
సాక్షి, హైదరాబాద్: తన పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన భారత పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్ర హోం శాఖ బుధవారం జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని హైకోర్టును కోరారు. భారత పౌరసత్వ చట్టం–1955లోని సెక్షన్ 10 ప్రకారం ఆయన పౌరసత్వాన్ని రద్దు చేయడాన్ని సవాల్ చేశారు. కేంద్ర హోం శాఖ 2017 డిసెంబర్ 13న జారీ చేసిన ఆదేశాల తరహాలోనే తాజా ఉత్తర్వులు ఉన్నాయని, పూర్తిగా సాంకేతికంగానే కేంద్ర హోం శాఖ ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. 2017 నాటి రివ్యూ పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చిందని అదే తరహాలో తిరిగి జారీ చేసిన పౌరసత్వ రద్దు ఉత్తర్వులను కూడా కొట్టేయాలని కోరారు. గతంలో హైకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను అమలు చేయకుండానే సాంకేతికంగా ఉత్తర్వులు ఇవ్వడం చెల్లదని పేర్కొన్నారు. పౌరసత్వం రద్దుపై చెన్నమనేని హైకోర్టును ఆశ్రయిస్తే తనకు సమాచారం ఇవ్వాలని, తమ వాదనలు కూడా వినాలని కోరుతూ.. కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ హైకోర్టులో కేవియట్ దాఖలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment