెండర్ బాక్సు చొప్పున ఏర్పాటు చేయాలని ఆదేశిం చారు. సీమాంధ్రలో కలిసే ముంపు మండలాల్లోని తొమ్మిది దుకాణాలను ఇప్పటికే ఏపీబీసీఎల్(ఆంధ్రప్రదేశ్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్)కు అప్పగించామని, జూన్ 2వ తేదీ నుంచి వారికి అక్కడి నుంచే మద్యం సరఫరా జరుగుతుందని పేర్కొన్నారు. ముంపు మండలాల్లోని దుకాణాల్లో తూర్పు గోదావరి జిల్లాకు రెండు షాపులు, పశ్చిమ గోదావరి జిల్లాకు ఏడు షాపులు కేటాయించామని, అవి తమ పరిధిలోకి రావని తెలిపారు.
బూర్గంపాడు పోలీస్‌స్టేషన్ పరిధిలోని కొన్ని ప్రాంతాలు తమ పరిధిలో ఉన్నాయని, ఆ ప్రాంతాలకే తమ స్టేషన్ పరి మితం అవుతుందని తెలిపారు. రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేసే సరిహద్దుల ఆధారంగా స్టేషన్ పరిధిని విస్తరిస్తామని అన్నారు. ఈ నెల 21వ తేదీన దరఖాస్తుల స్వీకరణ గడువు ముగుస్తుందని, చివరి రోజున పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని, సాయంత్రం 5గంటల వరకు ఎవరైతే క్యూలో ఉంటారో వారికి కూపన్లు అందజేస్తామని, వారి దరఖాస్తులు మాత్రమే స్వీకరిస్తామని అన్నారు. దరఖాస్తు దారులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 23వ తేదీన సీక్వెల్‌లో డ్రా పద్ధతిలో షాపులను కేటాయిస్తామని, అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సివిల్ పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు.
ఈ విషయంపై కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్, ఎస్‌పీ రంగనాథ్‌లకు సమాచారం అందించామని అన్నారు. వారి సమక్షంలోనే మద్యంషాపుల వేలం నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఖమ్మం, కొత్తగూడెం ఎక్సైజ్ సూపరింటెండెంట్‌లు గణేష్, నరసింహారెడ్డి, సీఐలు పాల్గొన్నారు.