మీడియాకు వివరాలు వెల్లడిస్తున్న కేంద్ర మంత్రి గోయల్. చిత్రంలో ఎంపీలు అర్వింద్, బాపూరావు
సాక్షి, న్యూఢిల్లీ: నిజామాబాద్‌లో సుగంధ ద్రవ్యాల బోర్డు ప్రాంతీయ కార్యాలయం, ఎక్స్‌టెన్షన్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. మంగళవారం ఆయన ఈ అంశంపై పార్లమెంట్ భవనంలో మీడియాతో మాట్లాడారు. ‘నిజామాబాద్ ఎంపీ అభ్యర్థన మేరకు ఆ పట్టణంలో స్పైసెస్ బోర్డు డివిజనల్ ఆఫీస్‌ను అప్‌గ్రేడ్ చేసి రీజినల్ ఆఫీస్ కమ్ ఎక్స్‌టెన్షన్ సెంటర్ ఏర్పాటు చేయనున్నాం. నిజామాబాద్‌లో పలు రకాల సుగంధ ద్రవ్యాలు పండుతాయి. నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో మా కార్యక్రమాలను బలోపేతం చేసేందుకు వీలుగా ఈ సెంటర్ పనిచేస్తుంది. డిప్యూటీ డైరెక్టర్ స్థాయి అధికారి దీనికి నేతృత్వం వహిస్తారు. రెండేళ్లలో ఈ ప్రాంతం నుంచి ఎగుమతులు, ఉత్పత్తులు, నాణ్యత గణనీయంగా పెరుగుతుందని ఆశిస్తున్నాం. పసుపు, మిర్చిపై ప్రత్యేక దృష్టి పెట్టడం ద్వారా ఈ ప్రాంతం స్పైసెస్ హబ్‌గా మారుతుంది. టీఐఈఎస్, ఏఈపీ స్కీమ్‌ల ద్వారా మౌలిక వసతులు మెరుగుపరుస్తాం.
తెలంగాణలో సుగంధ ద్రవ్యాల పంటల ప్రగతికి ఈ నిర్ణయం దోహదపడుతుంది. కేంద్ర వ్యవసాయ శాఖ, కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ, వినియోగదారుల వ్యవహారాల శాఖ, వాణిజ్య శాఖల మధ్య ప్రభావవంతమైన సమన్వయం ఏర్పడుతుంది. గతంలో పసుపు బోర్డు గురించి మాట్లాడేవారు. అది చాలా చిన్నది. ఇన్ని అధికారాలు దక్కేవి కాదు. ఇంత సమన్వయం, మంత్రిత్వ శాఖల మద్దతు ఉండేది కాదు. అందుకే ఈ సెంటర్ తెచ్చాం. ఇది రైతుల ఆదాయం రెట్టింపయ్యేందుకు దోహదపడుతుంది. బోర్డుకు ఉండే అన్ని అధికారాలు దీనికి ఉంటాయి. ఈ ప్రాంతంలో టర్మరిక్ క్లస్టర్లు ఉన్నాయి. వాటికి ఈ సెంటర్ అండగా ఉంటుంది’అని వివరించారు.
పంటకు ఎక్కువ ధరే లక్ష్యం...
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ మాట్లాడుతూ... ‘స్పైసెస్ బోర్డు రీజినల్ సెంటర్ కమ్ ఎక్స్‌టెన్షన్ సెంటర్ ప్రకటన హర్షణీయం. టైస్ స్కీమ్ కింద ఎగుమతుల వృద్ధి, మౌలిక వసతులు పెంచడానికి, క్లస్టర్ స్కీమ్ కింద విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి ఉపయోగపడుతుంది. పసుపు బోర్డు కోసం నిజామాబాద్ రైతులు దశాబ్దాలుగా డిమాండ్ చేస్తున్నారు. అయితే ఆ బోర్డు వాణిజ్య శాఖకు మాత్రమే పరిమితమవుతుంది. వివిధ శాఖలతో సమన్వయం చేసే అధికారాలు ఉండవు.
రైతుల ఆదాయం రెట్టింపయ్యేందుకు మోదీ ప్రభుత్వం తెచ్చిన పథకాలేటైస్, క్లస్టర్. పసుపు ఎగుమతులకు అవకాశం పెరగడంతో డిమాండ్ అధికం అవుతుంది. దీంతో రానున్న రోజుల్లో ఎక్కువ ధర వచ్చే అవకాశం ఉంటుంది. అంతిమంగా రైతుకు పంట మీద ధర ఎక్కువ రావాలన్నదే మన లక్ష్యం. రైతులు డిమాండ్ చేసిన దాని కంటే కేంద్రం ఎక్కువే ఇచ్చింది’అని పేర్కొన్నారు. రైతులు.. పసుపు బోర్డు అడిగితే సుగంద ద్రవ్యాల బోర్డు ఇవ్వడాన్ని ఎలా చూడాలని మీడియా ప్రశ్నించగా.. ‘అంబాసిడర్ కారు కావాలా, మెర్సిడెస్ బెంజి కారు కావాలా? అని ఆలోచించి బెంజి కారు ఇచ్చింది. పసుపు బోర్డు డిమాండ్ చాలా కాలంనాటిది. అది ఇప్పుడు ఇచ్చినా ప్రభావవంతంగా ఉండదు’అని పేర్కొన్నారు.
నోటిఫికేషన్ విడుదల...
నిజామాబాద్‌లోని స్పైసెస్ బోర్డు డివిజనల్ ఆఫీస్‌ను రీజినల్ ఆఫీస్ కమ్ ఎక్స్‌టెన్షన్ సెంటర్‌గా అప్‌గ్రేడ్ చేస్తూ కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంగళవారం సాయంత్రం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు ఆ శాఖ అదనపు డైరెక్టర్ ఆర్.పి.కంచన్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ సెంటర్‌కు డిప్యూటీ డైరెక్టర్ స్థాయి అధికారి నేతృత్వం వహిస్తారని, ఎగుమతుల వృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తారని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వంతో ఉత్పత్తులు, సంబంధిత అంశాలను సమన్వయం చేస్తారన్నారు. అలాగే సుగంధ
ద్రవ్యాల బోర్డు డైరెక్టర్(మార్కెటింగ్) రెండేళ్లపాటు ఈ ప్రాంతీయ కార్యాలయం కార్యక్రమాలను ప్రతి నెలా పర్యవేక్షిస్తారని అన్నారు. దానిపై మంత్రిత్వ శాఖకు నివేదిక ఇస్తారని వివరించారు.
రైతులను మభ్య పెడుతున్నారు..
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పసుపు రైతులను మభ్యపెడుతూ మరోసారి మోసం చేయడానికి ఎత్తుగడ వేస్తోందని పసుపు రైతుల ఐక్య కార్యాచరణ కమిటీ ప్రతినిధులు ఆరోపించారు. నిజామాబాద్ కేంద్రంగా మసాల దినుసులు, సుగంధ ద్రవ్యాల ప్రాంతీయ బోర్డు ఏర్పాటుపై కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చేసిన ప్రకటనపై మంగళవారం జిల్లాలోని ఆర్మూర్‌లో కమిటీ ప్రతినిధులు ఒక ప్రకటన విడుదల చేశారు.
Comments
Please login to add a commentAdd a comment