జిల్లా కేంద్ర సాధనకోసం వినూత్న నిరసన
మేకులపై పడుకొని దీక్ష చేపట్టిన గోవింద్‌రాజ్
మెదక్‌టౌన్: మెదక్ పట్టణాన్ని జిల్లా కేంద్రం చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్ర సాధన సమితి ప్రతినిధి గోవింద్‌రాజ్ ఆరుగంటలపాటు మేకులతో కూడిన చెక్కపై పడుకొని వినూత్న పద్ధతిలో నిరసన వ్యక్తం చేశారు. మెదక్ పట్టణంలో జిల్లా కేంద్ర సాధన సమితి ఆధ్వర్యంలో చేపడుతున్న రిలే దీక్షలు బుధవారం 77వ రోజుకు చేరాయి. బుధవారం దీక్షల సందర్భంగా జిల్లా కేంద్ర సాధన సమితి ప్రతినిధి గోవిందరాజ్ సుమారు ఆరుగంటలపాటు మేకులపై పడుకొని తన ఆకాంక్షను చాటాడు.
రిలేదీక్షలకు టీసీసీ అధికార ప్రతినిధి శశిధర్‌రెడ్డి సంఘీభావం ప్రకటించి, గోవిందరాజ్ చేపట్టిన నిరసనను విరమింపజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాకేంద్ర ఏర్పాటుపై సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన స్పష్టంగా లేదన్నారు. భవిష్యత్ ఉద్యమ కార్యచరణను గురువారం మెదక్ ఖిల్లాపై సమావేశం నిర్వహించి ప్రకటిస్తామన్నారు. కార్యక్రమంలో అఖిలపక్ష పార్టీల నాయకులు, జిల్లా కేంద్ర సాధన సమితి ప్రతినిధులు మల్కాజి సత్యనారాయణ, దమ్ము యాదగిరి, మామిళ్ల ఆంజనేయులు, గడ్డం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.