
చిన్ని చిన్ని ఆశ..!
మంత్రి పదవి కోసం ఆ ముగ్గురి చూపు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: తెలంగాణ రాష్ట్రంలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన టీఆర్‌ఎస్‌లో పదవుల పందేరం కొనసాగుతోంది. మంత్రి పదవులు, నామినేటెడ్ పదవులు, కమిటీల ఏర్పాటుపై అన్ని స్థాయిల్లోని నాయకులు ఆశలు పెంచుకున్నారు. అధినేత వీటిపై ఎప్పుడు దృష్టి పెడతారా? అని సర్వత్రా ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. మంత్రిపదవులే కాకుండా, కార్పొరేషన్ చైర్మన్లు, ఇతర నామినేటెడ్ పోస్టులు, మార్కెట్, ఆలయ కమిటీల పదవులు ఆశిస్తున్న పలువురు నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్‌రావు, ఇతర ముఖ్య నాయకులను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు.
ఎలాగైనా పదవులు దక్కించుకోవాలన్న యోచనలో వారు హైదరాబాద్ టూర్లు వేస్తున్నట్లు తెలుస్తోంది. జూన్ 2న ఏర్పడిన తెలంగాణ తొలి ప్రభుత్వ కేబినెట్‌లో జిల్లాకు చెందిన టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు ఎవరికీ చోటుదక్కలేదు. దీంతో మలివిడత మంత్రివర్గ విస్తరణపై టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు భారీఆశలు పెంచుకున్నారు. సాధారణ ఎన్నికల్లో జిల్లా నుంచి టీఆర్‌ఎస్ తరుఫున ఏడుగురు ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. వీరిలో జూపల్లి కృష్ణారావు (కొల్లాపూర్), సి.లక్ష్మారెడ్డి (జడ్చర్ల), వి.శ్రీనివాస్‌గౌడ్ (మహబూబ్‌నగర్) మంత్రివర్గ విస్తరణలో తమకు చోటుదక్కడంపై భారీగా లెక్కలు వేసుకుంటున్నారు.
మెదక్ ఉపఎన్నిక, దసరా పండుగ.. ఆ తర్వాత ఈనెల 11, 12 తేదీల్లో చేపట్టనున్న టీఆర్‌ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశం.. ఈ సమావేశం తర్వాతైనా రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ చేపట్టే అవకాశం ఉందని విసృ్తత ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు తమవంతు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. జిల్లాలోని సగం అసెంబ్లీ స్థానాలకు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు గెలుపు సాధించినా మంత్రి పదవులు దక్కకపోవడంతో స్థానికంగా కొంత అసంతృప్తి కనిపిస్తోంది. అయితే మలి విడత మంత్రివర్గ విస్తరణలో జిల్లాకు ప్రాధాన్యత ఇస్తామని సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రి హరీష్‌రావు కూడా ప్రకటించారు. దీంతో మంత్రివర్గంలో చోటు దక్కించుకునేందుకు ముగ్గురు ఎమ్మెల్యేలు లాబీయింగ్‌లో మునిగితేలుతున్నారు. ఎమ్మెల్యేలు జూపల్లి కృష్ణారావు, సి.లకా్ష్మరెడ్డి, వి.శ్రీనివాస్‌గౌడ్ మంత్రివర్గంలో తమకు స్థానం దక్కే విషయంపై ఎవరికి వారు అంచనాలతో ఉన్నారు.
కార్పొరేషన్ పదవులపై కన్ను
ఓ వైపు ముగ్గురు ఎమ్మెల్యేలు మంత్రివర్గంలో చోటుకోసం ప్రయత్నిస్తుండగా, మరికొందరు ఎమ్మెల్యేలు కార్పొరేషన్ చైర్మన్ పదవులను ఆశిస్తున్నారు. నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే ఆలవెంకటేశ్వర్‌రెడ్డి వంటి వారు కార్పొరేషన్ పదవులపై ఆశలు పెంచుకున్నట్లు తెలుస్తోంది.
కాగా, గద్వాల నుంచి పోటీచేసి ఓటమి పాలైన బి.కృష్ణమోహన్‌రెడ్డి, కొడంగల్‌లో ఓటమి పాలైన మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్‌రెడ్డి నామినేటెడ్ పదవులు ఆశిస్తున్నట్లు సమాచారం. పార్టీలో చాలాకాలంగా కొనసాగుతున్న సీనియర్ నాయకులు, ఎమ్మెల్యే టికెట్ ఆశించి టికెట్ దక్కని వారు పలువురు కూడా ప్రాధాన్యం కలిగిన కార్పొరేషన్ చైర్మన్‌గా అవకాశం వస్తుందనే అంచనాలో ఉన్నారు. ఈ క్రమంలో టీఆర్‌ఎస్ ద్వితీయ శ్రేణి నాయకులు నామినేటెడ్ పదవుల కోసం పార్టీ అధినేతతోపాటు ముఖ్యనాయకులను ఆకర్షించే పనిలో పడ్డారు.
మార్కెట్ కమిటీ, ఆలయ కమిటీ చైర్మన్ పదవుల కోసం ఎమ్మెల్యేలు, ముఖ్యనేతల ద్వారా ముమ్మర ప్రయత్నాలు కొనసాగించారు. అయితే ఈనెల 11, 12 తేదీల్లో నిర్వహించనున్న టీఆర్‌ఎస్ ప్లీనరీ సమావేశాల తర్వాతే మలివిడత మంత్రి వర్గవిస్తరణ, నామినేటెడ్ పదవుల ఎంపిక ప్రక్రియ కొనసాగించే అవకాశం ఉందని పార్టీ వర్గాల ద్వారా అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదే జరిగితే జిల్లాలో ఎంతమందిని పదవులు వరిస్తాయో వెల్లడికానుంది.