
సాక్షి, సిటీబ్యూరో: పాతబస్తీలోని నిజాం మ్యూజియం నుంచి రూ.300 కోట్ల విలువైన అరుదైన పురాతన వస్తువుల చోరీ కేసు...
♦ సుల్తాన్‌బజార్‌లో ఉన్న ప్రసూతి ఆస్పత్రి నుంచి నవజాత శిశువు చేతన అపహరణకు సంబంధించిన ఉదంతం...
♦ మార్కెట్ పోలీసుస్టేషన్ పరిధిలో జ్యువెలరీ దుకాణాలకు బంగారు ఆభరణాలు సరఫరా చేసే వ్యక్తి నుంచి 2.3 కేజీల బంగారం ఎత్తుకుపోయిన కేసు...
ఇవే కాదు... ఇలాంటి ఎన్నో కేసుల్ని కొలిక్కి తీసుకురావడంలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషించాయి. ఈ నేపథ్యంలోనే పోలీసు విభాగం ‘ఒక్క కెమెరా పది మంది పోలీసులతో సమానం’ అనే నినాదంతో ముందుకు వెళ్తోంది. ఢిల్లీ, ముంబై, సూరత్‌లకు దీటుగా రాజధానిలో ఉన్న కమిషనరేట్లతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా సీసీ కెమెరాలు ఏర్పాటవుతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 3.26 లక్షల సీసీ కెమెరాలు ఉండగా... సిటీలో ఉన్న వాటి సంఖ్య 2.5 లక్షలు దాటింది. అవసరమైన ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలకు ప్రత్యేక అనలటిక్స్ సైతం జోడిస్తామని డీజీపీ
ఎం.మహేందర్‌రెడ్డి ‘సాక్షి’తో అన్నారు.
ప్రథమ స్థానంలో హైదరాబాద్...ప్రస్తుతం రాష్ట్ర డీజీపీగా ఉన్నఎం.మహేందర్‌రెడ్డి హైదరాబాద్ పోలీసు కమిషనర్‌గా ఉండగా ఈ సీసీ కెమెరాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. నగరంపై నిరంతర పర్యవేక్షణ, నేరగాళ్లపై నిఘా, కేసుల్ని కొలిక్కి తీసుకురావడంలో ఈ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయనే ఉద్దేశంతో ముందుకు వెళ్లారు. వీటన్నింటినీ కమిషనరేట్‌లో ఉన్న కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్స్‌కు (సీసీసీ) అనుసంధానం చేయడం ప్రారంభించారు. 2014 నుంచి ఆయన చేస్తున్న, చేసిన కృషి ఫలితంగానే సీసీ కెమెరాల ఏర్పాటులో సిటీ పోలీసు కమిషనరేట్ ప్రథమ స్థానంలో నిలిచింది. ఆయన డీజీపీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ విధానాలకు రాష్ట్రం మొత్తం విస్తరిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 3.26 లక్షలు సీసీ కెమెరాలు ఉండగా... ఒక్క హైదరాబాద్‌లోనే 2.68 లక్షల వరకు ఉన్నాయి.
మూడు రకాలుగా ఏర్పాటు...
ఎవరో వస్తారని.. ఏదో చేస్తారని... ఎదురు చూడకుండా ఎవరికి వారుగా ముందుకు వచ్చి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా పోలీసు విభాగం చర్యలు తీసుకుంటోంది. ఓ పక్క ప్రభుత్వం కేటాయించిన కెమెరాలు ప్రధాన రహదారులపై ఏర్పాటవుతున్నాయి. వీటితో పాటు ఐదేళ్ల క్రితం అమలులోకి వచ్చిన ప్రజా భద్రత చట్టం నేపథ్యంలో వ్యాపారులతో ఆయా ప్రాంతాల్లో (కమ్యూనిటీ) సీసీ కెమెరాలు ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ రెండింటితో చాలా వరకు ప్రాంతాలన్నీ సీసీ కెమెరాల పరిధిలోకి వస్తున్నాయి. అయినప్పటికీ గల్లీలను సైతం వదలకూడదనే ఉద్దేశంతో ‘నేను సైతం’ అనే ప్రాజెక్టు అమలులోకి తీసుకువచ్చారు. ఇందులో భాగంగా ప్రతి వీధిలోనూ కొన్ని సీసీ కెమెరాలను ప్రజల కోసం ఏర్పాటు చేసేలా వ్యక్తుల్లో స్ఫూర్తి నింపారు.
ఏమాత్రం ‘తేడా’ రాకుండా చర్యలు...
ఈ కెమెరాల ఏర్పాటుకు సంబంధించి పోలీసుస్టేషన్ల వారీగా బాధ్యతలు అప్పగించిన ఉన్నతాధికారులు ప్రజల్లో చైతన్యం తీసుకురావడంతో పాటు వీటి ఆవశ్యకతనూ వివరిస్తూ ఎవరివారు ముందుకు వచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా ఏర్పాటవుతున్న కమ్యూనిటీ, నేనుసైతం కెమెరాలను ఎవరికి నచ్చిన మోడల్, సామర్థ్యం కలిగినని వారు ఏర్పాటు చేసుకుంటే సీసీసీతో అనుంధానం, పర్యవేక్షణలో ఇబ్బందులు ఎదురవుతాయి. అలా కాకుండా యూనిఫామిటీ కోసమూ పోలీసులు కొన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. పోలీసు విభాగమే ప్రముఖ కంపెనీతో సంప్రదింపులు జరిపింది. సీసీ కెమెరాలకు ఉండాల్సిన స్పెసిఫికేషన్స్‌ను నిర్దేశించి అంతా వాటినే ఏర్పాటు చేసుకునేలా చర్యలు తీసుకుంటోంది. దీంతో అన్నీ ఒకే రకమైన కెమెరాలు సమకూరుతున్నాయి.
అవి ఇవీ అన్నీ కలిపేస్తూ...
ఇప్పటికే మూడు కమిషనరేట్లలో పోలీసు, ట్రాఫిక్ విభాగాలు ఏర్పాటు చేసిన కెమెరాలు సీసీసీతో అనుసంధానించి ఉన్నాయి. వీటి సంఖ్య పరిమితం కావడంతో అన్నిచోట్లా నిఘా సాధ్యం కావట్లేదు. దీన్ని పరిగణలోకి తీసుకున్న ఉన్నతా«ధికారులు ఓ వ్యాపార సముదాయం, వాణిజ్య కూడళ్ళతో పాటు దుకాణాల్లో ఏర్పాటు చేస్తున్న వాటినీ సీసీసీతో అనుసంధానిస్తున్నారు. దుకాణం లోపల భాగం మినహా బయటకు ఉన్న కెమెరాలు, కాలనీలు, పబ్లిక్‌ప్లేసుల్లో ఉన్న అన్నింటినీ బ్రాడ్‌బ్యాండ్ ద్వారా సీసీసీలతో అనుసంధానిస్తున్నారు. దీంతో పోలీసు విభాగానికి చెందిన కెమెరాలూ ప్రధానంగా ట్రాఫిక్ కోణంలో ఉన్నా... అనుసంధానించినవి నిఘా, శాంతిభద్రతల పర్యవేక్షణకు ఉపకరిస్తున్నాయి. అనునిత్యం దాదాపు 10 శాతం కెమెరాలు మరమ్మతులకు లోనవుతుంటాయి. వీటి నిర్వహణను సైతం పోలీసులు ఆయా కంపెనీలకు అప్పగిస్తున్నారు.
భవిష్యత్తులో ప్రత్యేక అనలటిక్స్...
ఆయా ప్రాంతాల్లో ఏర్పాటయ్యే వివిధ కెమెరాలను అనునిత్యం మాన్యువల్‌గా పర్యవేక్షిస్తుండటం సాధ్యం కాదు. దీన్ని దృష్టిలో పెట్టుకున్న పోలీసు విభాగం ప్రస్తుతం సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తూ కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్స్‌కు కనెక్ట్ చేస్తున్నప్పటికీ భవిష్యత్తులో ప్రత్యేక అనలటిక్స్‌గా పిలిచే సాఫ్ట్‌వేర్స్‌తో వీటిని అనుసంధానించనుంది. ఇవి అందుబాటులోకి వచ్చిన తర్వాత ఓ ప్రాంతంలో ఎక్కువ సేపు కదలకుండా ఉన్న వ్యక్తులు, గుర్తుతెలియని వ్యక్తులు వదిలేసిన బ్యాగులు, ఎక్కువ కాలం పార్క్ చేసిన వాహనాలను సీసీ కెమెరాలే గుర్తిస్తాయి. దీంతో పాటు నిషేధిత ప్రాంతాల్లోకి ఎవరైనా ఎంటర్ అయినా, నిర్మానుష్యంగా ఉండే చోట ఎవరైనా సంచరిస్తున్నా కెమెరాలే గుర్తించి కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్‌లో ఉండే సిబ్బందికి పాప్‌అప్, బీప్ ద్వారా సమాచారం ఇస్తాయి.
ప్రజల స్పందన మరువలేం
సీసీ కెమెరాల ఏర్పాటు విషయంలో మా పిలుపునకు స్పందించి, ప్రజలు ఇస్తున్న సహకారం మరువలేనిది. కేవలం వ్యాపార, వాణిజ్య వర్గాలే కాకుండా కాలనీల ప్రజలు... జిల్లాల్లో మండలాలతో పాటు గ్రామాల్లో ఉండేవాళ్లూ ముందుకు వస్తున్నారు. ఎవరికి వారు తమ బాధ్యతగా భావించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. రానున్న రోజుల్లో మరిన్ని రకాలైన ప్రజలకు ఉపకరించే, నేరగాళ్లను కట్టడికి ఉపయుక్తమయ్యే సాంకేతిక పరిజ్ఞానాలను అందుబాటులోకి తీసుకువస్తున్నాం. నేరాల నిరోధించడం, కేసులు కొలిక్కి తీసుకురావడంతో సీసీ కెమెరాల పాత్ర కీలకంగా మారింది. వీటిని ఏర్పాటు చేసుకోవడం ఓ సామాజిక బాధ్యత అనే అంశాన్ని ప్రజల్లోకి సమర్థంగా తీసుకువెళ్ళడంలో పోలీసు విభాగం విజయవంతమైంది. – ఎం.మహేందర్‌రెడ్డి, డీజీపీ
ఇదీ సిటీలో పరిస్థితి...
ప్రభుత్వ కెమెరాలు: 10 వేలు
కమ్యూనిటీవి: 8500
నేనుసైతం: 2,50,000
♦ వీటి ఆధారంగా 2016లో 1200, 2017లో 3566, గత ఏడాది 3750 కేసులు కొలిక్కివచ్చాయి.
♦ సిటీలో అత్యధిక సీసీ కెమెరాలు బంజరాహిల్స్, జూబ్లీహిల్స్, పంజగుట్టల్లో ఉన్నాయి. ఇక్కడి దాదాపు ప్రతి 10 చదరపు కి.మీకి ఒకటి చొప్పున ఉంది.
Comments
Please login to add a commentAdd a comment