
బాలాజీనగర్‌తండా రాధాకృష్ణ దేవాలయంలో మాట్లాడుతున్న శ్రీ త్రిదండి చినజీయర్‌స్వామి
ఆమనగల్లు : ఇంటర్ ఫలితాలలో జరిగిన తప్పిదాలకు అమాయకులైన పిల్లలు ప్రాణాలు కోల్పోయారని శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి అన్నారు. ఎవరో చేసిన తప్పుకు పిల్లలు బలికావద్దని ఆ తప్పులపై పోరాడి విజయం సాధించాలన్నారు. విద్యార్థులు మనోబలం, ఆత్మ విశ్వాసం పెంచుకోవాలని ఆయన సూచించారు. కడ్తాల మండలం బాలాజీనగర్ తాండా సమీపంలోని ధనరాశి పర్వతంపై వెలసిన శ్రీరాధాకృష్ణ దేవాలయ బ్రహ్మోత్సవాలలో సోమవారం చినజీయర్‌స్వామి, కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన రాధాకృష్ణ కళ్యాణోత్సవంలో వారు పాల్గొన్నారు. అనంతరం చిన్న జీయర్‌స్వామి మాట్లాడుతూ.. ఇంటర్ ఫలితాలలో జరిగిన తప్పు ఎవరిదో తెలియదు కానీ, అమాయకులైన 21 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని అన్నారు. మానవ తప్పిదాలు సహజమని, ఎవరివల్లనో జరిగిన తప్పిదాలకు తొందరపడి పిల్లలు ప్రాణాలు తీసుకోవడం సరికాదని ఆయన చెప్పారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఊరికే రాలేదని, పోరాడితేనే తెలంగాణ వచ్చిందని ఆయన గుర్తుచేశారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు దానికి ఎదురొడ్డి పోరాడి పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. పిల్లలలో మనోబలం, ఆత్మవిశ్వాసం పెరగాలని, అందుకోసం పిల్లలలో దేవునిమీద భక్తి విశ్వాసం పెంపొందించేలా తల్లిదండ్రులు చూడాలన్నారు. జీవితంలో జయాపజయాలు, వ్యాపారంలో లాభ నష్టాలు సహజమని, మన కృషి, శ్రమను బట్టి ఫలితాలు ఉంటాయని ఆయన వివరించారు. దైవ నామ స్మరణ మనసుకు బలాన్ని ఇస్తుందన్నారు. ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం చేస్తున్న కృషి అభినందనీయమని, అలాగే ఆలయాలకు సంబందించిన భూములను ఆలయాలకు దక్కేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దైవ సంకల్పబలంతో ఆలయాలు నిర్మిస్తున్నారని ప్రశంసించారు.
మనందరిదీ భగవత్ కుటుంబం
ప్రతి మినిషి తనలో ఉన్న చెడును, ద్వేషాన్ని విడనాడాలని, ప్రేమను, మంచిని పెంచుకుని ఒకే కుటుంబంలా ముందుకు సాగాలని త్రిదండి చినజీయర్ స్వామి అన్నారు. మనందరిదీ ఒకటే కుటుంబమని అది భగవత్ కుటుంబమని ఆయన అన్నారు. సమాజంలో ప్రతీది దైవ కల్పితమని, దైవానుగ్రహం లేనిదే ఏది సాధ్యంకాదని ఆయన చెప్పారు. యజ్ఞయాగాలు, భగవన్నామస్మరణ లోకశాంతికి ఉపకరిస్తాయని ఆయన వివరించారు. దైవానుగ్రహంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాభివృద్ధి కోసం అనేక మంచి కార్యక్రమాలు చేపడుతున్నారని అన్నారు.
గతంలో ప్రభుత్వాలు మేఘమథనం ద్వారా కృత్రిమ వర్షాలు కురిపించడానికి పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు చేశారని, అయితే భగవంతుని అనుగ్రహం లేక ఫలితాన్ని ఇవ్వలేదని ఆయన గుర్తుచేశారు. యజ్ఞాలు, యాగాలు, భగవన్నామస్మరణ వర్షాలు కురవడానికి దోహదపడతాయని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ ధర్మకర్త రామావత్ బిచ్చానాయక్, ఆమనగల్లు సింగిల్‌విండో చైర్మన్ దశరథ్‌నాయక్, సర్పంచ్‌లు గూడురి లక్ష్మీ నర్సింహారెడ్డి, కమ్లి, కృష్ణయ్య, లయన్స్‌క్లబ్ మాజి గవర్నర్ చెన్నకిషన్‌రెడ్డి, నాయకులు గంప వెంకటేశ్, సుదర్శన్‌రెడ్డి, రామకృష్ణ, శ్రీనివాస్‌రెడ్డి, రాంచందర్‌నాయక్, లచ్చిరాంనాయక్ తదితరులు పాల్గొన్నారు.