సాక్షి, హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్ నుంచి కొనుగోలు చేస్తున్న విద్యుత్ ధర పెరిగే అవకాశముంది. తుది ధరలు నిర్ణయించాలని, ట్రూ అప్ చార్జీలను నిర్ధారించాలని ఛత్తీస్‌గఢ్ విద్యుదుత్పత్తి సంస్థ ఇటీవల ఆ రాష్ట్ర ఈఆర్సీని కోరింది. ఈ నేపథ్యంలో ధరలు పెరిగితే ఆ భారం నేరుగా రాష్ట్ర ప్రజలపై పడే అవకాశం ఉంది. ఛత్తీస్‌గఢ్‌లోని మార్వా థర్మల్ విద్యుత్ కేంద్రం (1,000 మెగావాట్ల సామర్థ్యం) నుంచి 12 ఏళ్లపాటు విద్యుత్ కొనుగోలు చేసేందుకు 2015 సెప్టెంబర్ 22న తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు ఒప్పందం (పీపీఏ) కుదుర్చుకుంది.
2017 ఏప్రిల్ నుంచి రాష్ట్రానికి విద్యుత్ సరఫరా ప్రారంభమైంది. యూనిట్‌కు రూ.3.90 చొప్పున ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (సీఎస్‌ఈఆర్సీ) నిర్ణయించిన తాత్కాలిక ధరతో ఈ కొనుగోళ్లు జరుగుతున్నాయి. పెరిగిన మార్వా విద్యుత్ కేంద్రం నిర్మాణ వ్యయాన్ని ఆమోదించడంతోపాటు 2018–21 మధ్య కాలానికి సంబంధించి విద్యుత్ తుది ధరను నిర్ణయించాలని కోరుతూ ఇటీవల ఛత్తీస్‌గఢ్ విద్యుదుత్పత్తి సంస్థ ఆ రాష్ట్ర ఈఆర్సీకి పిటిషన్ సమర్పించింది. అలాగే 2015–16, 2016–17, 2017–18కి సంబంధించిన ట్రూ అప్ చార్జీలను నిర్ధారించాలని కోరింది. ఈ పిటిషన్‌పై అభ్యంతరాలు, సలహాలు, సూచనలను 21 రోజుల గడువులోగా తెలపాలని ఛత్తీస్‌గఢ్ ఈఆర్సీ గత నెల 23న బహిరంగ ప్రకటన జారీ చేయగా.. మంగళవారంతో ఈ గడువు ముగియనుంది. బహిరంగ విచారణ నిర్వహించిన అనంతరం ఛత్తీస్‌గఢ్ విద్యుత్ ధర, ట్రూ అప్ చార్జీలను నిర్ధారిస్తూ త్వరలో ఛత్తీస్‌గఢ్ ఈఆర్సీ ఉత్తర్వులు జారీ చేయనుంది.
పొంచి ఉన్న ధరల షాక్
మార్వా థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణ వ్యయం రూ.8,999 కోట్లకు పెరిగిందని ఛత్తీస్‌గఢ్ విద్యుదుత్పత్తి సంస్థ ఆ రాష్ట్ర ఈఆర్సీకి దాఖలు చేసిన పిటిషన్‌లో తెలిపింది. పెరిగిన వ్యయాన్ని ఆమోదించాలని విజ్ఞప్తి చేసింది. రూ.4,785 కోట్ల అంచనా వ్యయంతో 2007–08లో మార్వా విద్యుత్ కేంద్రం నిర్మాణం ప్రారంభం కాగా సుదీర్ఘ జాప్యం తర్వాత 2016–17లో ఈ ప్లాంట్ నిర్మాణం పూర్తయింది. ఈ విద్యుత్ కోసం 2015లో రాష్ట్ర ప్రభుత్వం పీపీఏ కుదుర్చుకున్న సమయానికే రూ.6,830 కోట్ల వ్యయమైనట్లు కేంద్ర విద్యుత్ సంస్థ (సీఈఏ) నివేదికలు పేర్కొంటున్నాయి. థర్మల్ విద్యుత్ ప్లాంట్ల నిర్మాణ వ్యయం మెగావాట్‌కు రూ.6 కోట్లకు మించరాదని సీఈఏ మార్గదర్శకాలు పేర్కొంటున్నాయి. అయితే ఈ ప్లాంట్ నిర్మాణం పూర్తయ్యే సరికి నిర్మాణం వ్యయం మెగావాట్‌కు ఏకంగా రూ.9 కోట్లకు చేరింది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టుపై పెట్టిన పెట్టుబడిని తిరిగి రాబట్టుకునేందుకు వీలుగా విద్యుత్ ధరలను పెంచితే.. ఈ భారం నేరుగా రాష్ట్ర ప్రజలపై పడే అవకాశం ఉంది.
ట్రూ అప్ పేరుతో రూ.788 కోట్ల వాత
ఓ ఆర్థిక సంవత్సరంలో విద్యుదుత్పత్తికి ముందుగా అంచనా వేసుకున్న వ్యయం కన్నా వాస్తవ వ్యయం అధికమైనప్పుడు ఆ అధిక మొత్తాన్ని తర్వాతి కాలంలో వినియోగదారుల నుంచి వసూలు చేసి లోటు భర్తీ చేసుకోవడాన్ని విద్యుత్ రంగ పరిభాషలో ట్రూ అప్ చార్జీలంటారు. మార్వా ప్లాంట్‌కు సంబంధించి 2016–17లో రూ.339 కోట్లు, 2017–18లో రూ.382 కోట్లు, 2018–19లో రూ.406 కోట్ల ట్రూ అప్ చార్జీలు వసూలు చేసేందుకు తాజాగా ఛత్తీస్‌గఢ్ విద్యుదుత్పత్తి సంస్థ అనుమతి కోరింది. 2017 ఏప్రిల్ నుంచి రాష్ట్రానికి ఛత్తీస్‌గఢ్ విద్యుత్ సరఫరా ప్రారంభమైన నేపథ్యంలో 2017–18, 2018–19కి సంబంధించిన రూ.788 కోట్ల ట్రూ అప్ చార్జీల భారం రాష్ట్రంపై నేరుగా పడనుంది. మార్వా విద్యుత్‌కు సంబంధించిన ట్రూ అప్ చార్జీలను తెలంగాణ రాష్ట్రమే భరించాలని ఛత్తీస్‌గఢ్ ఈఆర్సీ తన వార్షిక టారీఫ్ ఉత్తర్వుల్లో తేల్చి చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment