చంద్రబాబు ఇంటి ఎదుట ధర్నా చేయండి
భువనగిరి : విద్యుత్ సమస్యతో అల్లాడుతున్న తెలంగాణ రైతులపై టీడీపీ నాయకులకు ప్రేమ ఉంటే విద్యుత్ కోసం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇంటి ఎదుట ధర్నా చేయాలని భువనగిరి ఎంపీ డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ అన్నారు. శుక్రవారం రాత్రి స్థానిక రహదారి బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రెండు రాష్ట్రాల్లో ఎక్కడ విద్యుత్ ఉత్పత్తి జరిగినా తెలంగాణకు 54 శాతం ఇవ్వాలన్న నిబంధనను చంద్రబాబు నాయుడు తుంగలో తొక్కారన్నారు. వెంకయ్య నాయుడు ఏపీ రిప్రజెంటేటివ్‌గా పనిచేస్తున్నారు తప్ప కేంద్రమంత్రిగా పనిచేయడం లేదన్నారు.
భువనగిరి, ఆలేరు ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, గొంగిడి సునీత మాట్లాడుతూ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించి భువనగిరి ప్రాంతానికి సాగు నీరందించాలన్నారు. ప్రతి మండలానికి 20 చెరువు చొప్పున అభివృద్ధి చేయడానికి సీఎం నిధులు మంజూరు చేస్తున్నారన్నారు. గంధమల్ల చెరువును రిజర్వాయర్ చేయబోతున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, టీఆర్‌ఎస్ రాష్ట్ర క్రమశిక్షణా సంఘం చైర్మన్ ఎలిమినేటి కృష్ణారెడ్డి, జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి, నాయకులు జడల అమరేందర్, ఎడ్లసత్తిరెడ్డి, నాగారం అంజయ్య,గాదె నరేందర్‌రెడ్డి, కొలుపుల అమరేందర్, మారగోని రాముగౌడ్, సిద్దుల పద్మలు పాల్గొన్నారు.