నేనూ పేదింటి బిడ్డనే... | chinta prabhakar listen the hostel students problems | Sakshi
Sakshi News home page

నేనూ పేదింటి బిడ్డనే...

Published Sun, Dec 7 2014 10:59 PM | Last Updated on Mon, Oct 22 2018 7:32 PM

నేనూ పేదింటి బిడ్డనే... - Sakshi

నేనూ పేదింటి బిడ్డనే...

నిత్యం నియోజకవర్గ ప్రజల అర్జీలస్వీకరణ.. అధికారులతో సమీక్షలు.. పార్టీ నాయకుల, కార్యకర్తలతో భేటీలు.. బిజీబిజీగా గడిపే సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్.. ఆదివారం సాయంత్రం మాత్రం అన్నీ కార్యక్రమాలు రద్దు చేసుకున్నారు. అధికారులతో తర్వాత మాట్లాడతానంటూ ఫోన్లు బందు పెట్టుకున్నారు. తనను ఆదివారం కలవద్దంటూ పార్టీ కార్యకర్తలకు కరాఖండిగా చెప్పేశారు. సాయంత్రం 5 గంటలకు సాధారణ వ్యక్తిలా వాహనం దిగి  ‘సాక్షి’ మైక్ పట్టుకుని సంగారెడ్డిలో మహిళా డిగ్రీ కళాశాల పక్కనే ఉన్న సాంఘిక సంక్షేమశాఖ ఎస్సీ, బీసీ హాస్టల్  వైపు అడుగులు వేశారు.

‘నేనూ పేదింటి బిడ్డనే...ప్రభుత్వ పాఠశాలలోనే సదువుకున్నా... బలహీనవర్గానికి చెందిన నాకు పేదల బతుకులు తెలుసు’.. హాస్టల్ పిల్లల కష్టాలు,  కడగండ్లు తెలుసుకునేందుకే ‘సాక్షి’ తరఫున విలేకరిగా వచ్చా... చెప్పండి మీ సమస్యలేమిటో.. అంటూ విద్యార్థులతో మాట్లాడారు.
 
హాస్టళ్లలోనే నిద్రిస్తా... రూపు రేఖలు మారుస్తా
చాలా హాస్టళ్లలో సమస్యలు ఉన్నమాట వాస్తవం. హాస్టల్‌లోని సమస్యలు తెలుసుకునేందుకు త్వరలో అన్ని హాస్టళ్లలో రాత్రి బస చేస్తా. సీఎం కేసీఆర్, జిల్లా మంత్రి హరీష్‌రావు దృష్టికి హాస్టల్ సమస్యలను తీసుకెళ్లి వాటి రూపురేఖలు మారుస్తా. తాగునీటి సమస్య పరిష్కారం కోసం ప్రతి హాస్టల్లో ఆర్‌ఓ ప్లాంటు ఏర్పాటు చేయిస్తా. మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటా. విద్యార్థులు కోరిన విధంగా కాస్మొటిక్ చార్జీల పెంపు అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తా. పదో తరగతి విద్యార్థుల కోసం హాస్టల్‌లలో ప్రత్యేకంగా స్టడీ రూం, లైబ్రరీలు ఏర్పాటుకు చర్యలు చేపడతా. నూతన హాస్టల్ భవనాల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి అందజేస్తాం.                     
 -చింతా ప్రభాకర్, ఎమ్మెల్యే సంగారెడ్డి
 
చింతా ప్రభాకర్: అమ్మా.. నీ పేరేంటీ, ఎంతకాలం నుంచి హాస్టల్‌లో ఉంటున్నావు,  ఏమైనా సమస్యలున్నాయా?
మౌనిక: సార్ నేను మూడేళ్లుగా ఇదే హాస్టల్‌లో ఉంటున్నా. ఒకే ప్రాంగణంలో మూడు హాస్టల్‌లు ఉండటంతో ఇబ్బంది పడుతున్నాం. నీటి సమస్య, మరుగుదొడ్ల సమస్య ఉంది.
చింతా ప్రభాకర్: మీ హాస్టల్‌కు మంజీరా వస్తోంది కదా...అయినా నీటి సమస్య ఉందా?
శ్రవంతి (9వతరగతి): తాగునీటికి నీటి ఇబ్బంది లేదు సార్..కానీ ఇతర అవసరాలకు నీళ్లు సరిపోవటంలేదు. మూడు హాస్టల్‌ళ్లలోని  240 మంది విద్యార్థులకు ఒకే బోరు ఉంది. నీటికి ఇబ్బంది పడుతున్నాం. ఒక బోర్ వేస్తే మా సమస్య తీరుతుంది.
చింతా ప్రభాకర్: హాస్టల్‌లో భోజనం ఎలా ఉంది. మెనూ ప్రకారం వేళకు టిఫన్, భోజనాలు పెడుతున్నారా?
భవానీ: మెనూ ప్రకారం భోజనం, టిఫిన్ పెడుతున్నారు సార్.. అయితే నాణ్యత ఉండటం లేదు. బియ్యం దొడ్డుగా ఉండటంతో తినటానికి ఇబ్బంది పడుతున్నాం. సన్న బియ్యం అన్నం పెట్టేలా చూడండి.
చింతా ప్రభాకర్:  ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయా, కరెంటు బాగానే వస్తోందా?
సమర్పణ: ఎస్సీ -ఏ, ఎస్సీ- బీ హాస్టళ్లతోపాటు బీసీ బాలికల హాస్టల్  ఈ మూడు ఒకే ప్రాంగణంలో ఉండటం వల్ల ఇబ్బందులు పడుతున్నాము. హాస్టల్లను వేరు చేసి ఇతర భవనాల్లోకి మారిస్తే అందరు విద్యార్థులకు మెరుగైన వసతి సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి. కరెంటు సమస్య ఉంది. కరెంటు పోతే కొవ్వొత్తులు వెలిగించుకుంటాం.
(పక్కనే ఉన్న బీసీ హాస్టల్ వార్డెన్ కవితతో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ ‘ఏమ్మా బాలికల హాస్టల్‌లో కరెంటు పోతే కొవ్వొత్తుల వెలుగులపై ఆధారపడితే ఎలా..ఇన్వర్టర్ సదుపాయం లేదా’ అంటూ ప్రశ్నించారు. ‘‘ ఇన్వర్టర్ సదుపాయం మాకు లేదు సార్ ...ఇక్కడే కాదు ఏ హాస్టల్‌కు అలాంటి సదుపాయం కల్పించలేదని ఆమె సమాధానమిచ్చారు. దీంతో హాస్టళ్లలో ఇన్వర్టర్ ఏర్పాటు అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానంటూ చింతా ప్రభాకర్ హామీ ఇచ్చారు)
చింతా ప్రభాకర్: ఏమ్మా చిన్నారి..నీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా..? అంటూ మూడవ తరగతి విద్యార్థి మౌనికను అప్యాయంగా ప్రశ్నించారు.
బి.మౌనిక: ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ను చూసి భయం..భయంగా...సిగ్గుపడుతూ ఉహూ.. పెద్ద సమస్యలు ఏమీ లేవు. అయితే బోరు పాడైంది అంటూ సమాధానం ఇచ్చింది. (నీ కష్టం తీరుస్తాలే చిన్నారి అంటూ మౌనిక బుగ్గలను చిదుముతూ అప్యాయంగా చెప్పారు ఎమ్మెల్యే చింతా)ఎస్సీ హాస్టల్ నుంచి బీసీ హాస్టల్ వైపు అడుగులు వేస్తూ చింతా ప్రభాకర్ పక్కనే ఉన్న విద్యార్థుల మరుగుదొడ్లను పరిశీలించారు. ఆ తర్వాత బీసీ హాస్టల్ వైపు కదిలి అక్కడ బయట ఉన్న విద్యార్థులను పలకరించారు.
చింతా ప్రభాకర్: ఏమ్మా..ఇక్కడ అంతా సౌకర్యంగానే ఉందా? అన్నీ వసతులు బాగున్నాయా?
మమత: అంతా బాగుంది సార్. సమయానికి భోజనం పెడుతున్నారు. కానీ, మాకు నీటి సమస్య ఎక్కువగా ఉంది. ఆ సమస్యను పరిష్కరించండి.
చింతా ప్రభాకర్: మీకు ఆరోగ్య సమస్యలు వస్తే ఏం చేస్తున్నారు..?హాస్టల్‌కు డాక్టర్ వచ్చి పరీక్షిస్తున్నారా?
సునీత: ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ వ చ్చి పరీక్షలు చేసి మందులు ఇస్తున్నారు. ఎప్పుడైనా ఆరోగ్య సమస్య వస్తే ఆస్పత్రికి వెళ్తున్నాము.
చింతా ప్రభాకర్: మీకు ఇంకేమైనా సమస్యలు ఉంటే ధైర్యంగా చెప్పండి?
సరస్వతి: సార్..ఈ హాస్టల్‌లో నీటి సమస్య తీవ్రంగా ఉంది. సరైన సంఖ్యలో మరుగుదొడ్లు, బాత్రూంలు లేవు. మాకు మంచి సదుపాయాలు కల్పించి సమస్యలు పరిష్కరించండి.
సంధ్య: సరైన ఫర్నీచర్ లేదు. స్టడీచైర్స్ లేవు. బెడ్స్ కావాలి. చలితో ఇబ్బంది పడుతున్నాం. మందంగా ఉన్న దుప్పట్లు సరఫరా అయ్యేలా చూడండి సార్. స్టడీ మెటీరియల్..స్పోకెన్ ఇంగ్లీషు కోచింగ్ కావాలే
అనంతరం హాస్టల్‌లోని పదవ తరగతి విద్యార్థులతో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ప్రత్యేకంగా మాట్లాడి వారి సమస్యలు ఇలా తెలుసుకున్నారు.
చింతా ప్రభాకర్: ఏమ్మా.. మీకేమైనా ఇబ్బందులు ఉన్నాయా. పరీక్షలకు ఎలా ప్రిపేర్ అవుతున్నారు?
సుమలత: సార్ పదవ తరగతి పరీక్షలకు ప్రిపేర్ కావాలని ఉన్నా...మాకు ఇంకా అవసరమైన  స్టడీ మెటీరియల్ ఇవ్వలేదు. స్టడీ మెటీరియల్ అందక ఇబ్బందులు పడుతున్నాము.
శ్రవంతి: పరీక్షలు దగ్గర పడుతున్నా ఏడు సబ్టెక్టులకు సంబంధించి ఇంకా స్టడీ మెటిరియల్ ఇవ్వలేదు. స్టడీ మెటిరీయల్ ఇప్పించేలా చర్యలు తీసుకోండి.
(స్టడీ మెటీరియల్ అందకపోవటానికి గల సమస్యను వార్డెన్‌లతో ఎమ్మెల్యే ఆరా తీశారు. సమస్య పరిష్కారానికి అప్పటికప్పుడు ఆదేశించారు)
చింతా ప్రభాకర్ : పదవ తరగతి విద్యార్థులకు ఇంకా సమస్యల ఉన్నాయా?
సిద్దమ్మ: సార్.. మాకు స్టడీ మెటీరియల్‌తోపాటు హాస్టల్‌లో స్పోకెన్ ఇంగ్లీషులో శిక్షణ ఇప్పిస్తే బాగుంటుంది. అలాగే మాకు అందజేస్తున్న కాస్మోటిక్ చార్జీలు సరిపోవటంలేదు. కాస్మొటిక్ చార్జీలను రూ.75 నుంచి రూ.150 వరకు పెంచేలా చూడండి.
ఆర్.సోనీ: సార్... మా హాస్టల్‌లో ప్రత్యేకంగా స్టడీ రూం. లైబ్రరీ ఏర్పాటు చేయిస్తే బాగుంటుంది. విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement