ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌పై చర్య తీసుకోండి
స్పీకర్‌ను కలసి ఫిర్యాదు చేసిన సీపీఐ కార్యదర్శి చాడ
సాక్షి, హైదరాబాద్: ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలను టీఆర్ ఎస్‌లోకి చేర్చుకుంటూ అధికార పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందని సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. తమ పార్టీకి చెందిన దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ ఇటీవల టీఆర్‌ఎస్‌లో చేరడంతో, ఆయనపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ మధుసూదనాచారిని కలసి ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన బుధవారం అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. సీపీఐ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి, అధికార పార్టీ ప్రలోభాలకు లొంగిపోయిన రవీంద్ర కుమార్ పార్టీ ఫిరాయించాడని పేర్కొన్నారు.
పార్టీ ఫిరాయింపు చట్టాన్ని ఉల్లంఘించిన రవీంద్రకుమార్‌ను అనర్హుడిగా ప్రకటించాలని చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఫిరాయింపులు బాగా పెరిగాయన్నారు. స్పీకర్‌కున్న విశేషాధికారాలతో ఫిరాయించిన ఎమ్మెల్యేలను తొలగించవచ్చని తెలిపారు. పార్లమెంటులో ఫిరాయింపులు జరిగిన వెంటనే బహిష్కరిస్తున్నారని, అసెంబ్లీలో మాత్రం నాన్చివేత ధోరణి కొనసాగుతోందన్నారు. ఒకపార్టీ నుంచి గెలిచి మరో పార్టీలో చేరడం సిగ్గుచేటని, స్పీకర్ ఇప్పటికైనా ఫిరాయింపు దారులపై అనర్హత వేటు వేయాలని చాడ కోరారు.